పలక విరూపణ సిద్ధాంతం

భూమి ఉపరితలంలోని కదలికలను వివరించే శాస్త్రీయ థియరీ
(టెక్టోనిక్ పలకలు నుండి దారిమార్పు చెందింది)

1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్ ప్రతిపాదించిన పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ వంటి అంశాలను వివరించడానికి ఉపకరిస్తుంది. ఆల్ఫ్రెడ్ వెజ్ నర్ యొక్క ఖండ చలన సిద్ధాంతం (Continental Drift theory), హెస్ (Harry Hess) యొక్క సముద్ర-భూతల వ్యాప్తి (Sea-floor spreading), హోమ్స్ యొక్క సంవహన ప్రవాహాల వంటి దృక్పథాల ఆధారంగా ఈ పలక విరూపణ సిద్ధాంతం రూపొందించబడింది. ఈ సిద్ధాంతం అశ్మావరణం (Lithosphere) కు చెందిన 7 ప్రధాన పలకలు, 10 ఉప పలకలు భూమి యొక్క ఆస్తినో ఆవరణపు (Asthenosphere) చిక్కని శిలాద్రవంలో తేలుతూ వివిధ దిశలలో చలించడాన్ని, దానివల్ల ఏర్పడే భూస్వరూప ప్రక్రియలను వివరిస్తుంది.

ముఖ్యాంశాలు

మార్చు
  1. ఈ సిద్ధాంతం ప్రకారం భూపటలం (Crust), ఎగువ ప్రాకారం (Upper Mantle) లతో కూడి వున్న దృఢమైన అశ్మావరణం (Lithosphere) పొర చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. వీటిని అశ్మావరణపు పలకలు (Lithospheric Plates) లేదా విరూప కారక పలకలు (Tectonic Plates) గా వ్యవహరిస్తారు.
  2. ఈ అశ్మావరణపు పలకలు 7 పెద్ద పలకలు, 10 చిన్న పలకలగా విభజించబడి ఉన్నాయి. ఒకొక్క పలక సుమారుగా 100-150 కి.మీ. వరకు మందంతో, ఒక కోటి నుంచి 10 కోట్ల చదరపు కిలో మీటర్లకు పైబడిన విస్తీర్ణంతో బృహత్తరంగా విస్తరించి ఉన్నాయి.
  3. ఈ బృహత్తరమైన పలకలు, భూమి యొక్క ఆస్తినో ఆవరణపు చిక్కని శిలాద్రవంలో తేలుతూ, సంవహన ప్రవాహాలవల్ల ప్రేరేపించబడి వివిధ దిశలో అతి నెమ్మదిగా (సంవత్సరానికి 1-10 సెంటీ మీటర్ల వేగంతో) చలిస్తున్నాయి.
  4. ఈ బృహత్తర పలకలు చలిస్తున్నప్పుడు అవి ఒకదానితో మరొకటి ఢీ కొట్టవచ్చు. లేదా ఒకదానికొకటి దూరంగా జరగవచ్చు లేదా లేదా ఒకదానికొకటి సమాంతరంగా జరగవచ్చు. ఫలితంగా ఆ పలకల మధ్య అభిసరణ, అపసరణ, సమాంతర, త్రిసంది (Triple Junction) వంటి సరిహద్దు మండలాలు (Plate Boundary Zones) ఏర్పడతాయి.
  5. ఈ పలకల సరిహద్దు ప్రాంతాలలో పర్వతోద్భవనం, అగ్ని పర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ, సముద్ర భూతల వ్యాప్తి, ద్వీప వక్రతల ఏర్పాటు, రిడ్జ్ (Ridges) ల ఆవిర్భావం, వళులు (Folds), భ్రంశాలు (Faults) వంటి అనేక భౌమ ప్రక్రియలు సంభవిస్తాయి.

ఆశ్మావరణపు పలకలు

మార్చు

భూగోళం అనేక ఖండ, సముద్ర, ఖండ-సముద్ర పలకలతో కూడి ఉంది. ఈ పలకలను 7 పెద్ద పలకలుగా, 10 చిన్న పలకలుగా గుర్తించారు. పెద్ద పలుకలకు అనుబంధంగా అనేకమైన అతి చిన్న పలకలను మైక్రో పలకలుగా గుర్తించారు.

పెద్ద పలకలు (Major plates)

మార్చు

సాధారణంగా పెద్ద పలకల విస్తీర్ణం 2 కోట్ల చ.కి.మీ. పైబడి వుంటుంది. అవి

  1. యురేషియా పలక
  2. ఉత్తర అమెరికా పలక
  3. దక్షిణ అమెరికా పలక
  4. ఆఫ్రికన్ పలక
  5. పసిఫిక్ పలక
  6. ఇండో – ఆస్ట్రేలియా పలక (ప్రస్తుత కాలంలో దీనిని ఇండియన్ పలక, ఆస్ట్రేలియా పలక అనే రెండు పలకలుగా భావిస్తున్నారు )
  7. అంటార్కిటిక్ పలక

చిన్న పలకలు (Minor plates)

మార్చు

చిన్న పలకల విస్తీర్ణం 10 లక్షల చ.కి.మీ. నుండి 2 కోట్ల చ.కి.మీ. వరకూ వుంటుంది. అవి

  1. నాజ్కా పలక (Nazca Plate)
  2. కాకస్ పలక (Cocos Plate)
  3. కరేబియన్ పలక (Caribbean Plate)
  4. స్కాటియా పలక (Scotia Plate)
  5. అరేబియన్ పలక (Arabian Plate)
  6. సోమాలియా పలక (Somali Plate)
  7. బర్మా పలక (Burma Plate)
  8. పిలిప్పైన్ సముద్ర పలక (Philippine Sea Plate)
  9. కరోలినా పలక (Caroline Plate)
  10. న్యూ హెబ్రిడ్స్ పలక (New Hebrides Plate)

మైక్రో పలకలు (Micro plates)

మార్చు

పెద్ద పలకలను ఆనుకొని వున్న అతి చిన్న పలకలను మైక్రో పలకలుగా వ్యవహరించారు. వీటి విస్తీర్ణం 10 లక్షల చ.కి.మీ. కన్నా తక్కువగా వుంటుంది. యురేషియా పలకకు సంబంధించి ఇరానియన్ పలక, మోలుక్కా పలక, ఒకినావా పలక, ఏజియన్ పలక, అడ్రియాటిక్ పలక వంటి అనేక మైక్రో పలకలను గుర్తించారు. అదేవిధంగా ఉత్తర అమెరికా పలకకు సంబంధించి ఒఖోటోస్క్ సముద్ర పలక, జువాన్ డి ఫుకా (Juan de Fuca) పలక వంటి మైక్రో పలకలు, పసిఫిక్ పలకకు సంబంధించి బిస్మార్క్ పలక వంటి మైక్రో పలకలు ముఖ్యమైనవి.

పలకల చలనానికి కావలిసిన బలాలు

మార్చు

భూగోళం మీద వివిధ పలకలు సగటున సుమారుగా సంవత్సరానికి 1-10 సెంటీ మీటర్ల వేగంతో కదులుతుంటాయి. ఈ పలకలు మృదువైన ఆస్తినో ఆవరణం మీద నెమ్మదిగా జారుతున్నాయి. ఈ ఆవరణంలో కొన్ని ప్రాంతాలలో రేడియో ధార్మిక మూలకాలు కేంద్రీకృతమై వుండటం వలన అవి అధిక ఉష్ణోగ్రతా ప్రాంతాలు (Hot spots) గా రూపొందుతున్నాయి. ఈ ప్రదేశాల నుండి సాపేక్షంగా శీతలంగా వున్న ప్రాంతాల (Cold spots) వైపు ఆస్తినో ఆవరణంలో సంవహన ప్రవాహాలు (Convection currents) ఏర్పడతాయి. ఈ విషయాన్ని హోమ్స్ (Arthur Holmes) శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ ప్రవాహాలు తమ మీద వున్న పలకలను వివిధ దిశలలో నెమ్మదిగా తీసుకొని వెళుతుంటాయి. ఈ సంవహనా ప్రవాహాలు వివిధ దిశలలో ప్రవహిస్తుండడం వలన పలకలు కూడా వేర్వేరు దిశలలో చలిస్తూ వుంటాయి.

పలకల చలనాలు - ఏర్పడే సరిహద్దులు

మార్చు

భూగోళం మీద ఆస్తినో ఆవరణంపై తేలుతున్న పలకల యొక్క చలనం సాపేక్షంగా వుంటుంది. ఈ పలకలు వివిధ దిశలో అతి నెమ్మదిగా సంవత్సరానికి 10 సెంటీ మీటర్ల కన్నా తక్కువ వేగంతో చలిస్తున్నాయి. సాధారణంగా పలకల చలనం 3 రకాలుగా వుంటుంది.

  1. ఒకదాని కొకటి అభిముఖంగా చలిస్తూ ఢీకొనడం (అభిసరణం)
  2. వ్యతిరేకదిశలలో చలిస్తూ దూరంగా జరగడం (అపసరణం)
  3. ఒక దాని కొకటి సమాంతరంగా చలించడం

పలకలు ఒకదానితో ఒకటి దూరంగా ఢీకొన్నప్పుడు అభిసరణ లేదా క్షయకరణ సరిహద్దులను ఏర్పరుస్తాయి. పలకలు దూరంగా జరిగిపోతున్నప్పుడు అపసరణ లేదా నిర్మాణాత్మక సరిహద్దులు, పలకలు సమాంతరంగా చలిస్తున్నప్పుడు సమాంతర సరిహద్దులు ఏర్పడతాయి. పై మూడు రకాల చలనాలే కాక కొన్ని సందర్భాలలో మూడు పలకలు ఒకే బిందు దిశగా ప్రయాణం చేస్తాయి. తద్వారా త్రిసంది ప్రాంతాలు సరిహద్దులుగా ఏర్పడతాయి.

పలక సరిహద్దులు – రకాలు

మార్చు
 
మూడు విధాలైన పలక సరిహద్దులు

ఆశ్మావరణపు పలకలు ఒకదానికొకటి సాపెక్షకంగా చలించే విధానాన్ని బట్టి 3 రకాలైన సరిహద్దులను ఏర్పరుస్తాయి. అవి

  1. అభిసరణ సరిహద్దులు (Convergent Boundaries) లేదా క్షయకరణ సరిహద్దులు
  2. అపసరణ సరిహద్దులు (Divergent Boundaries) లేదా నిర్మాణాత్మక సరిహద్దులు
  3. సమాంతర సరిహద్దులు (Transform Boundaries)

పైన పేర్కొన్న సరిహద్దులే కాక త్రిక సంధి (Triple Junction) ప్రాంతాలు కూడా ఏర్పడతాయి.

అభిసరణ సరిహద్దులు (Convergent Boundaries) లేదా క్షయకరణ సరిహద్దులు

మార్చు

భూమి యొక్క ఆస్తినో ఆవరణపు చిక్కని శిలాద్రవంలో తేలుతూ చలిస్తున్న ఆశ్మావరణపు పలకలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టినపుడు అభిసరణ సరిహద్దు ప్రాంతం ఏర్పడుతుంది. ఇది మూడు సందర్భాలలో ఏర్పడతాయి.
a) ఖండ పలక-ఖండ పలక ఢీకొనడం
b) సముద్రపు పలక- సముద్రపు పలక ఢీకొనడం
c) సముద్ర పలక - ఖండ పలక ఢీకొనడం

a) ఖండ పలక - ఖండ పలక ఢీకొనడం :- రెండు ఖండ పలకలు ఢీ కొన్నప్పుడు పలక సరిహద్దులో మూడు రకాలైన భౌమ ప్రక్రియలు ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. అవి

 
ఖండ-ఖండ పలకల మధ్య ఏర్పడిన అభిసరణ సరిహద్దు
  • ముడుత పర్వతాల ఆవిర్భావం
  • శిలల రూపాంతర ప్రక్రియ
  • అగ్నిపర్వత లేదా భూకంప ప్రక్రియ

యురేషియా ఖండ పలక (Euracian plate) భారత ద్వీకకల్ప పలక (Indian Penincular Plate) తో ఢీ కొనడం వలన వీటి మధ్యలో వున్న మెత్తని మృదువైన అవక్షేప శిలాభాగం (తెథిస్ సముద్రం) తీవ్రమైన సంపీడనానికి లోనవుతుంది. పలకల అంచు ప్రాంతాలు సచ్చిద్రంగా (Porous) తయారయి, కరిగిన అవక్షేప శిలా పదార్ధంలో అతుకుపడి సూచర్ జోన్ (Suture Zone) ఏర్పడింది. ఈ ప్రాంతంలో కొంత మాగ్మా పైకి ఉబికి వచ్చి చిన్న చిన్న అగ్నిపర్వతాలుగా ఏర్పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన అవక్షేప శిలలు కొన్ని ప్రాంతాలలో రూపాంతరం చెందాయి. ఇలా రూపాంతరం చెందిన అవక్షేప శిలలు క్రమంగా ఉత్థాతనానికి (Elevation) గురై హిమాలయ ముడుత పర్వతాలుగా ఏర్పడ్డాయి. అదేవిధంగా ఐరోపా లోని ఆల్ప్స్ (Alps) పర్వతాల నుండి బర్మా లోని ఆర్కాన్ యోమా పర్వత శ్రేణుల వరకు యురేషియాలో విస్తరించిన ముడుత పర్వత శ్రేణి కూడా యురేషియా పలక గొండ్వానా భాగంలోని చిన్న చిన్న పలకలతో ఢీ కొనడం వల్ల ఏర్పడినదే. స్థూలంగా చెప్పాలంటే రెండు ఖండ పలకలు ఒకదానినొకటి ఢీ కొన్నప్పుడు ఆ పలకల అంచులు సంపీడనానికి లోనై, ముడుతలు పడి, పైకి ఉత్థాతనం చెందడం వలన ముడుత పర్వతాలు ఏర్పడతాయి.

b) సముద్రపు పలక - సముద్రపు పలక ఢీకొనడం :- రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు అధిక వేగంతో చలించే పలక మిగిలిన పలకలోనికి చొచ్చుకొనిపోతుంది. దీనివలన పలక సరిహద్దులో మూడు రకాలైన భౌమ ప్రక్రియలు ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. అవి

 
సముద్ర-సముద్ర పలకల మధ్య ఏర్పడిన అభిసరణ సరిహద్దు

ఒక సముద్రపు పలక వేరొక సముద్రపు పలక లోనికి సుమారు 45 కోణంతో వేగంగా చొచ్చుకొనిపోయిన సందర్భాలలో ఆ సరిహద్దు ప్రాంతాల వద్ద పలకల ఉపరితలాలు కుప్పకూలిపోయి క్షయకరణ సరిహద్దులను (Subduction Zones) ఏర్పరుస్తాయి. ఈ సబ్ డక్షన్ మండలం వెంబడి లోతైన కందకాలు (Trenches), ద్వీప వక్రతలు (Island Arcs) ఏర్పడతాయి. ఫిలిప్పీన్స్ దీవుల ప్రాంతాలలోని మరియానా ట్రెంచ్ (Mariana Trench) వంటి లోతైన కందకాలు ఈ రకంగా ఏర్పడినవే.

అధిక వేగంతో చలించే సముద్ర పలక వేరొక సముద్ర పలకలోనికి చొచ్చుకొనిపోయినపుడు, చొచ్చుకుపోయిన పలక లోని కొంత భాగం అధిక లోతుల వద్ద అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. అది ఎగువ ప్రాకారం (Upper mantle) లో జనింప చేసే ఉష్ణం వలన ఆ ప్రాంతం లోని మాగ్మా పైకి ఉబికి వచ్చి అగ్నిపర్వతాలు శృంఖలాల (Chains) వలె ఏర్పడ్డాయి. ఇలా ఒక చాపం (Arc) ఆకారంలో ఏర్పడిన అగ్నిపర్వతదీవులను ద్వీప వక్రతలు (Island Arcs) గా పిలుస్తారు. పసిఫిక్ సముద్రపు పలక, మారియానా సముద్ర పలక లోనికి చొచ్చుకొనిపోయినపుడు అగ్నిపర్వత దీవులు ఒక చాపం (arc) ఆకారంలో మారియానా దీవులుగా ఏర్పడ్డాయి. అదేవిధంగా కురిల్ (kurlie) దీవులు, అలూషియన్ దీవులు (Aleutian Islands) లు కూడా ద్వీప వక్రత (Island Arcs) లకు చక్కని ఉదాహరణలు. ఒఖొటోస్క్ సముద్రపు పలక (Okhotsk Plate) లోనికి పసిఫిక్ సముద్ర పలక వేగంగా చొచ్చుకొనిపోయినప్పుడు కురిల్ ద్వీప వక్రతలు ఏర్పడ్డాయి.

c) సముద్ర పలక - ఖండ పలక ఢీకొనడం :- సముద్రపు పలక, ఖండ పలక రెండు ఢీ కొన్నప్పుడు అధిక సాంద్రత కలిగిన సముద్రపు పలక, తక్కువ సాంద్రత కలిగిన ఖండ పలకలోనికి చొచ్చుకొనిపోతుంది. ఈ ప్రాంతాన్ని సబ్ డక్షన్ మండలం (Subduction Zone) అంటారు. ఈ సబ్ డక్షన్ మండలం వెంబడి భూకంప ప్రక్రియలు సంభవిస్తాయి. ఈ విధంగా ఖండ పలక దిగువ భాగాన క్రిందకు చొచ్చుకుపోయిన సముద్రపు పలక లోని కొంత భాగం అధిక లోతుల వద్ద అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలోని మాగ్మా పైకి ఉబికి వచ్చి ఖండ భూభాగాలపై అగ్నిపర్వతాలను (Continental Volcanoes) ఏర్పరుస్తుంది. సముద్రపు పలక, ఖండ పలక రెండు ఢీ కొన్నప్పుడు పలక సరిహద్దు అయిన సబ్ డక్షన్ మండలంలో క్రింది భౌమ ప్రక్రియలు ఏర్పడడానికి అవకాశం వుంటుంది.

 
సముద్ర-ఖండ పలకల మధ్య ఏర్పడిన అభిసరణ సరిహద్దు
  • పర్వతోద్భవనం (Orogeny)
  • ఖండ భూభాగంపై అగ్ని పర్వత దీవుల ఏర్పడటం (Continental Volcanoes)
  • శిలల రూపాంతర ప్రక్రియ
  • లోతైన సముద్ర కందకాలు (Trenches) ఏర్పడటం
  • భూప్రకంపనలు

దక్షిణ అమెరికా ఖండ పలక లోనికి నాజ్కా (Nazca Plate) సముద్ర పలక చొచ్చుకొనిరావడం వలన ఆ సబ్ డక్షన్ మండలం వెంబడి ఆండీస్ ముడుత పర్వత శ్రేణులు ఆవిర్భవించాయి. అదే విధంగా ఉత్తర అమెరికా ఖండ పలక లోనికి పసిఫిక్ సముద్ర పలక చొచ్చుకొనిరావడం వలన ఆ సబ్ డక్షన్ మండలం వెంబడి రాకీ ముడుత పర్వత శ్రేణులు ఆవిర్భవించాయి.

ఖండ పలక దిగువ భాగంలో ఒక సముద్ర పలక చొచ్చుకొనిపోయినపుడు, అలా క్రిందకు చొచ్చుకుపోయిన సముద్రపు పలక లోని కొంత భాగం అధిక లోతుల వద్ద అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. ఆ విధంగా సబ్ డక్షన్ మండలంలో ఏర్పడిన మాగ్మా కొన్ని సందర్భాలలో పలక సరిహద్దుకు కొంచెం దూరంలో సన్నని పగుళ్ళ ద్వారా పైకి ఉబికి వచ్చి ఖండ భూభాగాలపై అగ్నిపర్వతాలను (Continental Volcanoes) ఏర్పరుస్తుంది. ఉదాహరణకు సెయింట్ హెలీనా, మౌంట్ రైనర్ (Mt. Rainier), కొటాపాక్సి, చింబరజొ (Chimborazo) మొదలగు అగ్ని పర్వతాలు ఈ రకంగానే ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికా ఖండ పలక లోనికి జువాన్ డి ఫుకా సముద్ర పలక (Juan de Fuca oceanic plate) చొచ్చుకొనిరావడం వలన ఆ సబ్ డక్షన్ మండలానికి కొంచెం దూరంలో కాస్కేడ్ పర్వత శ్రేణులులో మౌంట్ రైనర్ (Mt. Rainier) అగ్ని పర్వతం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండ పలక లోనికి నాజ్కా సముద్ర పలక చొచ్చుకొనిరావడం వలన ఆ సబ్ డక్షన్ మండలానికి కొంచెం దూరంలో ఆండీస్ ముడుత పర్వత శ్రేణులలో చింబరజొ అగ్ని పర్వతం (Mt. Chimborazo) ఏర్పడింది.

సముద్ర పలకలలోని శిలలు కొన్ని సందర్భాలలో పైకి నెట్టబడి పర్వత శ్రేణుల ఉపరితల భాగాలలో కనపడతాయి. ఈ ప్రక్రియను అబ్ డక్షన్ (Obduction) అని వ్యవహరిస్తారు.

అపసరణ సరిహద్దులు (Divergent Boundaries) లేదా నిర్మాణాత్మక సరిహద్దులు

మార్చు

ఆస్థినొఆవరణపు (Aesthenosphere) శిలా ద్రవం పై తేలుతున్న సముద్ర, ఖండ పలకలు ఒకదానికొకటి వ్యతిరేకదిశలో దూరంగా జరిగిపోతున్నప్పుడు అపసరణ సరిహద్దులు (Divergent Boundaries) ఏర్పడతాయి. వీటినే 'నిర్మాణాత్మక సరిహద్దులు' అని, 'విస్తరిస్తున్న సరిహద్దులు' అని కూడా పిలుస్తారు.

అపసరణ సరిహద్దులు రెండు సందర్భాలలో ఏర్పడతాయి.
a) రెండు సముద్ర పలకలు దూరంగా జరగడం
b) రెండు ఖండ పలకలు దూరంగా జరుగడం

a) రెండు సముద్ర పలకలు దూరంగా జరగడం :- రెండు సముద్ర పలకలు ఒకదానికొకటి దూరంగా జరిగిపోతున్నప్పుడు ఆ పలకల అపసరణ సరిహద్దులలో క్రింది భౌమ ప్రక్రియలు, భూస్వరూపాలు ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది.

 
సముద్ర-సముద్ర పలకల మధ్య ఏర్పడిన అపసరణ సరిహద్దు
 
అపసరణ సరిహద్దుల వద్ద మాగ్మా పైకి ఉబికిరావడంతో విస్తరిస్తున్న సముద్ర భూతలం, ఏర్పడుతున్న సముద్రాంతర్గత రిడ్జ్ లు
  • సముద్ర భూతల విస్తరణ (Seafloor spreading)
  • సముద్రాంతర్గత రిడ్జ్ లు (Oeanic Ridges)
  • అగ్నిపర్వత దీవులు (Volacanic Islands)
  • సముద్ర ఉన్నతులు (Oceanic Rises)

రెండు సముద్ర పలకలు దూరంగా జరిగిపోతున్నప్పుడు సరిహద్దు ప్రాంతంలో భగ్న మండలం (Fracture zone) ఏర్పడుతుంది. ఈ భగ్న మండలం లోపలి నుండి మాగ్మా వెలుపలికి ఉబికి వచ్చి కొత్త సముద్ర భూతలం (Seafloor) ను ఏర్పరుస్తుంది. తద్వారా సముద్ర భూతల (Seafloor) నెమ్మదిగా విస్తరిస్తుంది. ఈ విధంగా ఏర్పడిన నూతన ఆశ్మావరణం (Lithosphere) ఆ భగ్న మండలానికి ఇరువైపులా నిక్షేపించబడి సముద్ర భూతలం మీద పర్వత పంక్తులు (Ridges) ఏర్పడతాయి. వీటిని సముద్రాంతర్గత రిడ్జ్ లు (Mid Oceanic Ridges) అని పిలుస్తారు.

ఉదా: మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ (Mid Atlantic Ridge). ఉత్తర అమెరికా పలక, యురేషియా పలకలు దూరంగా జరిగిపోతున్నప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోను, దక్షిణ అమెరికా పలక, ఆఫ్రికా పలకలు దూరంగా జరిగిపోతున్నప్పుడు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంలోను అపసరణ సరిహద్దులు ఏర్పడతాయి. ఈ సరిహద్దుల వద్ద ఏర్పడిన భగ్న మండలాల లోపలినుండి మాగ్మా పైకి ఉబికి రావడంతో సముద్ర భూతల విస్తరణ నిరంతరంగా జరుగుతున్నది. ఈ సరిహద్దులలో అట్లాంటిక్ మహా సముద్ర భూతలం మీద ఏర్పడిన పర్వత పంక్తులను మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ గా వ్యవహరిస్తారు.

కొన్ని సందర్భాలలో రిడ్జ్ ల సమీపంలో చిన్న చిన్న అగ్నిపర్వత దీవులు కూడా ఏర్పడవచ్చు.
ఉదా: మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ సమీపంలో, ఐస్ లాండ్ దక్షిణ తీరంలో ఇటీవలే ఏర్పడిన సర్ట్ సే (Surtsey) దీవి. ఇది ఒక అగ్నిపర్వత ద్వీపం.

ఈ రిడ్జ్ ల వాలు తక్కువగా ఉన్నట్లయితే సముద్ర ఉన్నతులు (Oceanic Rises) గా పిలుస్తారు. తూర్పు పసిఫిక్ ఉన్నతి (East Pacific Rise), మెలనేషియన్ ఉన్నతి (Melanesian Rise), చిలీ ఉన్నతి (Chile Rise) మొదలైనవి సముద్ర ఉన్నతులకు ఉదాహరణలు. రిడ్జ్ ల ప్రాంతాలలో కొన్ని భూ ప్రకంపన మండలాల (Earthquake zone) పరిధిలోనికి వస్తాయి. అందువలన చిన్న చిన్న భూకంపాలు, స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు ఈ రిడ్జ్ ప్రాంతాలలో సంభవిస్తాయి.

b) రెండు ఖండ పలకలు దూరంగా జరగడం :- రెండు ఖండ పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నప్పుడు ఆ పలకల అపసరణ సరిహద్దులలో క్రింది భౌమ ప్రక్రియలు, భూస్వరూపాలు ఏర్పడడానికి అవకాశం వుంటుంది.

 
ఖండ-ఖండ పలకల మధ్య ఏర్పడిన అపసరణ సరిహద్దు
  • ఖండ విస్తరణ (Continent spreading)
  • రిఫ్ట్ లోయలు ( (Continental Rift లేదా Oceanic Rift)
  • కొత్తగా సముద్ర బేసిన్ లు ఏర్పడటం

రెండు ఖండ పలకలు ఒకదానికొకటి దూరంగా జరిగిపోతున్నప్పుడు ఆ సరిహద్దు ప్రాంతం వద్ద ఖండ భాగం చీలిపోయి తద్వారా ఖండాలు విస్తరిస్తాయి. ఈ చీలిపోయిన ఖండ భాగంలో రిఫ్ట్ లోయ (Rify valley) ఏర్పడుతుంది. వీటిని ఖండ రిఫ్ట్ లు (Continental Rift) అని పిలుస్తారు.
ఉదా: తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ (East Africa Rift). ఆఫ్రికా పలక నుంచి సోమాలియా చిన్న పలక దూరంగా జరుగుతున్నప్పుడు, ఆ అపసరణ సరిహద్దుల వద్ద ఖండభాగం చీలిపోయి తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ లోయ (East Africa Rift) ఏర్పడింది.

అయితే ఒకొక్కప్పుడు ఇలా చీలిపోయిన ఖండభాగంలోనికి సముద్రం చొచ్చుకొని రావడం కూడా జరుగవచ్చు. దానివలన కొత్తగా సముద్ర బేసిన్ ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఒక ఖండ రిఫ్ట్ (Continental Rift), సముద్ర రిఫ్ట్ (Oceanic Rift) గా కూడా పరివర్తన చెందవచ్చును.
ఉదా: ఎర్ర సముద్రం రిఫ్ట్ (Red sea Rift). ఆఫ్రికా పలక, అరేబియా చిన్న పలకలు రెండూ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నప్పుడు, ఆ అపసరణ సరిహద్దుల వద్ద ఖండభాగం చీలిపోయి ఖండ రిఫ్ట్ ఏర్పడింది. ఈ రిఫ్ట్ లోకి సముద్రం చొచ్చుకొనిరావడం వల్ల ఎర్ర సముద్రం (Red sea Rift) ఏర్పడింది.

సమాంతర సరిహద్దులు (Transform Boundaries)

మార్చు
 
సమాంతర సరిహద్దు (Transform boundary)

రెండు పలకలు ఒకదానికొకటి సమాంతరంగా చలిస్తున్నప్పుడు అధిక మొత్తంలో భ్రంశ ప్రక్రియ (Faulting) సంభవిస్తుంది. ఈ ప్రాంతాలలో రిడ్జ్–వేలి (Ridge & Valley) రకానికి చెందిన నైసర్గిక స్వరూపం కనపడుతుంది. పలకలు సమాంతరంగా చలించే భ్రంశ రేఖ వెంబడి భారీ భూకంప ప్రక్రియలు సంభవిస్తాయి. ఈ సందర్భంలో సముద్ర భూతలం కొత్తగా ఏర్పడటం కాని, నాశనమవ్వడం గాని జరగదు. ఉదా: పసిఫిక్ పలక, ఉత్తర అమెరికా పలకలు ఒక దానికొకటి సమాంతరంగా చలించటం వలన కాలిఫోర్నియాలో శాన్ ఆండ్రియాస్ భ్రంశం (San Andreas Fault) ఏర్పడింది.

త్రిసంధి ప్రాంతాలు (Triple Junctions)

మార్చు
 
ఆఫ్రికా పలక, సోమాలియన్ పలక, అరేబియా పలకలు ఈ మూడు పలకలు కలియగా ఏర్పడిన అఫార్ త్రిసంధి ప్రాంతం (Afar Triple Junction)

పైన పేర్కొన్న మూడు రకాలైన చలనాలనే కాక కొన్ని సందర్భాలలో మూడు పలకలు ఒకే బిందు దిశగా ప్రయాణం చేస్తూ త్రిసంధి ప్రాంతాలను ఏర్పరుస్తాయి. ఉదా:

  • పసిఫిక్ పలక, నాజ్కా పలక, కాకస్ పలక – ఈ మూడు పలకలు కలిసి గాలపగోస్ త్రిసంధి ప్రాంతం (Galapagos Triple Junction) ను ఏర్పరుస్తాయి.
  • అమూరియన్ పలక (Amurian Plate), ఒఖోటోస్క్ పలక (Okhotsk Plate), ఫిలిప్పైన్ సముద్ర పలక - ఈ మూడు పలకలు కలిసి జపాన్ లో ఫ్యూజీ అగ్ని పర్వతం (Mt. Fuji) సమీపంలో ఒక త్రిసంధి ప్రాంతాన్ని ఏర్పరుస్తున్నాయి.
  • ఆఫ్రికా పలక, ఇండో-ఆస్ట్రేలియా పలక, అంటార్కిటిక్ పలక - ఈ మూడు పలకలు కలిసి దక్షిణ హిందూ మహా సముద్రంలోని మారిషస్ వద్ద రోడ్రిగ్స్ త్రిసంధి ప్రాంతం (Rodrigues Triple Junction) ఏర్పరిచాయి.
  • ఆఫ్రికా పలక, సోమాలియన్ పలక, అరేబియా పలకలు కలిసి అఫార్ త్రిసంధి ప్రాంతం (Afar Triple Junction) ను ఏర్పరుస్తాయి.

విమర్శ

మార్చు

పలక విరూపణ సిద్ధాంతం ప్రస్తుత కాలంలో చాలా వరకు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ, క్రింది విషయాలను సరిగా వివరించలేక విమర్శలకు గురైంది.

  1. ఈ సిద్ధాంతం పలకల చలనానికి అవసరమైన బలాన్ని గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది.
  2. పర్వతోద్భావన ప్రక్రియ గురించి ఈ సిద్ధాంతం సంతృప్తకరమైన పూర్తి వివరణను ఇవ్వడంలో విఫలమైంది. అపలేచియన్ పర్వత శ్రేణుల ఆవిర్భావాన్ని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. అదేవిధంగా దక్షిణ ఆఫ్రికా లోని డ్రేకన్ బర్గ్ పర్వతాలు, బ్రెజిల్ లోని సియర్రా డెల్మర్, ఆస్ట్రేలియా లోని ఈస్టర్న్ హైలాండ్స్ (Eastern Highlands) మొదలైన వాటికి సంబంధించిన పర్వతోద్భవన ప్రక్రియలను ఈ సిద్ధాంతం ప్రకారం వివరించలేము.
  3. దక్కన్ పీఠభూమి వంటి కఠినమైన, దృఢమైన, స్థిరమైన భౌగోళిక ప్రాంతాలలో సంభవించే భూకంప ప్రక్రియకు కారణాలను ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది.
  4. విస్తరణ మండలాల ఉనికి అన్ని మహాసముద్రాలలోను కనిపిస్తున్నప్పటికీ, సబ్ డక్షన్ మండలాలు మాత్రం పసిఫిక్ తీరానికే పరిమితం కావడాన్ని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది.
  5. పలకల సరిహద్దుల వద్ద క్షయకరణం చెందుతున్న ప్రాంతం కన్నా విస్తరణకు లోనవుతున్న ప్రాంతం ఎక్కువగా ఉంది. అంటే సరిహద్దుల వద్ద పాత భూపటలం నాశనమవుతున్నరేటు కంటే నూతనంగా భూపటలం సృష్టించబడుతున్న రేటు బాగా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది.
  6. పలకల చలనం వేర్వేరు దిశలలో ఉండటానికి గల కారణాలను సరిగా విపులీకరించలేకపోయింది. ఒకే పలక వ్యతిరేక దిశలలో చలించడం లాంటి అసంభవాలను ఈ సిద్ధాంతం పట్టించుకోలేదు.

పలక విరూపణ సిద్ధాంతం – ప్రాధాన్యత

మార్చు

ప్రస్తుతమున్నఖండాలు, సముద్ర బేసిన్ ల అమరికను, వాటి విస్తరణను శాస్త్రీయంగా వివరించిన పలక విరూపణ సిద్ధాంతం ఒక విప్లవాత్మకమైనది, సంగ్రహమైనది. ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్తరించిన తీరును ఇది సంతృప్తికరంగా వివరించగలిగింది. అంతకుముందు వెజ్ నర్ ప్రతిపాదించిన ఖండ చలన సిద్ధాంతాన్ని ధ్రువీకరించింది.

జీవశాస్త్రంలో పరిణామ సిద్ధాంతం (Theory of Evolution) నకు ఎంతటి ప్రాధాన్యం వుందో, అంతే ప్రాధాన్యం భూగర్భ శాస్త్రం (Geology) లో పలక విరూపణ సిద్ధాంతానికి ఉంది. నేటికాలంలో భూగర్భ శాస్త్రవేత్తలు వివిధ భౌమ కాలాలలో విస్తరించిన పలకల సరిహద్దులను అన్వేషిస్తూ వాటిని నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు. పాత ఖండాలను కలుపుతూ వున్నటువంటి పురాతన సరిహద్దు మండలాలను అన్వేషించడం ద్వారా విభిన్న భౌమ కాలాలలో ఏర్పడిన చిన్న చిన్న ఖండ భాగాలను, సముద్ర పర్వతాలను, ద్వీప వక్రతలను పరిశీలించగలుగుతున్నారు. ప్రస్తుత కాలానికి అవి పొందిన అమరికను, విస్తరించిన తీరును తెలుసుకోగలుగుతున్నారు.

భూగోళం మీద ప్రస్తుతం వున్న భూస్వరూపాల అమరికకు, విస్తరణకు కారణభూతమైన విరూపకారక ప్రక్రియ (Tectonic processes) లన్నిటినీ, గత 250 కోట్ల సంవత్సరాలుగా అవిచ్ఛన్నంగా కొనసాగుతూ వస్తున్న పలకల చలనమే డామినేట్ చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే భూగోళ శాస్త్రంలో పలక విరూపణ సిద్ధాంతం 20 వ శతాబ్దపు విప్లవానికి దారి తీసింది.

వీటిని కూడా చూడండి

మార్చు

ఖండ చలన సిద్ధాంతం

మూలాలు

మార్చు
  • Condie, K.C. (1997). Plate tectonics and crustal evolution (4th ed.). Butterworth-Heinemann. p. 282. ISBN 978-0-7506-3386-4. Retrieved 2010-06-18.{{cite book}}: CS1 maint: ref duplicates default (link)
  • Kious, W. Jacquelyne; Tilling, Robert I. (February 2001) [1996]. "Historical perspective". This Dynamic Earth: the Story of Plate Tectonics (Online ed.). U.S. Geological Survey. ISBN 0-16-048220-8
  • Hancock, Paul L.; Skinner, Brian J.; Dineley, David L. (2000). The Oxford Companion to The Earth. Oxford University Press. ISBN 0-19-854039-6.
  • Lliboutry, L. (2000). Quantitative geophysics and geology. Springer. p. 480. ISBN 978-1-85233-115-3. Retrieved 2010-06-18.
  • Majid Husain (2002) Fundamentas of Physical Geography (2nd ed)
  • Geoff Brown, Chris Hawkesworth, R. C. L. Wilson Understanding the Earth, (1992) Cambridge University press
  • Thompson, Graham R.; Turk, Jonathan (1991). Modern Physical Geology. Saunders College Publishing. ISBN 0-03-025398-5.
  • Oreskes, Naomi, ed. (2003). Plate Tectonics: An Insider's History of the Modern Theory of the Earth. Westview. ISBN 0-8133-4132-9.

బయటి లంకెలు

మార్చు