తిమ్మరుసు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
'సాళువ తిమ్మరుసు' - (తిమ్మరాజు కన్నడ భాషలో అరుసు రాజు పదానికి పర్యాయ పదం.) అసమాన ప్రజ్ఞావంతుడు, గొప్ప రాజకీయ దురంధరుడు. ఆయన స్వస్థలం చంద్రగిరి. చిన్నతనమున దుర్భర దారిద్ర్యమును అనుభవించాడు. మంత్రాగమున చిట్టి గంగన శిష్యుడు. చిట్టిగంగన్న చంద్రగిరిని పరిపాలించిన సాళువ నరసింహరాయల వారి మంత్రి. తిమ్మరుసు మేధస్సును గుర్తించి చేరదీసినాడు. సమస్త దక్షిణావనిని ఒక పాలన క్రింది తేవలెనన్నది అతని ఆశయం. అతని ఆశయాన్ని తీర్చగలిగిన వాడు తిమ్మరుసు అని నమ్మకము చిట్టిగంగన్నకు గలిగినది. గంగనామాత్యుని మరణం తరువాత తిమ్మరుసు సాళువ నరసింహ రాయల మంత్రిగా నియమితుడైనాడు. విజయనగరమును పాలిస్తున్న సంగమ వంశమునకు చెందిన ప్రౌఢ దేవరాయలు అసమర్ధుడగున వలన, అతని పాలనలో ప్రజల పాట్లు తిమ్మరుసుకు తెలియరాగా, సాళువ నరసింహరాయల చేత విజయనగరముపై దండయాత్ర చేయించాడు. పిరికివాడైన ప్రౌఢ దేవరాయలు పలాయనము చిత్తగించుటతో రాజ్యము సాళువ నరసింహరాయల వశమైనది. సాళువ నరసింహరాయల పిమ్మట అతని పెద్దకుమారుడు తిమ్మభూపాలుడు రాజైనాడు. అతని అనారోగ్య కారణమున అతని సేనాని తుళువ నరసరాయలే తిమ్మరుసు సహాయముతో వ్యవహారములను నిర్వర్తించెడి వాడు. తిమ్మభూపాలుని మరణానంతరము సాళువ నరసింహరాయుని రెండవ కుమారుడు, తిమ్మభూపాలుని సోదరుడైన రెండవ నరసింహ రాయలు సింహాసనమునధిష్టించెను.అతడు సమర్ధుడు కాకపోవుటచే తుళువనరసరాయలు అతనిని బంధించి పెనుగొండ దుర్గమున బంధించి విజయనగర రాజైనాడు. అతని మరణానంతరము తుళువనరసరాయల పెద్ద కుమారుడు వీరనరసింహరాయలు రాజైనాడు. వీరనరసింహరాయలు సవతి సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్దదేవరాయలి సామర్ధ్యము పై తిమ్మరుసుకు అచంచల విశ్వాసము. శ్రీకృష్ణదేవరాయలనిన తిమ్మరుసుకు వాత్సల్యం. అతనిని విజయనగర సింహాసనము పై అధిష్టింప చేయవలెనని తిమ్మరుసు సంకల్పం. తిమ్మరుసును శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలిచి పితృసమానునిగా గౌరవించుచుండెడి వాడు. వీరనరసింహరాయలు అస్వస్తుడైనాడు.మరణశయ్యపై నున్న అతడు బాలకుడైన తన కుమారుని పట్టాభిషిక్తుని చేయవలసినదిగా తిమ్మరుసును కోరినాడు.తిమ్మరుసుకు శ్రీకృష్ధదేవరాయలపై గల మక్కువను తెలిసిన వీరనరసింహుడు తన మరణానంతరము తన కుమారుని రాజు చేయడని తలచి శ్రీకృష్ణదేవరాయలను వధించి అతని కనుగుడ్డు చూపుమని ఆదేశించాడు. శ్రీకృష్ణదేవరాయలను అజ్ఞాతములో ఉంచి మేకకళ్లను చూపి అవియే శ్రీకృష్ణదేవరాయల కనుగుడ్లని నమ్మబలిగినాడు. వీరనరసింహరాయల మరణానంతరము శ్రీకృష్ణదేవరాయలు అజ్ఞాతము వీడి తిమ్మరుసు సహాయముతో సింహాసనము నధిష్టించాడు. తిమ్మరుసు మంత్రాగముతో శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యమును విస్తరింప చేసి నలుబది సంవత్సరములు సమర్ధవంతముగా పరిపాలన గావించాడు. రాజ్యవిస్తరణే కాక సుపరింపాలన గావించుటవలన శ్రీకృష్ణదేవరాయల పాలన దక్షిణభారత చరిత్రలో సువర్ణాధ్యాయముగా నిలిచిపోయింది.
హత్యారోపణ - కథ
మార్చుకళింగాధీశుడు వీరభద్రగజపతి, శ్రీకృష్ణదేవరాయల చేతిలో పరాజయమును తట్టుకోలేక ప్రతీకరేఛ్చతో అతని మనుమని (శ్రీకృష్ణదేవరాయనికి వీరభద్రగజపతి కుమార్తె ద్వారా కలిగిన కుమారుని) హత మార్చి ఆ నేరమును తిమ్మరుసుపై మోపినాడని, శ్రీకృష్ణదేవరాయలు సరియైన విచారణ సలపక, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు కనుగుడ్లు పీకించినాడను కథ వాడుకలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేవుకాని నాటకీయత కలిగి ఉండడంతోనాలుగైదు నాటకాలు ఈ కథాంశంతో రచించబడి ప్రాముఖ్యత పొందేయి.
న్యూనిజ్ కధ
మార్చుతిమ్మరుసు హత్యారోపణకి మూలం న్యూనిజ్ అనే పొర్చుగీసు వర్తకుని కథనం. ఈన్యూనిజ్ రాయలకాలం నాటికి విజయనగరంలో ఉండి తను చూచిన, వినిన వృతాంతములను ఒక కథనంగా వ్రాసాడు. అవె ఈ క్రింది అంశములు: 1) రాయలు రాయచూరు యుద్ధం అయిన తరువాత తనకు వయసుమీరినదని తెలుసుకున్నాడు. 2) అతనికి ఆరు సం. పుత్రుడు ఉన్నాడు. 3) రాయలు తన పుత్రుడు తన తరువాత రాజ్య పాలన చేపాట్టాలనే ఆకాంక్షతో తన రాజ్యత్యాగం చేసి, పుత్రునికి పట్టభిషేకం చేసి, తను అతనికి మంత్రి అయి, అంతవరకూ తనకు మహా ప్రధానిగా ఉండిన తిమ్మరుసును తనకు సలహాదారునిగా చేసుకున్నాడు. 4) పట్టాభిషేకోత్సవములు 8 నెలలు జరిగినవి. 5) పిమ్మట రాయల కుమారుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. 6) కొంత కాలానికి తన కుమారుడు తిమ్మరుసు మంత్రి కుమారుడు విషప్రయోగం చేయడం వలన మరణించాడని రాయలకు తెలిసింది. 7) అంతట రాయలు తిమ్మరుసును, పుత్రుని, తమ్ముడైన గోవిందరాజును నిండు సభలో నిందించి, తిమ్మరుసును ఆతని ఇద్దరు పుత్రులను మూడు సం. కాలం చెరసాలలో ఉంచాడు. 8) తర్వాదన్నాయకుడు (దండనాయకుడు) తిమ్మరుసు కుమారుడు చెరసాలనుంచి తప్పించుకొని, ఒక ప్రబలమైన దుర్గం చేరి, అక్కడనుంచి రాయలపై తిరుగుబాటు చేశాడు. రాయలు సైన్యమును పంపి ఆతనిని బంధించాడు. 9) ఆమీద ఇతనితో పాటు తిమ్మరుసును, ఆతని మరియొక పుత్రుని సముఖమునకు పిలిపించి రాయలు వీరందరి కండ్లూడదీయించి చెరలో బంధించాడు. 10) తిమ్మదనాయకుడు చెరలో మరణించాడు. తిమ్మరుసు, ఆతని మరియొక పుత్రుడు చెరలోనే ఉండిపోయారు.
న్యూనిజ్ చెప్పిన ఈకథ మరియేఇతరాధారములలోనూ కనిపించదు. ఈకథని బట్టి తిమ్మరుసు మంత్రికి తిమ్మదనాయకుడు ఒకడూ, గండరాజు అను ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలుస్తుంది.కాని తిమ్మరుసును రాజు సభలో నిందించినప్పుడు ఆతని కుమారుడు ఒకడే ఉన్నట్టున్నూ, మూడు సం.లు చెరలో ఉండినది ఆతనితో పాటు ఆతని పుత్రులు ఇద్దరు అని పరస్పర విరుద్ధమైన్ విషయం న్యూనిజ్ వ్రాసాడు. అందుకే చరిత్రకారులు ఈ కథను విశ్వసనీయంగా గుర్తించరు.
న్యూనిజ్ కథనం రాయల్ కుమారుని పట్టభిషేకం వరకు విశ్వసనీయంగా కనిపిస్తుంది. సా.శ.1517నాటి ఒక శాసనంలో రాయలకు సంతానప్రాప్తి కావెలనని కొండమరసు మంత్రి కాంక్షించినట్లు ఉంది.అప్పటికే రాయలకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలుండుటవలన, ఆకాంక్ష పుత్ర సంతానానికి సంబంధించినదని ఊహించవచ్చును. సా.శ. 1518 అక్టోబరు 20వ తేదీనాటి ఒక శాసనం రాయల దేవేరి అయిన తిరుమలదేవీ తిరుమల రాయలకొరకు ఒకదానం చేసినట్లు చెబుతుంది. మరికొన్ని శాసనములలో ఈ తిరుమల దేవరాయలు కృష్ణదేవరాయలకున్ను, తిరుమలదేవికిన్ను కుమారుడు అని చెప్పబడెను. వీటినిబట్టి రాయలకు సా.శ. 1518 లో తిరుమలరాయుడనే పుత్రుడు జన్మ్ంచినట్లు తెల్సుస్తుంది. ఈ తిరుమల రాయలు సా.శ. 1524 వైశాఖమాసం నుంచి మార్గశిర మాసం వరకూ రాజ్యం చేసినట్లు శాసన ప్రమాణం ఉంది. ఇదే సం.లో రాయలు తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి భూదానం కూడా చేశాడు.
రాయలు తిమ్మరుసు కండ్లు పొడిపించి వేసినట్లు మరిఏ ఇతర ఆధారాలలోనూ కనబడదు. పూజ్యులు విజయనగర రాజ్య పరమప్రామాణికులు నేలటూరి వెంకటరమణయ్య గారు ఈ విషయాన్ని విపులంగా చర్చించారు. రాయలు సా.శ.1524 లోనే కుమారుడి పట్టాభిషేకం చేయుట, ఆతడు మరణించుట ఇదే సం.లోనే జరిగినట్లు చెప్పవచ్చును. ఆమీద మూడ సం.లు అనిన్యూనిజ్ చెప్పాడు. అనగా తిమ్మరుసు సా.శ. 1527-28 వరకు చెరసాలలో ఉన్నట్లు ఏర్పడుతుంది. అతని కండ్లు తీయబడుట ఆమీదనే జరుగవలెను. తిరుపతి తిరుమల శాసనములలో కొన్నొటి యందు తిమ్మరుసు ప్రశంస ఉంది. ఇతడు సా.శ. 1536 ఫిబ్రవరి 26న తాళ్ళపాకం తిరుమలయ్యంగారి వద్ద నుంచి 4,600 పణములు తీసికొని అందుకు బదులుగా తన తమ్ముడు గోవిందరాజుకు రావలసిన ప్రసాదంలో 1/4 వవంతును ఆయనికిచ్చి వేసినాడు. అలాగే సా.శ. 1536 డిశంబరు 28తేదీనాడు తిమ్మరుసుపై తిరుమలయ్యంగారి నుంచి 1,900 పణములు తీసుకొని తన పేర శ్రీ.వేంకటేశ్వరునికి అర్పించే ప్రసాదంలో తనకు రావలసిన 1/4 వంతును ఆయనికి ఇచ్చాడు. దీనిని బట్టి కృష్ణదేవ రాయలు తరువాత రాజ్యానికి వచ్చిన అతని సవతి తమ్ముడు అచ్యుతదేవరాయల నాటివి అని చెప్పవచ్చును. దీనిని బట్టి తిమ్మరుసు సా.శ. 1536 వరకూ సజీవి అయి, దాన ధర్మాలు చేస్తున్నాట్లు స్పష్టమవుతోంది. సా.శ.1541 వరకూ కూడా శాసనములలో ప్రసంసింపబడినాడు తిమ్మరుసు.
అందుచేత తిమ్మరుసు కళ్ళు తీయించుట గురించి న్యూనిజ్ వ్రాసిన కథనం విశ్వసనీయంగా కనబడదు.
సా.శ.1524 లో తన కుమారుడు మరణించిన పిమ్మట తిరిగీ కృష్ణదేవ రాయలు రాజ్యత్వం చేపట్టి మరో 5 ఏళ్ళు పరిపాలన చేసాడు. అప్పుడు తిమ్మరుసు మంత్రిగా తిరిగి చేయలేదు. దీనికి ఎందుకు చేయలదనే ప్రశ్న వస్తుంది. దీనికి రాయలు స్వార్ధపరుడై తన పుత్రుడిని పట్టాభిషిక్తుని చేయదలిస్తే రాజ్యక్షేమం పురస్కరించుకొని తిమ్మరుసు రాయల ఆకోరికను ప్రతిఘటించాడనీ, అందువల్ల వారిద్దరికీ అభిప్రాయభేధాలు వచ్చిందనీ, తిమ్మరుసు తన అన్న వీరనరసింహుడి కుమారుడుని త్రోసిపుచ్చి తనని సంహాసనం ఎక్కించినట్లే తన మరణానంతరం తన కుమారుడిని కూడా తోసిపుచ్చి, తన సవతి తమ్ముడైన అచ్యుతరాయలకు పట్టం కదతాతేడొమోనని భయంవేసి తిమ్మరుసును పదభ్రష్టుని చేసాడనీ చెప్పవచ్చును.
మీడియాలో
మార్చు1962 లో మహామంత్రి తిమ్మరుసు అనే సినిమా విడుదలైనది. దీనికి జాతీయ స్థాయిలో రజత పతకం లభించింది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- న్యూనిజ్ కథనం- 1978 భారతి మాస పత్రిక.వ్యాస కర్త: మారేమండరామారావు గారు.వ్యాసం: తిమ్మరసు మంత్రి-ఒక విశేషము.