దీపావళి పండుగ సందర్భంగా రాజ్ గోండ్ ఆదివాసీలు  జరుపుకునే పండుగ  దండారి పండుగ. ఈ  దండారి పండుగను తెలంగాణ రాష్ట్రంలో  ఆదిలాబాదు, కుమురం భీం-ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలతో పాటుగా  మహారాష్ట్ర (విదర్భ) లోని జిల్లాల్లో ఉండే రాజ్‌గోండులు, కోలాంలు జరుపుకుంటారు.[1]

ప్రారంభం మార్చు

ఆదివాసీలు దీపావళి పండుగకు ముందు  ఆశ్వయుజం నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే మంచి రోజు నాడు ఇండ్లు, వాకిలి అలికి అలంకరించి  ఊరి పటేల్ ఇంటి ముందు ఈ దండారీ వేడుకలను నిర్వహిస్తారు. ముండ అనే పెద్ద కర్ర స్తంభం చుట్టూ గుండ్రంగా చేసే నృత్యాలతో దండారి ఉత్సవాలు మొదలవుతాయి.

దండారి నృత్యం మార్చు

దండారీలో భాగంగా ముందుగా మగవారు నృత్యాలు చేసి  నాటక ప్రదర్శనలు ఇస్తారు. తర్వాత మహిళలు లయబద్దంగా నృత్యాలు చేస్తారు. పెళ్లి కాని ఓ ఆడపడుచు గునుగు పూల కట్ట పట్టుకొని నృత్యం ప్రారంభించగా మిగతా మహిళలు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేస్తూ ముందుకెళ్తారు. అలాగే దండారి వేడుకల్లో గుస్సాడీ నృత్యాలకు ప్రత్యేకత ఉంది. నెత్తిన నెమలి ఈకలతో టోపీలు చేతిలో మంత్ర దండం మెడలో రుద్రాక్ష మాలలు కాళ్ళకు, నడుముకు గజ్జెలు ముఖానికి విభూతి నల్లటి, తెల్లటి చారలతో గీతలు  గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలు, భుజాన జంతువు చర్మం  ఇలా ప్రత్యేక ఆకర్షణగా కనబడతాయి గుస్సాడీ వేషాలు. కోరికలు నెరవేరాలని గూడెం యువకులు గుస్సాడి వేషాలు  కడతారు. పది రోజులు నియమనిష్ఠలతో ఉండి దండారి సంబురాల్లో పాల్గొంటారు. దీక్షతో ఉన్న వారం, పది రోజులు స్నానం చేయకుండా, కట్టిన బట్టలు విడవకుండా, నేలపైనే పడుకుంటూ  దీక్షలు చేస్తుంటారు. ఇలా చేస్తే దేవుడు తాము కోరుకున్నవి నెరవేరుస్తాడని ఆదివాసీల నమ్మకం. గుస్సాడీల చేతిలో ఉండే మంత్రదండాన్ని తాకిస్తే రోగాలు పోతాయని ఆదివాసీలు నమ్ముతుంటారు. ఈ వేషాల్లో ఉన్న గుస్సాడీలను శ్రీకృష్ణుడు, పరమశివుడిగా భావిస్తారు.[2]

గుస్సాడి టోపీ మార్చు

10, 15 దండారి పండుగల దాకా నిలిచే అతి పవిత్రమైన గుసాడి టోపీలను కొందరు నిపుణులైన గోండులు, కొలాంలే చేయగలరు. పదిహేను వందల కన్న ఎక్కువే నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ, ముఖ్యంగా ముందరి వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగు, జరీ దారాలు, చక్కటి డిజైన్లున్న గుడ్ద పట్టీలతో, పలు ఆకారాల రంగులు రంగు చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్ని సార్లు రెండు పక్కల జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు.[3]

పెళ్లి సంబంధాలు మార్చు

దండారిలో ఒక ఊరి వారు మరో గ్రామానికి అతిధులుగా వెళ్తారు. చీకటి పడకముందే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే దండారి బృందం వెళ్తుంది. వృద్దులు, చంటి పిల్లల, తల్లుల కోసం ఎడ్ల బండ్లను వాడతారు. వారితో తీసుకెళ్లే ప్రతీ సామాగ్రిని కూడా మోసుకెళ్తారు. విందులు, వినోదాలు, ముచ్చట్లతో ఓ రాత్రి విశ్రాంతి తీసుకొని తెల్లారి ఆటలాడి, పాటలుపాడి, ఖేల్  ప్రదర్శనల్లో పాల్గొంటారు. దండారి వల్ల ఆదివాసీలకు మరో ప్రయోజనం ఉంటుంది. బృందంలోని పెళ్లికాని యువకులు తమకు తగిన వధువులు వెతుక్కుంటారు. పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం లాంటివి దండారీ తర్వాత జరుగుతాయి.[4]

ముగింపు మార్చు

దీపావళి అమావాస్య తర్వాత ఒకటి రెండు రోజుల్లో జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఊరు బయట ‘చెంచి భీమన్న’ దేవుడుండే ఇప్పచెట్టు దగ్గర దండారీ వాయిద్యాలు, బట్టలు, ఆభరణాలు తీసేసి  వాటి ముందు బలిచ్చి, పూజలు చేస్తారు. విందు భోజనం తర్వాత అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకెళ్తారు. చివర్లో గుస్సాడీల దగ్గరలో ఉన్న చెరువు, కాలువకో వెళ్లి స్నానం చేసి దీక్ష విరమిస్తారు. గుమేల, పర్ర, వెట్టె లాంటి దండారి వాయిద్యాలు మళ్లీ వచ్చే అకాడి పండుగ దాకా దాచి ఉంచుతారు.

మూలాలు మార్చు

  1. "దండారి పండుగ | వేదిక | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2022-04-08.
  2. Velugu, V6 (2021-11-05). "గిరిజన గూడాల్లో దండారీ పండగ.. ఆకర్షణగా గుస్సాడీ నృత్యం". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "అడవి తల్లి ఒడిలో..దండారి సంబరం." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-02. Retrieved 2022-04-08.
  4. Telugu, TV9 (2021-11-04). "Dandari Festival: అడవిలో అంబరాన్నంటిన 'దండారి' సంబరాలు.. గిరిజనులంతా కలిసి." TV9 Telugu. Retrieved 2022-04-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లింకులు మార్చు