తిరుప్పొచ్చూరు తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రము. ఇది చెన్నై జాతీయ రహదారి మీద తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య ఉంది. ఇక్కడి వాసీశ్వరస్వామి ఆలయం పురాతనమైనది ప్రసిద్ధిచెందినది. ఈ క్షేత్రానికి తూర్పున తిరువళ్ళూరులో వీరరాఘవస్వామి, మరోవైపు శైవక్షేత్రాలలో రత్నసభగా పేర్కొనబడే తిరువలంగాడు, ఉత్తరదిశగా పూండి సరస్సుకు సరిహద్దున ఉండ్రేశ్వరస్వామి, దక్షిణదిశగా కూపం అనబడే తిరువిలాస్ కోవిల్ మొదలైన క్షేత్రాలున్నాయి.

స్థల పురాణం మార్చు

పూర్వం ఈ ప్రాంతం దట్టమైన వెదురు పొదలతో నిండిన అరణ్యంగా ఉండి 'వనస్థలి' అని పిలువబడేది. ఇక్కడ ఒక గొల్లవాడు అడవికి గోవును మేతకు త్రోలుకెళ్ళి అచ్చట వున్న వెదురుపొదను గొడ్డలితో నరకగా ఉన్నట్లుండి పొదనుండి రక్తం పైకి చెమ్మినది. అతడు భయపడి చుట్టూ వున్నవారిని పిలిచి అక్కడ మట్టిని తొలగించి చూడగా వారికి అపురూపమైన శివలింగం ప్రత్యక్షమైనది. లింగం పైభాగం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అలా స్వయంభవుగా వెలిసిన శివలింగాన్ని, పరిసరాల్ని శుభ్రపరచి పూజావిధులు ఏర్పాటుచేశారు. స్వామి వెదురుపొదలలో జన్మించాడు కాబట్టి "వేయిస్త్రనాథన్" అని కూడా పేర్కొంటారు. ఈ క్షేత్రంలో నేటికీ వెదురు పొదే స్థలవృక్షంగా పూజింపబడుతూ ఉంది.

ఇక్కడి వాసీశ్వరస్వామి మహత్యాన్నిగురించి, శైవ నయనార్లు, అప్పర్, జ్ఞాస సంబందర్, రితునాపకరసు, సుందరర్, రామలింగస్వామి, జయం కొండారు, సూరిద్వయం ప్రశంసించారు. ప్రముఖ శైవకవి జ్ఞాన సంబందర్ తన రచనలలో ఈ స్వామి వెలిసిన ప్రదేశాన్ని 'పాచిఊరు' అని పేర్కొన్నాడు. నాటి ఈ పాచిఊరే కాలగమనంలో తిరుప్పొచ్చూరుగా పిలుస్తున్నారు. తమిళ సాహిత్యంలో ఈ క్షేత్రాన్ని పుణ్యావర్తము, గుడారణ్యము, మాణిఖ్యపురి, ప్రళయ కాలక్షేత్రం, అభయక్షేత్రం, సోమపురం మొదలైన పేర్లతో ప్రస్తుతిస్తూ ఉంది. అప్పర్ కవి ఈ క్షేత్రమందు చంద్రుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడని పేర్కొన్నాడు.

స్వామి పేరు మార్చు

వాసీశ్వర స్వామిని వేయిస్త్రనాథర్, పాచ్చూర్ నాథర్ అని కూడా కొలుస్తారు. 'వాసి' అంటే గొడ్డలి. వాసితో వెదురుపొదను నరుకుతూ ఉండగా ఉద్భవించిన స్వామి కాబట్టి వాసీశ్వరుడని అంటున్నారు. వాసి అనగా వన్నె అని కూడా అర్ధం. దీనికి కారణమైన మరో కథనం ప్రకారం తిరుప్పొచ్చూరు సమీపంలోని 'కారణి' గ్రామంలో గుణవతి అనే గొల్లవనిత నిత్యం స్వామి నైవేద్యానికి పాలు సమర్పించేది. ఒకమారు కరువు మూలంగా పశువులకు మేత కరువై స్వామిసేవకు పాలు సమర్పణకు అంతరాయం ఏర్పడింది. స్వామి ఆమె కష్టాన్ని తీర్చుటకు కవలసినన్ని మేలిమి బంగారు నాణేలు సమర్పించాడు. ఊహించని ధనగర్వంతో ఆమె తన విధిని మరచి స్వామికి సమర్పించే పాలలో నీటిని కలిపేది. స్వామి గుణపాఠం నేర్పాలని తాను ఆమెకిచ్చిన బంగారు నాణేల స్వచ్ఛత కోల్పోవునట్లు చేశాడు. అది తెలియక గుణవతి వాటిని చలామణికై కొట్టుకు తీసుకెళ్ళగా, అవి నకిలీవని తెలిసిన వ్యాపారులు ఆమెను మోసగత్తెగా పేర్కొన్నారు. ఆమె జ్ఞానోదయమై తప్పును మన్నించమని ప్రార్థించగా నాణేల వాసిని పెంచి మన్నించాడట. ఇలా గుణవతికిచ్చిన బంగారు నాణేల వాసి తగ్గించిన స్వామి కాబట్టి వాసీశ్వరుడని అంటున్నారట.

దేవాలయం మార్చు

వాసీశ్వరస్వామి మందిరం, గర్భగృహం, అంతరాళం, ముఖమండపం, మహామండపాలను కలిగి తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంది. గర్భాలయంలోని వేదికపై లింగాకారపు శివుని పైభాగం ఒకవైపునకు వంగినట్లుంది. స్వామి తలపై గొడ్డలిపెట్టుతో ఏర్పడిన గాయం నేటికీ స్పష్టంగా కనిపిస్తుంది. గర్భాలయం లోపలి గోడలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉంది. గర్భగృహం పైన గూడుబండి ఆకారంలో నిర్మితమైన విమానం పైన 5 కలశాలు ఉన్నాయి. విమానపు గూడులందు అనేక శైవ ప్రతిమలు, పరివార దేవతలతో బాటు నాలుగు వైపుల నంది ప్రతిమలు ఉన్నాయి. గర్భాలయం ముంగిట సన్నని అంతరాళం, దాని ముందు దాదాపు 20 స్తంభాలతో ఏర్పాటుచేసిన ముఖ, మహా మండపాలు ఉన్నాయి. ముఖ మండప ద్వారానికి ఇరువైపుల సాయుధులైన ద్వారపాలకులున్నారు. మండపం మధ్యన స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయమందలి స్తంభాలన్నీ వివిధ శైవ శిల్పాలు, నాయనార్లు, మహర్షుల ప్రతిమలతో నిండివున్నాయి.

మూలాలు మార్చు

  • వాసీశ్వరస్వామి ఆలయం, తిరుప్పొచ్చూరు, పి.కృష్ణమూర్తి, సప్తగిరి ఏప్రిల్ 2008 పత్రికలో ప్రచురించిన వ్యాసం.