యుద్ధం

యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్త

యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్రక్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. చీమల దండుల మధ్య, చింపాంజీ ల సమూహాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయని జంతు శాస్త్రం అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.

భారత సైనికుల యుద్ద సన్నివేశాలు -1947

యుద్ధం చేసేవారు సైనికులు. భూమిపైన పోరాడే సైనికులను కాల్బలంగా (infantry (en)) వ్యవహరిస్తారు. సముద్రంలో పోరాడే సేనలు నౌకాదళం. ఆకాశంలో పోరాడేవి వైమానిక దళాలు. యుద్ధం ఒకే సమయంలో వివిధ రంగాలలోను, వివిధ ప్రాంతాలలోను జరుగవచ్చును. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనే సైనిక దళమే కాకుండా గూఢచారి వ్వవస్థ, సమాచార వ్వవస్థ, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్వవస్థకు చెందిన అనేక వర్గాలు యుద్ధంలో పాల్గొంటాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్ల అభివృద్ధి అయిన క్షిపణుల వంటి పరికరాలు, పేలుడు పదార్థాలు యుద్ధాల స్వరూపాన్ని గణనీయంగా మార్చివేస్తున్నాయి.

సరిహద్దులలో రెండు దేశాలకే యుద్ధాలు పరిమితం కావు. దేశం లోపల లేదా సమాజంలో వివిధ వర్గాల మధ్య జరిగే సంఘర్షణను అంతర్యుద్ధం అంటారు. కొన్ని అంతర్యుద్ధాలు దేశాల మధ్య జరిగే యుద్ధాలకు సమానంగా జన నష్టం, ఆస్తినష్టం, సమాజ వినాశనం కలిగించవచ్చు.

యుద్ధాలకు కారణాలు

మార్చు

యుద్ధాలు స్పష్టమైన ప్రకటన ద్వారా కాని, లేక అప్రకటితంగా గాని జరుగవచ్చును. యుద్ధాల కారణాలు తెలుసుకోవాలంటే శాంతి వాతావరణాలు కొనసాగే పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలి. యుద్ధాలు మొదలుపెట్టే పక్షం కారణాలు వేరు, తత్ఫలితంగా యుద్ధం చేసే పక్షం కారణం వేరు అని కూడా గ్రహించాలి. ఏదైనా యుద్ధంలో పాల్గొనే లేదా ప్రభావం కలిగి ఉన్న మూడు వర్గాలు - నాయకత్వం, సైన్యం, దేశ ప్రజలు. ఈ మూడు వర్గాలకూ యుద్ధంలో పాల్గొనటానికి వేరువేరు కారణాలు లేదా అభిప్రాయాలు ఉండవచ్చును.

జాన్ స్టోస్సింగర్ (John G. Stoessinger) అనే రచయిత Why Nations Go to War (తెలుగు అర్థం- దేశాలు ఎందుకు యుద్ధాలు చేస్తాయి) అనే తన పుస్తకంలో వ్రాసిన కొన్ని ముఖ్య విషయాలు - (1) యుద్ధంలో ఇరుపక్షాలూ తమ లక్ష్యం ధర్మబద్ధమైనదని చెప్పుకొంటాయి. (claim that morality justifies their fight) (2) యుద్ధం మొదలుపెట్టే పక్షం యుద్ధ ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న (అతి) ఆశాభావం కలిగి ఉంటుంది. (overly optimistic assessment) (3) శత్రుపక్షం స్థితిని తప్పుగా అంచనా వేస్తుంది. Fundamental attribution error (4) నాగరిక సమాజంలో సుమారు 90-95% సమాజాలు ఏదో ఒక సమయంలో యుద్ధాలలో పాల్గొన్నారు. కొన్ని సమాజాలు నిరంతరాయంగా యుద్ధాలలో గడిపాయి.[1]

వ్యయం-లాభం సిద్ధాంతాలు (Costs vs Benefits Analysis of War theories) - యుద్ధంలో అయ్యే నష్టం లేదా వ్యయం కంటే దానివలన వచ్చే ప్రయోజనం ఎక్కువని ఒక పక్షం భావించినందువలన యుద్ధం సంభవిస్తుంది. ప్రయోజనాలు చాలా రకాలుగా ఉంటాయి - ఉదా: జాతీయ గౌరవం నిలుపుకోవడం, తమ ప్రదేశపు వనరుల వల్ల ప్రయోజనాలు తమకే లభించేలా చేసుకోవడం, అన్యాయం చేసిన పక్షాన్ని శిక్షించడం (ముఖ్యంగా రెండవ పక్షం బలహీనంగా ఉన్నపుడు) - ఈ విధమైన సిద్ధాంతాల ప్రకారం ఆణుయుద్ధాల వంటి వినాశక యుద్ధాల అవకాశం తక్కువ. ఎందుకంటే ఆందువల్ల లభించే ప్రయోజనాలకంటే విపరీతాలే ఎక్కువ గనుక.

మానసిక విశ్లేషణ సిద్ధాంతాలు (Psychological theories) - మానవులు స్వభావ సిద్ధంగా తగవులాడుకొనే తత్వం కలిగి ఉన్నారు. సమాజంలో ఈ హింసాత్మక మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడప్పుడూ జరిగే యుద్ధాలు ఆ హింసా ప్రకృతికి అవకాశం కలిగిస్తాయి. (E.F.M. Durban, John Bowlby). ఇందుకు అదనంగా ప్రజలు తమలోని అశాంతిని "ఇష్టం, ద్వేషం" అనే పరిధులలో మలచుకొంటారు. displacement. అయితే ఈ సిద్ధాంతాలు యుద్ధాలకు కొన్ని కారణాలను చెబుతున్నప్పటికీ యుద్ధాలు మొదలయ్యే పరిస్థితులను కాని, సుదీర్ఘ కాలం శాంతి నెలకొని ఉండే పరిస్థితులను కాని వివరించడంలేదు. .[2] అంతే కాకుండా ఈ విశ్లేషణ ప్రకారం అసలు యుద్ధాలు రాకుండా ఆపడం అసంభవం.

మరికొంత మంది మానసిక శాస్త్రవేత్తల ప్రకారం మానసికంగా సమతుల్యత లేని నాయకత్వం కారణంగా యుద్ధాలు సంభవిస్తాయి. అయితే అత్యధిక సంఖ్యలో జనసామాన్యం వారిని అనుసరించడానికి వీరు కారణాలు చెప్పలేదు. జనసామాన్యంలో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి, అశాంతి కారణంగా అటువంటి నాయకత్వానికి అధికారం లభిస్తుందని కొందరు మానసిక శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మరి కొందరు మానసిక శాస్త్రవేత్తల ప్రకారం "మానసిక పరిణామ క్రమం" evolutionary psychology వల్ల యుద్ధాలకు కారణమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదాహరణకు జంతువుల జీవన విధానంలో ఒక ప్రాంతంపై తమ పెత్తనాన్ని లేదా స్వతంత్రతను చెలాయించాలని చూడడం అంతర్హితమైన జంతుప్రకృతి. కాని నాగరికతలో పెరిగిన మారణాయుధాల వలన ఈ సహజసిద్ధమైన ప్రకృతి, విపరీత పరిణామాలున్న యుద్ధాలుగా రూపొందింది. (Konrad Lorenz)[3] అయితే మానవుల యుద్ధాల ప్రకృతికీ, జంతుప్రకృతికీ చాలా తేడా ఉంది.[4]

ఇటలీ మానసిక విశ్లేషకుడు Franco Fornari (Melanie Klein అనుయాయుడు) - మన దృక్పథంకలోను, ఆలోచలలోను దేశం, దేశ ప్రేమ అనే అంశాలు తల్లికి సమానమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఈ అంశాలకు సగటు పౌరుడు ఇచ్చే పవిత్ర స్థానం కారణంగా వాటిని కాపాడకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. "మరణం" అనేది మనిషి త్యాగానికి పరాకాష్ఠ. తనకు పవిత్రమైన వస్తువు లేదా భావం రక్షణ కోసం తన సంకల్పస్వచ్ఛతను నిరూపించుకొనే గొప్ప వేదికయే యుద్ధం. అంతే కాకుండా సమాజంలో నాయకులు తండ్రికి పోలిన స్థానాన్ని కలిగి ఉంటారు. అందువల్లనే పౌరులు తమ నాయకత్వం పట్ల కొంత వరకు పిల్ల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు - అతిగా అభిమానించడం లేదా ద్వేషించడం లేదా తిరగబడడం వంటి చర్యలు.

సామాజిక సిద్ధాంతాలు (Sociological theories) - సామాజిక శాస్త్రవేత్తలు యుద్ధాల గురించి చాలా అధ్యయనం చేశారు. అనేక విధాలైన వివరణలు ఇచ్చారు. ఆ వివరణలలో ఏకాభిప్రాయం లేదు. ఒక సిద్ధాంతం ప్రకారం ఒక దేశపు అంతర్గత సమస్యలే యద్ధాలకు ప్రధాన కారణం (Primat der Innenpolitik - Primacy of Domestic Politics). అయితే యుద్ధం ఏ దేశం (పక్షం) పైన చేయాలనేది నిర్ణయం మాత్రం అప్పటి అంతర్జాతీయ, ఆర్థిక కారణాల వల్ల తీసుకోబడుతుంది. మరొక సిద్ధాంతం ప్రకారం అంతర్జాతీయ రాజకీయాలు యుద్ధాలకు ముఖ్యమైన కారణాలు (Primat der Außenpolitik - Primacy of Foreign Politics). నాయకత్వం, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల యుద్ధాలు సంభవిస్తాయి.

జన విస్తరణ సిద్ధాంతాలు (Demographic theories) - జనవిస్తరణ కారణంగా యుద్ధాలు సంభవించే ప్రక్రియను రెండు సిద్ధాంతాలు వివరిస్తున్నాయి - (1) మాల్తూసియన్ (Thomas Malthus) సిద్ధాంతాలు (2) యూత్ బల్జ్ (Youth Bulge) సిద్ధాంతాలు.

 
Gari Melchers, Mural of War, 1896.

మాల్తూసియన్ సిద్ధాంతాల ప్రకారం ఒక ప్రదేశంలో జనాభా పెరిగిన కొలదీ అక్కడి వనరులు వారికి సరిపోవు. అందువల్ల ఇతర ప్రాంతాల వనరులపై ఆధిపత్యం సంపాదించడానికి యుద్ధాలు అవసరమౌతాయి. జనాభా పెరుగుతూ పోతుంటుంది. అంటు వ్యాధులు, కరవు, లేదా యుద్ధాలవంటి ఉత్పాతాల వల్ల ఆ జనాభా అదుపులో ఉంటుంది -అని తామస్ మాల్తుస్ (1766–1834) తన ఆర్థిక విశ్లేషణలో చెప్పాడు.

యూత్ బల్జ్ సిద్ధాంతం కొంత భిన్నంగా ఉంటుంది. జనాభా పెరుగుదలకంటే అందులో ఉండే నిరుద్యోగ యువకుల పెరుగుదలకు ఈ సిద్ధాంతం ప్రాధాన్యత ఇస్తుంది. ఒక ప్రాంతపు జనాభా పెరిగినపుడు అందులో సాఫీగా ఉద్యోగావకాశాలు లేని జనాభా హింసాయుతమైన చర్యలవైపు మళ్ళుతుంది. వారి స్థితిని ఉపయోగించుకొనే ప్రక్రియే యుద్ధానికి ముఖ్య కారణం.[5][6][7][8][9][10]

ఈ యూత్ బల్జ్ సిద్ధాంతాన్ని శామ్యూల్ హంటింగ్‌టన్ అనే శాస్త్రవేత్త కొంత మార్పులతో నాగరికతల సంఘర్షణ సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం పై చాలా చర్చ జరిగింది. ఎక్కువగా యుద్ధాలలో చని పోయేవారు 16–30 సంవత్సరాల మధ్య వారేనని, ఉద్యోగావకాశాలు సరిపోనపుడు ఆ తరం హింసాత్మక చర్యలవైపు ఆకర్షితులౌతారని, అటువంటి పరిస్థితిని మత, రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకొని తమ వాదనలు బలం కలిగించుకొని యుద్ధ పరిస్థితులకు కారణమౌతారని ఈ సిధ్ధాంతం సారాంశం.[11]

ప్రపంచ వ్యాప్తంగా జన విస్తరణలో మార్పులు సమాజాలపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటాయని అనేక అధ్యయనాల వల్ల తెలుస్తున్నది. .[12] దేశ జనాభాలో 30 నుండి 40 శాతం వరకు "యుద్ధ వయస్కులు" అయినప్పుడు ఈ సమస్య తీవ్రతరమౌతుంది. వారికి సరైన ఉద్యోగావకాశాలు లభించవు. వారు నేరాలవైపు, సాంప్రాయేతర లైంగిక సంబంధాలవైపు ఆకర్షితులౌతారు. తమకు పోటీగా లేదా అవరోధంగా ఉన్న వర్గాలను నాశనం చేయాలనే బోధనలను పాటించడానికి ఉద్యుక్తులౌతారు. మతం లేదా సామాజిక లక్ష్యం అనే అంశాలు ఇలాంటి పరిస్థితులలో ప్రబలంగా కనిపించినప్పటికీ అవి అసలు కారణాలు కాదు. కేవలం ఈ పరిస్థితిని వాడుకొనే సాకులే. [13][14] ఈ విషయంలో చాలా అధ్యయనాలు జరిగాయి[15] అయితే ఈ విధమైన సిద్ధాంతాలు కేవలం కొన్ని మత, వయస్సు, జాతి వర్గాల పట్ల విచక్షణ ధోరణిని ప్రేరేపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.[16]

మానసిక పరిణామం సిద్ధాంతాలు (Evolutionary psychology theories) - ప్రజలలో నెలకొన్న మానసిక పరిస్థితుల కారణంగా, వారి భవిష్యత్తుకు ఏర్పడిన ముప్పును వారు అర్థం చేసుకొనే విధానమే యుద్ధాలకు ముఖ్య కారణం అని ఈ సిద్ధాంతం చెబుతుంది. దీని ఫలితంగా ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు నిరాశాజనకంగా ఉన్నాయి అనిపిస్తుంది.[17] ఈ సిద్ధాంతం ప్రకారం కూడా ఒక ప్రాంతంలో జన సాంద్రత పెరిగినపుడు అక్కడ యుద్ధ పరిస్థితులు రూపు దిద్దుకొంటాయి.[18] David Livingstone Smith రచన "The Most Dangerous Animal: Human Nature and the Origins of War" ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది.

మానసిక పరిణామం సిద్ధాంతంలో గమనించవలసిన ప్రధానాంశాలు - ఒక ప్రత్యేక ఘటనలో యుద్ధానికి సమర్థనగా చెప్పబడే విషయాలు కేవలం సాకులు మాత్రమే. ఉదాహరణలు (1) శత్రువర్గం వల్ల మనకు ముప్పు వాటిల్లుతున్నది (2) ఎదురు పక్షం యుద్ధాన్ని ప్రేరేపించింది (3) ఎదురు పక్షం అవినీతికరమైన దుశ్చర్యలు సాగించింది (4) ఎదురు పక్షం జంతువుల్లా (పాములు, ఎలుకలు, తోడేళ్ళు, నక్కలు) ప్రవర్తిస్తున్నారు (5) శత్రువులు అసలు దుష్ట స్వభావులు (6) శత్రువులు మూర్ఖులు, పిచ్చివాళ్ళు - ఇలాంటి కారణాలు రెండు పక్షాలవాళ్ళూ చెబుతారు. ఇంకా ఈ సిద్ధాంతంలోని ముఖ్యాంశం - ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో నాయకత్వాలు నిర్ణయాలు తీసుకొనే పద్ధతిలో ఏ విధమైన విచక్షణ, హేతుబద్ధత కనిపించవు. వారి చర్యలు ఎదుటివారిని శిక్షించడానికే అధికంగా ఉద్దేశించబడుతాయి.

అయితే యద్ధంలో ఒక పక్షం తమను తాము రక్షించుకొనే ప్రయత్నంలో ఉంటుందని గుర్తించాలి. కాని నిర్ణయ విధానాలు, పదజాలాలు, వివరణల విషయంలో రెండు పక్షాలూ ఒకే విధమైన నిర్హేతుక విధానాన్ని అనుసరిస్తాయి. ఇంకా ఇక్కడ గమనించవలసిందేమంటే యుద్ధానికి సరైన హేతువును కనుగొన్నంత మాత్రాన యుద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం గాని, నివారించడం గాని సాధ్యం కావు.

హేతువాద సిద్ధాంతాలు (Rationalist theories) - ఇంతకు ముందు చెప్పిన కొన్ని సిద్ధాంతాల ప్రకారం యుద్ధంలో పక్షాల నిర్ణయాలు ఉద్వేగానికి లోబడి, నిర్హేతుకంగా ఉంటాయి. కాని హేతువాద సిద్ధాంతాల ప్రకారం యుద్ధంలో రెండు పక్షాలు తమకు కలిగే లాభనష్టాలను అంచనా వేసి తదనుగుణంగానే స్పందిస్తాయి. ప్రతి యుద్ధంలోనూ దాడి చేయడం, దాడిని ఎదుర్కోవడం అనే రెండు స్పష్టమైన నిర్ణయాలు తప్పవు. కనుక యుద్ధం తరువాత ఒప్పుకోవలసిన విషయాలను యుద్ధం లేకుండానే ఒప్పుకోవడం మంచిది. అయితే ఇలా బేరసారాలతో పని ముగించకుండా దేశాలు యుద్ధంలోకి ఎందుకు చొరబడతాయి? అన్న ప్రశ్నకు ఈ సిద్ధాంతంలో మూడు కారణాలు చెబుతారు.[19]

 1. పంచుకోవడం సాధ్యం కాదు (issue indivisibility) - ఎవరో ఒకరికి ఆ విషయంపై పూర్తి హక్కు ఉండాలి.
 2. అసంపూర్ణమైన సమాచారం (information asymmetry), తప్పు దోవ పట్టించే ఉద్దేశం - అవతలి బలాలు ఇవతలివారికి సరిగ్గా తెలియకపోవచ్చును. అలాగే ఇవతలివారి బలం ఎంతో అవతలివాడికి తెలియదనుకోవచ్చును. లేదా అవతలివారి సంకల్పం ఎంత బలమైందో, ఎంతవరకు తెగించడానికి సిద్ధంగా ఉన్నారో అంచనా వేయలేకపోవచ్చును. కనుక ఎవరికి విజయం లభిస్తుందో ముందుగా రెండు పక్షాలూ సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చును.
 3. నమ్మదగిన హామీలు ఇవ్వలేకపోవడం (inability to make credible commitments) - రెండు పక్షాలూ బేరసారాలతో ఒక ఒప్పందం కుదుర్చుకొని యుద్ధాన్ని నివారించవచ్చును. కాని ఆ ఒప్పందాన్ని ఇరు పక్షాలూ గౌరవిస్తాయన్న విశ్వాసం ఉండదు. బలమైన పక్షం ఈ ఒప్పందం వల్ల మరింత బలపడి ముందుముందు ఇంకా అతిగా ఆశిస్తుందన్న భయం బలహీన పక్షానికి ఉంటుంది. లేదా బలహీనపక్షం ముందుముందు బలం పుంజుకొని ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని బలమైన పక్షం భావిస్తుంది.

హేతువాదుల సిద్ధాంతంపై ఉన్న విమర్శలు - దేశాలు అంటే తమ ప్రయోజనాలను సరిగ్గా అర్థం చేసుకొని నిర్ణయించే వ్యక్తులు అనుకోకూడదు. కనుక వారి నిర్ణయాలు ఒక వ్యక్తి ఆచితూచి అడుగేసినట్లుండవు. అనేక వర్గాల ఉమ్మడి భావాలు ఈ నిర్ణయాలలో కలగలిసి ఉంటాయి. చాలా విషయాలలో ఒప్పందానికి ఆస్కారం అత్యల్పం. బలమైన పక్షం నిబంధనలు ఒప్పుకొంటే అది బలహీనపక్షానికి మృత్యుసమానం కావచ్చును.

ఆర్థిక కారణాల సిద్ధాంతాలు (Economic theories) - అంతర్జాతీయ వాణిజ్యం రంగంలో పెరిగే పోటీల ఫలితంగా ఏర్పడే గందరగోళం యుద్ధాలకు కారణమౌతుందని ఈ సిద్ధాంతాల సారం. క్రొత్త మార్కెట్ల అభివృద్ధికి, ముడి సరకుల ఉత్పాదనపై నియంత్రణకు, సంపదను హస్తగతం చేసుకోవడానికి యుద్ధం ఉపయోగపడుతుంది. ఇలా పేదవారి ప్రాణాలు బలితీసుకొనే యుద్ధాలు సంపన్నుల ఆర్థిక ప్రయోజనాలను పెంపొందిస్తాయని ప్రధానంగా వామపక్షవాదులు పేర్కొంటారు. ఈ దృక్పథంపై విమర్శలు ఉన్నప్పటికీ చాలా మంది ఈ విధమైన వివరణలో కొంత సత్యాన్ని అంగీకరించారు - ఉదారణకు,

ఆధునిక ప్రపంచంలో యుద్ధాలకు మూల బీజాలు పారిశ్రామిక, వ్యాపార రంగాలలోని స్పర్థలలోనే నెలకొని ఉన్నాయన్న విషయం మీద ఎవరికైనా సందేహం ఉందా? - వుడ్రో విల్సన్, సెప్టెంబరు 11, 1919.[20]

నేను సైన్యంలో గడిపిన 33 సంవత్సరాలూ పెద్ద పెద్ద వ్యాపారులకు హై క్లాసు గూండాగా గడిపినట్లే. క్లుప్తంగా నేను పెట్టుబడిదారుల గ్యాంగులో గడిపాను. - అమెరికాలో అత్యన్నత స్థాయి సైనిక పురస్కారాలు పొందిన మేజర్ జనరల్ స్మెడ్లీ బట్లర్ [21]

మార్క్సిస్టు సిద్ధాంతాలు (Marxist theories) - మార్క్సిస్టుల అభిప్రాయం ప్రకారం ధనిక, పేద వర్గ పోరాటాలలో యుద్ధాలు కూడా ఒక భాగం. రెండు దేశాలలోని కార్మికులను ఒకరిపై ఒకరిని ఉసికొలిపి, వారి మధ్య ఐక్యతను భంగం చేసి, ఆ రెండు దేశాల పెట్టుబడిదారులు లాభం పొందుతారు. కనుక యుద్ధాలు పెట్టుబడిదారి వ్యవస్థలో అంతర్హితమైన ఒక సాధనం. ప్రపంచ సామ్యవాద విప్లవంతోనే యుద్ధాలు ఆగిపోగలవు.

రాజకీయ శాస్త్రం సిద్ధాంతాలు (Political science theories) - లూయిస్ ఫ్రై రిచర్డ్సన్, పీటర్ బ్రెకర్ వంటి రాజకీయ శాస్త్రజ్ఞులు యుద్ధాల గణాంకాలపై లోతుగా అధ్యయనం చేశారు. ఒక అభిప్రాయం ప్రకారం (realism in international relations) దేశాలు తమ భద్రతను పదిల పరచుకోవడానికి యుద్ధ మార్గాన్నే ఎంచుకొంటాయి. ఇందుకు భిన్నంగా democratic peace theory ప్రకారం సరైన ప్రజాస్వామ్యం కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధాలు జరిగే అవకాశం తక్కువ. అంతే కాకుండా మత భావాలు, ఆర్థిక విభేదాలు, వాణిజ్య సమస్యలు, స్వతంత్ర ప్రకటనలు వంటి అనేక కారణాల వలన యుద్ధాలు సంభవిస్తాయి.

మరొక రాజకీయ సిద్ధాతం power in international relations, machtpolitik అనే అంశాలపైన ఆధారపడి ఉంది. ఈ సిద్ధాంతాన్ని Power Transition theory అంటారు. దీని ప్రకారం ప్రపంచంలో అధికారం కొన్ని అంతస్తులుగా విభజింపబడి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న స్థాయిని మరొక స్థాయిలోనివారు తొలగించడానికి యుద్ధం ఉపయోగపడుతుంది.

యుద్ధాల ఫలితాలు, పరిణామాలు

మార్చు

కొన్ని యుద్ధాలు దేశ చరిత్ర పైన, భవిష్యత్తు పైన, ప్రజల జీవనంపైన గాఢమైన ఫలితాలను కలిగిస్తాయి.

సైన్యం పై

యుద్ధ రంగంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడే సైనికులు తీవ్రమైన శారీరిక, మానసిక అనుభవాలను ఎదుర్కొంటారు. మరణించిన వారి జీవితం అంతటితో సమసిపోయినా వారి కుటుంబాలకు అది చిరకాల బాధాకారణమౌతుంది. గాయపడినవారు మానసికంగాను, శారీరికంగాను, ఒకోమారు జీవితాంతం, అనేక వైకల్యాలతో బ్రతుకు గడపవలసి వస్తుంది.

సామాన్య జనానీకంపై

జన నష్టంతో పాటు ఆస్తి నష్టం, ఆర్థిక వ్యవస్థ గందరగోళం, మానసిక వత్తిడులు సామాన్య జనానీకంపై ప్రగాఢమైన ప్రభావం కలిగి ఉంటాయి. నేరము, శిక్ష, ద్వేషం, జాతి వైరం, తెగింపు వంటి భావాలు సమాజాన్ని చాలాకాలం అంటిపెట్టుకొని ఉంటాయి.

ఆర్థిక వ్యవస్థపై

సమాజం ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. కోలుకోవడానికి సంవత్సరాలు లేదా దశాబ్దాలు పట్టవచ్చును. దేశ వనరులు చాలావరకు ప్రగతి నుండి సైనిక అవసరాలకు కేటాయింపబడవచ్చును.

రాజకీయాలపై

దేశంలో నెలకొన్న సంక్షోభం వల్ల, జనంలో రేకెత్తిన తీవ్ర భావాల వల్ల ప్రజలను రెచ్చ కొట్టే నాయకులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే అవకాశం ఎక్కువవుతుంది.

ఇతరాలు

అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, మందు పాతరలు వంటి వాటి వినియోగాల వల్ల ఆరోగ్యం, జీవనం అస్తవ్యస్తం కావచ్చును.

యుద్ధాలలో రకాలు

మార్చు
కారణాన్ని బట్టి

ధర్మకారణమైన యుద్ధం సిద్ధాంతం - అనే సూత్రాలను కేతలిక్ చర్చికి చెందిన United States Catholic Bishops pastoral letter లో నాలుగు కారణాలను పేర్కొన్నారు. ఒక ఆశయం కోసం - ఉదాహరణకు కమ్యూనిజమ్ ను రక్షించడానికి, లేదా అడ్డుకట్ట వేయడానికి, నియంతలను తొలగించడానికి, ప్రజల స్వాతంత్ర్యేచ్ఛకు సాయపడడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి - కొన్ని యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇవి ఆ యుద్ధంలో ఒక పక్షానికే సమర్ధనగా వర్తిస్తాయి. సహజంగానే రెండో పక్షం వీటిని ఏ మాత్రం గౌరవించదు.

విధానాన్ని బట్టి

సంప్రదాయ యుద్ధంలో ఆయుధాలతో ఎదురు పక్షాన్ని బలహీనపరచి వారికి ఓటమి కలుగజేస్తారు. ఇది స్పష్టంగా ప్రకటించబడిన ప్రత్యక్ష పోరాటం. సాంప్రదాయేతర యుద్ధంలో ప్రత్యక్షంగా సైనిక పోరాటం జరుగకపోవచ్చును. ఆర్థిక, గూఢచార, బల ప్రయోగాది చర్యలతో ఎదటి పక్షాన్ని లొంగదీసుకోవచ్చును.

అంతర్యుద్ధంలో ఒకే దేశపు వర్గాల మధ్య పోరాటం జరుగుతుంది. ఇలాంటి పోరాటం సాయుధ చర్యల ద్వారా కాని లేదా రాజకీయ, సాంఘిక, ఆర్థిక చర్యల ద్వారా కాని జరుగవచ్చును. అసౌష్టవ యుద్ధం అంటే రెండు పక్షాలకూ బలంలో ఏ మాత్రం పొంతన ఉండదు. ఒక పక్షం అధిక బలం కలిగి ఉండవచ్చును. ఇలాంటి పరిస్థితులలో ఒక పక్షం గెరిల్లా యుద్ధం వంటి వ్యూహాన్ని ఎంచుకొనే అవకాశం ఉంది.

యుద్ధాలలో అనాదిగా వస్తున్న ఆయుధాలకు తోడుగా ఇటీవలి కాలంలో సాంకేతిక విషయాల ప్రాధాన్యత పెరిగింది. అణ్వస్త్రాలు, రసాయనిక ఆయుధాలు వంటివి క్రొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి.

విధానం ఉదాహరణ
దోపిడి యుద్ధం 9-13 శతాబ్దాలలో పెచెనెగ్మరియు క్యుమన్ దళాలు రుస్ పై చేసిన దాడులు
దండయాత్రలు క్రీ.పూ. 326-323 కాలంలో అలెక్జాండర్ దండయాత్రలు
వలస యుద్ధాలు చైనా - ప్రెంచి యుద్ధాలు
సామ్రాజ్యంపై తిరుగుబాటు అల్జీరియా యుద్ధం
మత యుద్ధాలు క్రూసేడులు
వంశ పరంపర యుద్ధాలు స్పానిష్ వంశపు యుద్ధాలు
వాణిజ్య యుద్ధాలు నల్లమందు యుద్ధాలు
తిరుగుబాటు యుద్ధాలు ఫ్రెంచి విప్లవం యుద్ధాలు
గెరిల్లా యుద్ధాలు పెనిన్సులార్ యుద్ధాలు
అంతర్యుద్ధాలు స్పానిష్ అంతర్యుద్ధం
వేర్పాటు యుద్ధాలు అమెరికా స్వతంత్ర యుద్ధం
అణు యుద్ధాలు రెండవ ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాలు వాడారు. కాని ఇంతవరకు పూర్తి స్థాయి అణుయుద్ధం జరుగలేదు.

యుద్ధాల నైతికత

మార్చు
 
మై లాయ్ ఊచకోత.

అనాదిగా చరిత్రలో యుద్ధాల గురించి కొన్ని తీవ్రమైన నైతిక, ధార్మిక ప్రశ్నలు ఉంటున్నాయి. పూర్వకాలంలో యుద్ధం ఒక ఉన్నతమైన పని అనీ, విజయం అనేది వారి శక్తికి తగిన ప్రతిఫలం అనీ భావన ఉండేది. కాని కాలక్రమంలో యుద్ధాలు అనైతికమైన, అమానుషమైన చర్యలన్న అభిప్రాయం బలపడుతూ వస్తున్నది. కాని యుద్ధానికి సన్నద్ధులై ఉండడం, అవసరాన్ని బట్టి యుద్ధం చేయగలిగి ఉండడం అనే అంశాలు దేశ, జాతి రక్షణకు అత్యంత మౌలికమైన అవసరాలని భావిస్తున్నారు. అయితే యుద్ధం ఎలాంటి సందర్భంలోనైనా అనైతికమేననీ, యుద్ధాలు జరుగకూడదనీ కొందరు శాంతివాదుల విశ్వాసం. మొత్తానికి యుద్ధాలపట్ల విముఖత ఇటీవలి కాలంలో పెరిగిందని చెప్పవచ్చును.

యుద్ధాలను సమర్ధించేవారు కొందరు చెప్పిన కారణాలిలా ఉన్నాయి: హెన్రిక్ వాన్ ట్రిష్కే వాదన ప్రకారం ధైర్యం, గౌరవం అనే సద్గుణాలను ప్రదర్శించడానికి, వాటికి సానబెట్టడానికి అత్యధిక స్థానంలో ఉన్న వేదిక యుద్ధం. ఈ గుణాలు జీవితంలో ఇతర కార్యాలలో కూడా అవసరమైనవే. ఫ్రెడరిక్ నీషే కూడా ఇలాగే అభిప్రాయపడ్డాడు. Übermensch తమ ధైర్యం, సాహసం, నాయకత్వం, క్రమశిక్షణ వంటి సుగుణాలను ప్రదర్శించే అత్యుత్తమమైన వేదిక యుద్ధం. జార్జ్ విల్‌హెల్మ్ ఫ్రెడరిక్ కూడా యుద్ధాన్ని సమర్ధించాడు. మానవ నాగరికత ప్రగతికి, వికాసానికి చరిత్రలో ముఖ్యమైన తోడ్పాటుగా యుద్ధాలు పనిచేశాయన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో థామస్ మాన్ ఇలా వ్రాశాడు - "స్తబ్దమైన శాంతి అనేది పౌర జీవనంలో ఒక లంచగొండి విధానం కాదా? యుద్ధం ఈ స్తబ్దతనుండి విముక్తిని కలిగించే ఆశాదీపం కాదా?" ఇదే అభిప్రాయాన్ని పురాతన గ్రీకు నగరాలైన స్పార్టా వంటి సమాజాలు, పురాతన రోమన్ సమాజం, 1930 దశకంలోని ఫాసిస్టు రాజ్యాలు సమర్ధిస్తూ వచ్చాయి.

అంతర్జాతీయ న్యాయం కేవలం రెండు పరిస్థితులలోని యుద్ధాలే న్యాయపరమైనవిగా అంగీకరిస్తున్నాయి:

 1. రక్షణ యుద్ధాలు: వేరే దేశం దండెత్తి వచ్చినపుడు తమ దేశాన్ని రక్షించుకోవడానికి చేసే యుద్ధం న్యాయపరమైనది.
 2. en:UN Security Councilఐక్య రాజ్య సమితి భద్రతా సమితి ఆమోదించిన యుద్ధాలు: ఐక్య రాజ్య సమితి ద్వారా ఒక దేశంపై యుద్ధం అవసరమని అంగీకరించినపుడు. ఉదాహరణకు శాంతి పరిరక్షణ యుద్ధాలు

అంతర్జాతీయ న్యాయంలో "యుద్ధ న్యాయాలు" విభాగం యుద్ధాలకు సంబంధించిన కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్వచిస్తుంది - వాటిలో జెనీవా ఒడంబడికలు కూడా ఉన్నాయి. ఏ ఆయుధాలను అసలు వినియోగించకూడదో, యుద్ధంలో పట్టుబడినవారి పట్ల ఎలా ప్రవర్తించాలో అందులో ఉంది. వాటిని ఉల్లంఘించిన చర్యలను యుద్ధ నేరాలుగా పరిగణిస్తారు.

యుద్ధాలు ముగించే కారణాలు

మార్చు

యుద్ధం అంతమై శాంతినెలకొనే పరిస్థితులు అప్పటి రాజకీయ, ఆర్థిక స్థితిగతులు (facts on the ground) పై ఆధారపడి ఉంటాయి. ఇరు పక్షాలూ ఇంచుమించు సమమైన బలం కలిగి ఉంటే అప్పటివరకు జరిగిన జననష్టం, ఆస్తి నష్టం వారిచే యుద్ధాన్ని ఆపేలా చేస్తాయి. దేశాలు క్రొత్త సరిహద్దులు ఏర్పరచుకొనవచ్చును. క్రొత్త ఒడంబడికలు చేసుకోవచ్చును. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత "వర్సెయిల్స్ ఒడంబడిక" జరిగింది.

మరొక రకంగా ఒక పక్షం లొంగిపోయినపుడు (సైనిక లొంగుబాటు) యుద్ధం ఆగిపోతుంది. ఉదాహరణకు రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ సంపూర్ణంగా (షరతులు లేకుండా) లొంగిపోయింది. ( Surrender of Japan)

కొన్ని యుద్ధాలలో ప్రతిపక్షం లేదా వారి పాలనా ప్రాంతం పూర్తిగా నాశనం చేయబడుతుంది. 149లో కార్థీజ్ యుద్ధం ఇలాంటిదే. ఇందులో రోమన్లు ఎదురిపక్షం నగరాలను పూర్తిగా తగలబెట్టి వారి పౌరులను బానిసలుగా చేసుకొన్నారు.

కొన్ని యుద్ధాలు లేదా యుద్ధాలవంటి చర్యలలో వాటి లక్ష్యాలను స్పష్టంగా సాధించవచ్చును. కొన్ని యుద్ధాలు తరాల తరబడి గెరిల్లా యుద్ధాలలాగా కొనసాగుతుంటాయి. ఒకోమారు యుద్ధం మొదలుపెట్టిన పక్షం తమ ప్రయత్నాలను విరమించుకోవచ్చును. కొన్ని సందర్భాలలో యుద్ధం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి రాజకీయ ఒడంబడికల ద్వారా ఇరు పక్షాలూ ఒక నిర్ణయానికి రావచ్చును.

కొన్ని యుద్ధాలలో మృతుల సంఖ్య

మార్చు

ఈ యుద్ధాలకు సంబంధించిన మరణాలలో కరువు, వ్యాధులు, క్షతగాత్రులైన వీరుల మరణాలన్నీ మొత్తంగా చేర్చబడ్డాయి.

యుద్ధాలలో వ్యూహాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
ప్రపంచ యుద్ధాలు
భారత దేశంలో

మూలాలు

మార్చు
 1. "Review: War Before Civilization". Archived from the original on 2010-11-21. Retrieved 2008-08-05.
 2. Turnbull, Colin (1987), "The Forest People" (Touchstonbe Books)
 3. Lorenz, Konrad "Darian" (Oxford University Press)
 4. Montagu, Ashley (1976), "The Nature of Human Aggression" (Oxford University Press)
 5. Bouthoul, Gaston: "L`infanticide différé" (deferred infanticide), Paris 1970
 6. Goldstone, Jack A.: "Revolution and Rebellion in the Early Modern World", Berkeley 1991; Goldstone, Jack A.: "Population and Security: How Demographic Change can Lead to Violent Conflict", [1] Archived 2009-09-28 at the Wayback Machine
 7. Fuller, Gary: "The Demographic Backdrop to Ethnic Conflict: A Geographic Overwiew", in: CIA (Ed.): "The Challenge of Ethnic Conflict to National and International Order in the 1990s", Washington 1995, 151-154
 8. "Fuller, Gary (2004): "The Youth Crisis in Middle Eastern Society"". Archived from the original on 2020-04-08. Retrieved 2008-08-05.
 9. Fuller, Gary (2003): "The Youth Factor: The New Demographics of the Middle East and the Implications for U.S. Policy"[2] Archived 2007-08-10 at the Wayback Machine
 10. Gunnar Heinsohn (2003): "Söhne und Weltmacht: Terror im Aufstieg und Fall der Nationen" ("Sons and Imperial Power: Terror and the Rise and Fall of Nations"), Zurich 2003), available online as free download (in German) [3] Archived 2008-10-10 at the Wayback Machine
 11. ‘So, are civilizations at war?’, Interview with Samuel P. Huntington by Michael Steinberger, The Observer, Sunday October 21, 2001.[4] -
  I don't think Islam is any more violent than any other religions, and I suspect if you added it all up, more people have been slaughtered by Christians over the centuries than by Muslims. But the key factor is the demographic factor. Generally speaking, the people who go out and kill other people are males between the ages of 16 and 30....During the 1960s, 70s and 80s there were high birth rates in the Muslim world, and this has given rise to a huge youth bulge. But the bulge will fade. Muslim birth rates are going down; in fact, they have dropped dramatically in some countries. Islam did spread by the sword originally, but I don't think there is anything inherently violent in Muslim theology.
 12. Helgerson, John L. (2002): "The National Security Implications of Global Demographic Trends"[5] Archived 2017-10-10 at the Wayback Machine
 13. Consequently, youth bulge theorists see both past "Christianist" European colonialism and imperialism and today's "Islamist" civil unrest and terrorism as results of high birth rates producing youth bulges. - Heinsohn, G.(2005): "Population, Conquest and Terror in the 21st Century." [6]
 14. Urdal, Henrik (2004): "The Devil in the Demographics: The Effect of Youth Bulges on Domestic Armed Conflict," [7],
 15. Population Action International: "The Security Demographic: Population and Civil Conflict after the Cold "[8] Archived 2007-07-13 at the Wayback Machine
 16. Hendrixson, Anne: "Angry Young Men, Veiled Young Women: Constructing a New Population Threat" [9]
 17. Henson, H. Keith. "Evolutionary Psychology, Memes and the Origin of War". The Mankind Quarterly. Archived from the original on 2008-10-11. Retrieved 2008-08-05.
 18. (These ideas above are actually old International Relations ideas and are not based on Evolutionary Psychology at all, in fact they are not consistent with the Theory of Evolution and so cannot be Evolutionary Psychology theories. A central tenet of the Theory of Evolution is that populations quickly fill their ecological niches, creating selective pressure for the most fit. In effect, a "bleak future" is a given over evolutionary time, in fact this insight of Malthus's lead Darwin to the Theory of Evolution, and it is maladaptive to wait until you perceive it coming, when your attack will be anticipated. It is also maladaptive to not take the opportunity to gain habitat and women by attacking your neighbor when they are weak. When the bleak future arrives they may be strong or have new allies. Maladaptive behaviors cannot be selected for. So the ideas above do not mesh with the theory which is central to Evolutionary Psychology. Nor do they fit with the anthropological record which Evolutionary Psychology always seeks to corroborate its ideas with.)
 19. Fearon, James D. 1995. "Rationalist Explanations for War." International Organization 49, 3: 379-414. [10] Archived 2009-09-28 at the Wayback Machine
 20. The Papers of Woodrow Wilson, Arthur S. Link, ed. (Princeton, N.J.: Princeton University Press, 1990), vol. 63, pp. 45–46.
 21. 1935 issue of "the non-Marxist, socialist" magazine, Common Sense.
 22. Wallinsky, David: David Wallechinsky's Twentieth Century : History With the Boring Parts Left Out, Little Brown & Co., 1996, ISBN 0-316-92056-8, ISBN 978-0-316-92056-8 - cited by White
 23. Brzezinski, Zbigniew: Out of Control: Global Turmoil on the Eve of the Twenty-first Century, Prentice Hall & IBD, 1994, ASIN B000O8PVJI - cited by White
 24. Ping-ti Ho, "An Estimate of the Total Population of Sung-Chin China", in Études Song, Series 1, No 1, (1970) pp. 33-53.
 25. Mongol Conquests
 26. "The world's worst massacres Whole Earth Review". Archived from the original on 2012-06-30. Retrieved 2012-06-30.
 27. "Battuta's Travels: Part Three - Persia and Iraq". Archived from the original on 2008-04-23. Retrieved 2008-08-05.
 28. McFarlane, Alan: The Savage Wars of Peace: England, Japan and the Malthusian Trap, Blackwell 2003, ISBN 0-631-18117-2, ISBN 978-0-631-18117-0 - cited by White
 29. "Taiping Rebellion - Britannica Concise". Archived from the original on 2007-12-15. Retrieved 2008-08-05.
 30. Nuclear Power: The End of the War Against Japan
 31. Timur Lenk (1369-1405)
 32. Matthew's White's website (a compilation of scholarly estimates) -Miscellaneous Oriental Atrocities
 33. "Russian Civil War". Archived from the original on 2010-12-05. Retrieved 2008-08-05.
 34. "Oromo Identity". Archived from the original on 2012-09-05. Retrieved 2012-09-05.
 35. "Glories and Agonies of the Ethiopian past". Archived from the original on 2012-01-14. Retrieved 2008-08-05.
 36. "Inside Congo, An Unspeakable Toll". Archived from the original on 2008-12-20. Retrieved 2008-08-05.
 37. Conflict in Congo has killed 4.7m, charity says
 38. "Come Back, Colonialism, All is Forgiven". Archived from the original on 2013-08-22. Retrieved 2008-08-05.
 39. The Thirty Years War (1618-48)
 40. Cease-fire agreement marks the end of the Korean War on July 27, 1953.
 41. Huguenot Religious Wars, Catholic vs. Huguenot (1562-1598)
 42. "Shaka: Zulu Chieftain". Archived from the original on 2008-02-09. Retrieved 2008-08-05.
 43. K. S. Lal: Growth of Muslim Population in Medieval India, 1973
 44. Matthew White's Death Tolls for the Major Wars and Atrocities of the Twentieth Century
 45. Missing Millions: The human cost of the Mexican Revolution, 1910-1921
 46. Timeline: Iraq
 47. Jones, Geo H., Vol. 23 No. 5, pp. 254
 48. "The Deadliest War". Archived from the original on 2007-09-27. Retrieved 2008-08-05.
 49. Clodfelter, cited by White
 50. Urlanis, cited by White
 51. Northern War (1700-21)
 52. "The curse of Cromwell". Archived from the original on 2012-03-02. Retrieved 2008-08-05.
 53. (Albigensian Crusade) క్రూసేడులు (1208-49)
 54. Massacre of the Pure Archived 2008-01-20 at the Wayback Machine, Time, April 28, 1961
 55. "Attacks raise spectre of civil war". Archived from the original on 2008-12-23. Retrieved 2008-08-05.
 56. "Journalists in Algeria are caught in middle". Archived from the original on 2008-01-24. Retrieved 2008-01-24.
 57. Peasants' War, Germany (1524-25)
 58. "Russian Federation: What justice for Chechnya's disappeared? - Amnesty International". Archived from the original on 2009-10-05. Retrieved 2008-08-05.

వనరులు

మార్చు

మూస:వికీఖోట్

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=యుద్ధం&oldid=4185860" నుండి వెలికితీశారు