తెగలు (Tribes) అతి ప్రాచీనమైన మానవ సమూహాలు. ఈ తెగల వారిని ఆదిమ వాసులని, ఆదిమ జాతులని, ఆదిమ సమూహాలని ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన మన భారత రాజ్యాంగంలో ఈ తెగలకు సంబంధించిన విషయాల్ని ఒక షెడ్యూలులో పొందుపరచారు. అప్పటినుండి ఈ తెగలను షెడ్యూల్డ్ తెగలు (Scheduled Tribes) అని పిలవడం మొదలయింది. మన దేశంలో సుమారు 573 సముదాయాలను ప్రభుత్వము షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది.

Lanjia Saura woman in traditional jewelry.jpg
సవర ఆదివాసీ తెగకు చెందిన మహిళ

భారతదేశంలో సుమారు 68 మిలియన్ల ప్రజలు ఈ తెగలకు చెంది ఉన్నారు. వీరిలో 90 శాతం మంది కొండలలోను, పర్వతాలలోనూ, ఎడారులలోనూ నివసిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు.

నిర్ధిష్ట ప్రదేశం, ప్రత్యేక సంస్కృతి, ఒకే పేరు, ఒకే భాష, అంతర్వివాహం, సమష్టి ఆంక్షలు, ఆర్థిక స్వయం సమృద్ధి, విశిష్ట సామాజిక, రాజకీయ వ్యవస్థలు అనేవి తెగల ముఖ్య లక్షణాలు. భారతదేశంలో తెగలన్నీ కచ్చితమైన ప్రాంతీయ సమూహాలు అంటే ప్రతి తెగా నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ ఉంటుంది. ప్రతి తెగకూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. సర్వసాధారణంగా ఒక తెగకు చెందినవారు వారి తెగలోని వారినే పెళ్ళి చేసుకుంటారు. ప్రతి తెగలోని సభ్యులందరూ సమష్టి ఆంక్షల్ని కలిగివుంటారు. ఈ ఆంక్షలు ఇంద్రజాల పరమూ, మత సంబంధమూ అయిన విశ్వాసాలతో కూడుకుని ఉంటాయి. ప్రతీ తెగ ఆర్థిక సంబంధమైన విషయాలలో స్వయం సమృద్ధమై ఉంటుంది. తెగలలోని ఆర్థిక వ్యవస్థలలో చాలా సూక్ష్మమైన సాంకేతిక పద్ధతుల్ని ఉంటాయి. వీనిలో జరిగే ఉత్పత్తి సాధారణంగా ఆ తెగలోని ప్రజలకు ఉపయోగించడం కొరకే పరిమితమౌతుంది. డబ్బు వాడకం చాలా తక్కువ. లాభాన్ని గడించాలనే దృష్టి ఉండదు. తెగ యొక్క సామాజిక వ్యవస్థలో అనేక విభాగాలు ఉంటాయి. కుటుంబాలు, వంశాలు, గ్రామాలు, గోత్రాలు, గోత్రకూటాలు, ద్విశాఖలూ, ఉపతెగలు తెగలోని అంతర్భాగాలు. కొన్ని కుటుంబాలు వంశంగాను, కొన్ని వంశాలు గోత్రంగాను, కొన్ని గోత్రాలు గోత్రకూటమిగాను, కొన్ని గోత్రకూటాలు ద్విశాఖలుగాను ఏర్పడతాయి. రెండు గాని అంతకన్నా ఎక్కువగానీ ఉపతెగలు కలిపి తెగగా ఏర్పడవచ్చును.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తెగలు&oldid=4095567" నుండి వెలికితీశారు