టి.ఎన్.చతుర్వేది
త్రిలోకీ నాథ్ చతుర్వేది (1928 జనవరి 18 -2020 జనవరి 5) దాదాపు 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ పరిపాలనా వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో పనిచేసాడు. అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిగా, కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసాడు. భారత పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు. కర్నాటక, కేరళల గవర్నరుగా పనిచేసాడు. ప్రజాసేవకు గాను 1991 లో పద్మవిభూషణ్ అందుకున్నాడు.[1] అనేక విద్యా, పరిశోధన, సాహిత్య, దాతృత్వ సంస్థలలో సభ్యునిగా, వివిధ నాయకత్వ సామర్థ్యాలలో చతుర్వేదికి అనుబంధం ఉంది.
టి.ఎన్.చతుర్వేది | |
---|---|
9 వ కర్ణాటక గవర్నరు | |
In office 2002 ఆగస్టు 21 – 2007 ఆగస్టు 20 | |
అంతకు ముందు వారు | వి.ఎస్.రమాదేవి |
తరువాత వారు | రామేశ్వర్ ఠాకూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | త్రిలోక్ నాథ్ చతుర్వేది 1928 జనవరి 18 కన్నౌజ్, ఉత్తర ప్రదేశ్, బ్రిటిషు భారతదేశం |
మరణం | 2020 జనవరి 5 నోయిడా, ఉత్తర ప్రదేశ్ | (వయసు 91)
జాతీయత | భారతీయుడు |
పురస్కారాలు | పద్మ విభూషణ్ (1991) |
ప్రారంభ జీవితం, విద్య
మార్చుత్రిలోకి నాథ్ చతుర్వేది 1928 జనవరి 18 న ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతంలోని తిర్వా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి, పండిట్ కమతా నాథ్ చతుర్వేది, న్యాయవాది, హోమియోపతి వైద్యుడు. అతనికి ఒక సంవత్సరం లోపు వయస్సులోనే తల్లి విద్యావతిని కోల్పోయాడు. స్థానిక గ్రామ పాఠశాలలో ఆపై కళాశాలలో చదివిన తర్వాత అతను కాన్పూర్‌లోని క్రైస్ట్ చర్చి కళాశాలలో చేరాడు. తరువాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ నుండి MA LLB పట్టా పొందాడు. అతను MA లో ఫస్ట్ క్లాస్‌గా నిలిచి, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు. అతను ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (PCS) పరీక్షకు హాజరై, మొత్తం దేశంలో మొదటి స్థానంలో నిలిచాడు. అప్పట్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షకు కూడా కూర్చుని ఎంపికయ్యాడు. అతను 1952 లో ప్రకాశవతి దూబే (1933–89)ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.
సివిల్ సర్వీస్ (1950-84)
మార్చు1950లో, త్రిలోకీ నాథ్ చతుర్వేది భారత రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత వచ్చిన మొట్టమొదటి IAS బ్యాచ్‌లోకి ఉన్నాడు. అతను ఢిల్లీలోని మెట్‌కాల్ఫ్ హౌస్‌లో శిక్షణ పొందాడు. అలహాబాద్, మొరాదాబాద్‌లలో పనిచేస్తూ శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాజస్థాన్ కేడర్ ఐఎఎస్‌లో చేరాడు. అక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా,[2] అజ్మీర్ జిల్లా కలెక్టరుగా చేసాడు. పరిశ్రమలు, గనులు, టౌన్ ప్లానింగ్, పర్యాటకం విభాగాల్లో కార్యదర్శి వంటి వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీకి కూడా ఛైర్మన్‌గా చేసాడు. అజ్మీర్‌లో ఉన్న సమయంలో, మొయినుద్దీన్ చిస్తీ చారిత్రిక దర్గా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని క్లియర్ చేసాడు. మురికివాడలు, ఆక్రమణలను తొలగించిన తరువాత, విశాలమైన రహదారితో పాటు సమీపంలో మార్కెట్‌ను కూడా నిర్మించారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ప్రపంచ బ్యాంకు విభాగం) లో ఫెలోగా, అతను 1950 లలో అమెరికాలో చదువుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, చికాగో విశ్వవిద్యాలయాలను సందర్శించాడు. హెన్రీ కిస్సింజర్, జార్జ్ ఎఫ్ కెన్నన్, జాన్ కెన్నెత్ గల్బ్రైత్ వంటి పండితులను, పరిపాలకులనూ కలిశాడు.
TN చతుర్వేది రాజస్థాన్ పరిపాలనలో 17 సంవత్సరాల సేవ తర్వాత 1967 లో కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్ళాడు. ముస్సోరీ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (తరువాత లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) జాయింట్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 1967 నుండి 1971 వరకు అక్కడ పనిచేశాడు. ఈ అకాడమీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మొదలైన అన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో కొత్తగా చేరిన సభ్యులకు శిక్షణనిచ్చే కేంద్రం. ఈ కాలంలో అక్కడ శిక్షణ పొందిన ప్రసిద్ధులలో గోపాల్ గాంధీ, వజాహత్ హబీబుల్లా, అరుణా రాయ్ ఉన్నారు. అతను ఢిల్లీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా నియమితుడై, 1971 నుండి 1973 వరకు పనిచేశాడు.
1976లో చండీగఢ్ చీఫ్ కమీషనర్‌గా నియమితుడై, ఎమర్జెన్సీ కాలంలో అక్కడే ఉన్నాడు. ప్రధాన కమిషనర్‌గా, చండీగఢ్ పరిపాలనా అధిపతిగా ఉన్నారు. అతని పదవీ కాలంలో, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లోని ఉద్యోగుల కోసం క్వార్టర్స్ నిర్మించడం అతని విజయాలలో ఒకటి. తద్వారా దీర్ఘకాల డిమాండ్ నెరవేరింది.
ఎమర్జెన్సీ వ్యవధి ముగింపులో, అతను 1978లో రాజస్థాన్ ఇండస్ట్రియల్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RMIDC) ఛైర్మన్‌గా తిరిగి రాజస్థాన్‌కు బదిలీ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA)కు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. TN చతుర్వేది కొత్త సిబ్బందిని నియమించాడు, నిర్వాహకులకు మిడ్-కెరీర్ రిఫ్రెషర్ కోర్సులుగా ఉపయోగపడే విద్యా కార్యక్రమాల అమలును ప్రోత్సహించాడు. అతని సంపాదకత్వంలో, ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దాని రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పత్రికగా మారింది. TN చతుర్వేది 1959లో IIPAలో సభ్యునిగా చేరారు. అతను 1970 నుండి 2002 వరకు IIPA యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నాడు.
1982లో విద్యా మంత్రిత్వ శాఖలో కేంద్ర విద్యా కార్యదర్శిగా కొంతకాలం పనిచేసాడు. ఆ సమయంలో విద్యా మంత్రిత్వ శాఖలో క్రీడలు, స్త్రీ శిశు సంక్షేమం, సంస్కృతి, విద్య మంత్రిత్వ శాఖలు కూడా కలిసి ఉండేవి. అతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కేంద్ర హోం కార్యదర్శిగా నియమితుడై, 1984 వరకు ఈ పదవిలో కొనసాగాడు. హోం సెక్రటరీగా, అతను కాశ్మీర్, పంజాబ్‌లలో అల్లర్లు, అస్సాంలో చొరబాటుదారులకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక సమస్యలతో వ్యవహరించాడు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
మార్చుకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG, 1984–90)గా నియమితులైన తర్వాత అతను IAS నుండి రిటైర్ అయినట్లు భావించారు. CAG అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. దాని నియామకం రాష్ట్రపతి చేస్తారు. టీఎన్ చతుర్వేది కాగ్ కార్యాలయాన్ని ఆధునీకరించే ప్రక్రియను ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా అతను కార్యాలయ పరిపాలనా నిర్మాణంలో మార్పులు చేసాడు. ఇది CAG అధికారులకు అవకాశాల విస్తరణకు దారితీసింది, దానిని మరింత సమర్థవంతంగా చేసింది. శాస్త్రీయ ఆడిట్, ఉమ్మడి ఆడిట్, అంతర్గత ఆడిట్ వంటి కొత్త అంశాలను ప్రవేశపెట్టాడు. ఇతర దేశాల ఆడిట్ సంస్థలతో అనుసంధానం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఇది భారత్‌లో అనేక దేశాల ఆడిట్ అధికారులకు శిక్షణను అందించడం, ఐక్యరాజ్యసమితి ఆడిటర్‌ను ఎంపిక చేసే ప్యానెల్లో చేరడంతో ముగిసింది. ఆడిట్ నివేదికలను సామాన్యులకు మరింత అర్థమయ్యేలా చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ నివేదికలను మీడియా ప్రజల్లోకి తీసుకురావడంతో సాంప్రదాయకంగా కాగ్‌కు ఉంటూ వచ్చిన తక్కువ స్థాయి ప్రొఫైల్ అకస్మాత్తుగా పెరిగింది. 1989 లో సైన్యం స్వీడిష్ బోఫోర్స్ తుపాకీ కొనుగోలుకు సంబంధించిన ఆడిట్ నివేదికను విడుదల చేసిన తర్వాత CAG, వ్యక్తిగతంగా చతుర్వేది లపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోపల, వెలుపల దాడి చేసాయి.[2]
రాజకీయ జీవితం
మార్చుబిజెపి నాయకులు డాక్టర్ మురళీ మనోహర్ జోషి, అటల్ బిహారీ వాజ్‌పేయి అభ్యర్థన మేరకు 1991 లో టిఎన్ చతుర్వేది భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరాడు. కన్నౌజ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 1992, 1998 లో ఉత్తర ప్రదేశ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. బిజెపిలో అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన జాతీయ కౌన్సిల్‌లో చతుర్వేది సభ్యుడు. అతను చురుకైన పార్లమెంటేరియన్, రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్‌లో ఉన్నారు. అతను పరిశ్రమపై కమిటీకి, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీకీ ఛైర్మన్‌గా ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, పబ్లిక్ అకౌంట్స్, మనీలాండరింగ్, పేటెంట్లు, సెక్యూరిటీస్ స్కామ్‌పై కమిటీలలో కూడా సభ్యుడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఏషియాటిక్ సొసైటీ (కోల్‌కతా)లో సభ్యుడు. ఆయన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) సొసైటీకి (ప్రస్తుతం ప్రైమ్ మిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పేరు మార్చారు) వైస్-ఛైర్మనుగా దాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు (2001-04) చైర్మనుగా పనిచేసాడు. 2001 లో అతను యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో భారతదేశ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. 1990లో నవభారత్ టైమ్స్ అనే హిందీ వార్తాపత్రికకు మొదటి పథక్ ప్రహరీ (అంబుడ్స్‌మన్)గా చేసాడు. దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గవర్నరు
మార్చుచతుర్వేదిని 2002 ఆగస్టులో కర్ణాటక గవర్నరుగా నియమించారు. 2004 లో కొంతకాలం కేరళ గవర్నర్‌గా కూడా పనిచేశాడు. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)ల సంకీర్ణ ప్రభుత్వం విచ్ఛిన్నమైనప్పుడు, జనతాదళ్ (ఎస్) బీజేపీతో భాగస్వామ్యానికి వచ్చినప్పుడు చతుర్వేది పరిస్థితిని ఎదుర్కొన్న తీరుకు ప్రశంసలు అందుకున్నాడు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల విశ్వాసాన్ని, గౌరవాన్ని పొందాడు.[3] చరిత్రకారుడు రామచంద్ర గుహ ఆయనను కర్ణాటకలో పనిచేసిన అత్యుత్తమ గవర్నరుగా అభివర్ణించాడు.
ప్రచురణలు
మార్చుట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (హిందీ ఇంగ్లీషుల్లో) అనే రెండు పుస్తకాలను ప్రచురించాడు. అతను 30 కి పైగా పుస్తకాలకు సంపాదకీయం, లేదా సహ సంపాదకీయం చేశాడు. విద్యాపరంగా మొగ్గుచూపిన ఆయన, ప్రజా పరిపాలన, ప్రజా జీవితంలో నీతి, జవాబుదారీతనం, సుపరిపాలన, భారతదేశంలో పునరుజ్జీవనం, శారదాదేవి మొదలైన విభిన్న విషయాలపై వ్యాసాలు రాశాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. చత్రువేది ఇంగ్లీషు, హిందీ రెండింటిలోనూ నిష్ణాతుడైన రచయిత, వక్త. సాహిత్య అమృత్‌లో అతని సంపాదకీయాలు గొప్ప ఆసక్తిని రేకెత్తించేవి. పాఠకులు వాటిని ప్రశంసిస్తూ లేఖలు పంపడం, చర్చించిన అంశాలపై ప్రశ్నలు అడగడం వంటివి చేసేవారు.
అవార్డులు
మార్చుప్రజాసేవకు గానూ చతుర్వేది 1991 లో పద్మవిభూషణ్ అందుకున్నాడు. అతని అనేక ఇతర అవార్డులలో EROPA, మనీలా (1987) ద్వారా పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ ఆడిట్‌కు విశిష్ట సహకారానికి మెగసెసే ఫలకం, 2017 లో జీవితకాల సాఫల్యానికి మొదటి DAV అవార్డు ఉన్నాయి.
వ్యక్తిగత జీవితం
మార్చుటీఎన్ చతుర్వేదికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉండేది. అన్ని మార్గాలనూ అధ్యయనం చేస్తూనే, ముఖ్యంగా సాయిబాబా, సత్యసాయి బాబా, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ, స్వామి వివేకానంద, అరబిందోల పట్ల ఆసక్తి చూపేవాడు. జీవితకాల పుస్తక ప్రేమికుడు, విపరీతమైన పాఠకుడు. హిందీ, ఆంగ్లంలో 1,20,000 పుస్తకాలను సేకరించాడు. ఇవి ప్రపంచ చరిత్రలోని అన్ని అంశాలను, ప్రత్యేకంగా భారతీయ చరిత్ర, మతం, ఆధ్యాత్మికత, జాతీయవాద ఉద్యమం, భారతీయ పునరుజ్జీవనం, ప్రజా పరిపాలన, ఆర్థికశాస్త్రం, నిర్వహణ మొదలైన అంశాలపై ఉండేవి. మహాత్మా గాంధీ రచించిన హింద్ స్వరాజ్ మొదటి ఎడిషన్‌తో సహా చాలా అరుదైన పుస్తకాలు అతని వద్ద ఉండేవి. అతని మరణం తరువాత, అతని కుటుంబం వాటిని ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీకి విరాళంగా ఇచ్చింది. అక్కడ అతని జ్ఞాపకార్థం వార్షిక ఉపన్యాసం కూడా జరుగుతుంది. మొదటి ఉపన్యాసాన్ని 2023 జనవరిలో టిబెట్‌కు చెందిన దలైలామా చేసాడు.[4] 1984 నుండి తన ఇంట్లో ఎనిమిది కుక్కలను పెంచుకున్న కుక్కల ప్రేమికుడు, చతుర్వేది. వీధి కుక్కలను కూడా ఆదరించేవాడు.
చరమ దశ
మార్చుTN చతుర్వేది పదవీ విరమణ తరువాత కూడా క్రియాశీలకంగానే ఉన్నాడు. మరణించే సమయంలో అతను IIPA చైర్మనుగా, హిందీ భవన్ చైర్మనుగా, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చైర్మనుగా, లాలా దివాన్ చంద్ ట్రస్ట్ చైర్మనుగా, రాజేంద్ర ప్రసాద్ భవన్ ట్రస్ట్ వైస్ చైర్మనుగా ఉన్నాడు. DAV మేనేజింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంటు, ఢిల్లీలోని PGDAV కళాశాలకు చైర్మనుగా కూడా ఉన్నాడు. 2007 నుండి మరణించే వరకు హిందీ మాసపత్రిక సాహిత్య అమృత్‌కు సంపాదకుడుగా పనిచేసాడు. మరణించే సమయంలో ఎన్‌ఎంఎంఎల్ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు.
మరణం
మార్చుఅతను అకస్మాత్తుగా కానీ ప్రశాంతంగా 2020 జనవరి 5 న నోయిడాలో మరణించాడు. స్వతంత్ర భారతదేశం చూసిన అత్యుత్తమ సివిల్ సర్వెంట్లలో ఒకరిగా విశిష్ట న్యాయనిపుణుడు ఫాలీ నారిమన్ ఆయనను అభివర్ణించాడు.
మూలాలు
మార్చు- ↑ KVN,DHNS, Rohit. "Former Karnataka Governor TN Chaturvedi passes away". Deccan Herald (in ఇంగ్లీష్). Archived from the original on 2024-09-25. Retrieved 2024-09-25.
- ↑ 2.0 2.1 Dhingra, Moushumi Das Gupta, Sanya (2020-01-07). "TN Chaturvedi, the CAG whose report on Bofors brought down Rajiv Gandhi govt". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-12-09. Retrieved 2024-09-25.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ గాంధీ, గోపాల్ (2020-01-12). "TN Chaturvedi: A scholar in bureaucracy and politics". హిందూస్థాన్ టైమ్స్. Archived from the original on 2022-05-14. Retrieved 2024-09-25.
- ↑ Lama, The 14th Dalai (2024-09-24). "Delivering the Inaugural TN Chaturvedi Memorial…". The 14th Dalai Lama (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-04. Retrieved 2024-09-25.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)