తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కార్మికులు, తమ కోరికలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో 2019 అక్టోబరు, నవంబరుల్లో సమ్మె చేసారు. 52 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె, కార్మికుల కోర్కెలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది.

2019 అక్టోబరు 4 అర్థరాత్రి నుండి సమ్మె మొదలై, నవంబరు 25 న ముగిసింది. మొత్తం ఉద్యోగులు 49,860 మందిలోను 48,660 మంది వరకూ సమ్మెలో పాల్గొన్నారు. అక్టోబరు 8 వ తేదీన దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకుని, పండుగ తరువాత వెనక్కి వెళ్ళే ప్రజలకు ఈ సమ్మె ఇబ్బందులు కలిగించింది. కార్మికులు, ప్రభుత్వము ఇద్దరూ కూడా తమతమ అభిప్రాయాలకు కట్టుబడి, మెట్టు దిగకపోవడంతో ఇరువర్గాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమై సమ్మె అనివార్యమైంది.

ప్రభుత్వం ఈ సమ్మె పట్ల చాలా కఠిన వైఖరి అవలంబించింది. సమ్మెను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి, సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు కానట్లే అని ప్రకటించింది. బేషరతుగా సమ్మె విరమించాక, విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను రెండు రోజుల పాటు అందుకు అనుమతించలేదు.

సమ్మెకు దారితీసిన పరిస్థితులు మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంఘటన కొద్ది నెలల ముందు జరిగింది. దాంతో, సహజంగానే తెలంగాణ ఆర్టీసీ కార్మికులలోనూ ఈ కోరిక బలపడింది.

కార్మికుల డిమాండ్లు మార్చు

కార్మికులు మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వాటిలో ముఖ్యమైనవి:

  1. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
  2. 2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ చేయాలి.
  3. జీతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి
  4. సంస్థకు ప్రభుత్వం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి
  5. డీజిల్‌ భారాన్ని ప్రభుత్వం భరించాలి
  6. విద్యుత్ బస్సులకు కేంద్రం ఇచ్చే రాయితీని ఆర్టీసీకే చెల్లించాలి
  7. ప్రభుత్వ విధానాల వలన ఆర్టీసికి వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలి.
  8. కండక్టర్‌, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత,
  9. ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించేలా సర్క్యులర్ల గైడ్‌లైన్స్ మార్చాలి.
  10. సీసీఎస్‌, పీఎఫ్‌ సొమ్ము బదలాయింపు
  11. ఉద్యోగుల సహకార సంస్థల బకాయిలు వెంటనే చెల్లించాలి.

సంప్రదింపులు మార్చు

ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, కార్మిక సంఘాల ఐకాస మధ్య వరుసగా మూడోరోజు, అక్టోబరు 4 న, జరిగిన చర్చల్లోనూ ఒప్పందమేమీ కుదరలేదు. దాంతో సమ్మె అనివార్యమైంది.[1] ఇకా ఆ తరువాత ఇరు పక్షాలు సమావేశం కాలేదు, చర్చలూ జరపలేదు. ప్రభుత్వమే కార్మికులను చర్చలకు పిలవలేదు. సమ్మె చివరి రోజుల్లో కార్మిక నాయకులే చర్చలకు స్వయంగా ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి పిలుపు రాలేదు.

సమ్మె మార్చు

2019 అక్టోబరు 4 అర్థరాత్రి నుండి సమ్మె మొదలైంది. దాదాపుగా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు.

సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వ్యవహరించింది. ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు రవాణా వాహనాలను అనుమతించింది. ప్రైవేటు డ్రైవర్లను తాత్కాలికంగా తీసుకుని వారిచేత బస్సులను నడిపించింది. పాఠశాలల సెలవులను పొడిగించింది. అక్టోబరు 5 వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కానట్టే, భవిష్యత్‌లో వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ పరిగణించదు. అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్టోబరు 5 న ప్రకటించాడు.[2]

అక్టోబరు 5న ఉన్నతాధికారుల సమీక్షలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, "దసరా పండుగ సందర్భంగా సమ్మెకు దిగి, కార్మికులు పెద్ద తప్పు చేసారని, పైగా ప్రభుత్వాదేశాలను ధిక్కరించిన సిబ్బందిని విధుల్లోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేద"నీ చెప్పాడు.[3] ఆరవ తేదీన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు 1200 మంది మాత్రమే అని కూడా ప్రకటించాడు.[4] గడువులోపు విధుల్లో చేరనందున వారంతట వారు ఉద్యోగాల నుండి తొలగిపోయినట్లే అని ప్రకటించాడు. [5]

సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలూ మద్దతు ప్రకటించాయి.[6]

కార్మికుల సారథ్యంలో అక్టోబరు 19 న తెలంగాణ బందు జరిగింది. వివిధ పార్టీల నాయకులు అరెస్టయ్యారు. బందు ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగిందని వివిధ పత్రికలు ప్రచురించగా[7][8][9] బందుకు ప్రజల నుండి స్పందన లేదని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది.[10]

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలన్న డిమాండును వదిలేస్తున్నామని, ఇకనైనా చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని కోరుతూ నవంబరు 14 న కార్మిక నాయకుడు అశ్వత్థామ రెడ్డి ప్రకటన విడుదల చేసాడు.[11] ఆ తరువాత కూడా ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించలేదు.

ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరుతూ నవంబరు 16 న హైదరాబాదు లోని ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేస్తామని ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించారు. అయితే పోలీసులు నిషేధాజ్ఞలు విధించి ఈ దీక్షలను సాగనివ్వలేదు. దాంతో అశ్వత్థామ రెడ్డు తన ఇంట్లోనే తనను తాను నిర్బంధించుకుని దీక్ష చెయ్యగా, పోలీసులు దాన్నీ భగ్నం చేసారు.

చివరికి ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో, కార్మిక నేతలు సమ్మెను ముగిస్తున్నట్లు నవంబరు 25 న ప్రకటించారు.

కార్మికుల మరణాలు మార్చు

సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇద్దరు కార్మికులు అత్మహత్య చేసుకున్నారు. అక్టోబరు 12 వ తేదీన ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే డ్రైవరు వంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. 13 వ తేదీన హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. హైదరాబాదులో సురేందర్ గౌడ్ అనే కండక్టరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.[12][13] వీళ్ళే కాక, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని, గుండెపోట్ల వలన, మతిస్థిమితం తప్పి మరణించారు.[14][15]

ప్రభుత్వ స్పందన మార్చు

సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠిన వైఖరిని అవలంబించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యడంతో పాటు, సమ్మె చేస్తున్న కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించి వారిని ఒత్తిడికి గురిచేసింది. కేసులో వాదనలు జరిగే సందర్భంలో కోర్టు చేసిన కొన్ని అననుకూల వ్యాఖ్యల సందర్భంలో కూడా ప్రభుత్వం తన వైఖరిపై వెనక్కు తగ్గలేదు. ఈ కారణంగా సమ్మెను ముగించక తప్పని పరిస్థితి కార్మికులకు ఏర్పడింది. విరమించిన తరువాత కూడా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోలేదు. [16] మూడు రోజుల తరువాత, 29 వ తేదీన కార్మికులు విధుల్లో చేరవచ్చని ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించాక మాత్రమే, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు పనుల్లోకి తీసుకుంది.[17] ఇకపై ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండవని ముఖ్యమంత్రి చెప్పాడు. కార్మికులతా తమ బిడ్డలేనని చెప్పాడు. జీతాలు చెల్లించేందుకు, ఇతర అవసరాల కోసం తక్షణసాయంగా  రూ.100కోట్లు ఇస్తామని చెప్పాడు.

కోర్టు కేసు మార్చు

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైనదని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనితో పాటు దాఖలైన మరికొన్ని అర్జీలపై హైకోర్టు అక్టోబరు 15 న విచారణ చేపట్టింది. ఇరుపక్షాలూ మెట్టు దిగి సమ్మెకు ముగింపు పలకాలని సలహా ఇచ్చింది.[18][19]

సమ్మె విరమణ మార్చు

52 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లుగా నవంబరు 25 న కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఇన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, "కార్మికులు ఓడిపోలేదు. ప్రభుత్వం గెలవలేదు" అనీ కార్మిక నాయకుడు అశ్వత్థామ రెడ్డి అన్నాడు. హైకోర్టు తీర్పును, ఆర్టీసీ కార్మికుల అవసరాలనూ దృష్టిలో పెట్టుకొని సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్లు అతడు చెప్పాడు.[20] మూడు రోజుల తరువాత, నవంబరు 28 న, కార్మికులు బేషరతుగా విధుల్లో చేరవచ్చని ముఖ్యమంత్రి ప్రకటించడంతో నవంబరు 29 ఉదయం నుండి కార్మికులు తమ పనుల్లోకి చేరిపోయారు.

మూలాలు మార్చు

  1. "ఆర్టీసీ సమ్మె అనివార్యమే!". www.eenadu.net. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  2. "ఆరు దాటితే..ఆర్టీసీ ఉద్యోగులు కారు: మంత్రి పువ్వాడ". www.ntnews.com. 2019-10-05. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  3. "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు: సీఎం". www.ntnews.com. 2019-10-06. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  4. ఈనాడు. "48,660 మంది కార్మికులను తొలగించినట్టేనా? - ఈనాడు". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  5. "ఆర్టీసీ బస్సులు మూడు భాగాలు". www.eenadu.net. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  6. "రాజకీయ పార్టీల మద్దతు". www.eenadu.net. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  7. "Clipping of NavaTelangana Telugu Daily - NavaTelangana". epaper.navatelangana.com. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  8. "రాష్ట్ర బంద్‌ సంపూర్ణం". www.eenadu.net. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  9. "Sakshi Telugu Daily Telangana epaper dated Sun, 20 Oct 19". epaper.sakshi.com. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  10. "Clipping of Namasthe Telangaana Telugu Daily - Telangana Main". epaper.ntnews.com. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  11. "మెట్టు దిగిన జేఏసీ". www.andhrajyothy.com. 2019-11-15. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.
  12. "ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం". www.andhrajyothy.com. 2019-10-14. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  13. "ఇద్దరు కార్మికుల ఆత్మార్పణం". www.eenadu.net. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  14. "మరో కార్మికుడి ఆత్మహత్యాయత్నం". www.andhrajyothy.com. 2019-11-15. Archived from the original on 2019-12-02. Retrieved 2019-12-02.
  15. "మతి స్థిమితం కోల్పోయిన కండక్టర్‌ మృతి". www.andhrajyothy.com. 2019-11-15. Archived from the original on 2019-12-02. Retrieved 2019-12-02.
  16. "ససేమిరా చేర్చుకోం". www.eenadu.net. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.
  17. "సరే.. చేరండి". www.eenadu.net. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.
  18. "మెట్టు దిగండి". www.eenadu.net. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  19. "Clipping of NavaTelangana Telugu Daily - NavaTelangana". epaper.navatelangana.com. Archived from the original on 2019-10-24. Retrieved 2019-10-24.
  20. "విధుల్లో చేరుతాం". www.eenadu.net. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.