ఝల్కారీబాయి

కోలి యోధురాలు

ఝల్కారీబాయి (నవంబరు 22, 1830 – ఏప్రిల్ 4, 1858) [2] (హిందీ: झलकारीबाई [dʒʱəlkaːriːˈbaːi]) భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలోని సైనికురాలు.[3][4]

ఝల్కారీబాయి
గ్వాలియర్‌లో ఝల్కారీబాయి విగ్రహం
జననం(1830-11-22)1830 నవంబరు 22 [1]
భొజ్ల ఊరు, ఝాన్సి దగ్గర
మరణంఏప్రిల్ 4, 1858 (వయస్సు 27)
ఝాన్సీ, ఝాన్సీ రాష్ట్రం
ఉద్యమం1857 సిపాయిల తిరుగుబాటు
2001 భారతదేశపు స్టాంపుపై ఝల్కారీబాయి

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మించిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

మూలాలు మార్చు

  1. Sarala 1999, p. 111
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; deathdispute అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Sarala 1999, pp. 112–113
  4. Varma, B. L. (1951), Jhansi Ki Rani, p. 255, as quoted in Badri Narayan 2006, pp. 119–120
  • బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో