దుర్గం చెరువు తీగల వంతెన
హైదరాబాద్ దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెన, మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా దుర్గం చెరువు బ్రిడ్జిగా పేరొందింది. రూ.184 కోట్ల వ్యయంతో 754 మీటర్ల పొడవుతో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఇది దేశంలోనే పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పర్యాటక ప్రాంతంగా మారనుంది[1] ఆసియా లోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది రికార్డులకి ఎక్కింది. [2] దీనివలన రోడ్ నెంబర్-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి అవకాశం కలగనుంది.
వంతెన నిర్మాణము
మార్చుఈ తీగల వంతెన పనులకు మంత్రి కేటీఆర్ మే నెల 2017 న శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చులో టీఎస్ ఐ ఐ సీ, జీహెచ్ ఎంసీ చెరి సగం భరించనున్నాయి [3], 2019 ప్రారంభంలో నిర్మాణ టెండర్లు ప్రారంభించగా ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టుబ్రో) కాంట్రాక్టు ను దక్కించుకున్నది. ఈ వంతెన ను 2020 ఏప్రిల్/మే లో పూర్తి చేసి, 2020 జూన్ లో ప్రారంభించాలని భావించబడింది. అయితే కోవిడ్-19 గ్లోబల్ మహమ్మారి కారణంగా ఆగస్టు 2020 న నిర్మాణం పూర్తయింది. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి (ఎస్సార్‌డీపీ) పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఈ తీగల వంతెన నిర్మాణం చేపట్టింది ఇది నాలుగు లైన్ల వంతెన. దీనికి అనుసంధానంగా 150 కోట్లతో రోడ్ నెంబర్-45లో వంతెన కూడా నిర్మించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దగం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన పైదారికి పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’గా పేరు పెట్టారు.దుర్గం చెరువుకు ఇరువైపులా వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ పరంగా అత్యంత సవాల్‌తో కూడిన తీగల ఆధారిత వంతెనను దుర్గం చెఱువు పైన లార్సన్ అండ్ టౌబ్రో నిర్మించింది ,ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. తీగల ఆధారిత వంతెన నిర్మాణంలో మొత్తంమ్మీద 428 మెట్రిక్ టన్నుల అత్యధిక తన్యత కలిగిన స్ట్రాండ్, 26,600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 4800 మెట్రిక్ టన్నుల స్టీల్, 287 మెట్రిక్ టన్నుల అనుసంధానిత తీగలను ఉపయోగించారు. స్టే-కేబుళ్లను ఆస్ట్రియా నుండి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా కేవలం 2 ఫిల్లర సహాయంతో 735 మీటర్ల పొడపున్న తీగల వంతెనను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది.[4] 8 దేశాల ఇంజనీర్లు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.తీగల వంతెనపై ఎత్తైన పైలాన్ల మధ్యనున్న 233.5 మీటర్ల స్పాన్ ప్రపంచంలోనే పొడవైనది. పైలాన్లకు వంతెన పలకలను బిగించే ఉక్కు తీగలకు జర్మనీలో నాణ్యత పరీక్ష చేయించారు. భారీ యంత్రాలకు తీగలను అమర్చి, అవి ఎంత ఒత్తిడిని, బలాన్ని తట్టుకుంటాయో పరిశీలించారు. వాటిని పైలాన్లకు అమర్చిన అనంతరం తీగల వంతెనపై పెద్ద మొత్తంలో ఇసుక ట్రక్కులు, ఇతర బరువులను నిలిపి గట్టితనాన్ని పరీక్షించారు. దీనిని 25 సెప్టెంబర్ 2020 న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు.
పర్యాటక ఆకర్షణ
మార్చుదుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ మొట్టమొదటి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు ఈ తీగల వంతెనతో దుర్గం చెరువు ప్రధాన పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఈ వంతెనకు ఎల్‌ఈడీ లైట్ల తో రాత్రి పూట కూడా ఆకర్షణీయంగా కనిపించేటందుకు తీర్చి దిద్దారు. జీహెచ్‌ఎంసీ, టీఎ్‌సఐఐసీ, పర్యాటక శాఖల సంయుక్తాధ్వర్యంలో సందర్శకులు సేద తీరేలా వారికి ఆహ్లాదం, ఆనందం పంచేలా పార్కులు, వాటర్ ఫ్రంట్ కేఫ్,నడక దారి, వినూత్న థీమ్‌లతో చెరువు చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు. తీగల వంతెనపైన వాహనాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు[5].కేబుల్ వంతెన తో పాటు, ప్రకాశవంతమైన హోస్టింగ్ పార్టీలు, ఈవెంట్లకు అందుబాటులో ఉంచ బడే కొత్త బోట్ కూడా ప్రారంభించనున్నారు.ఈ వంతెనపై సరికొత్త సాంకేతికతతో కూడిన విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటుచేసి రాత్రివేళల్లో ఆకట్టుకునేలా ఓ థీమ్ పార్కునూ ఏర్పాటుచేశారు. 100 వరకు థీమ్‌లు అలరించనున్నాయి.
మూలాలు
మార్చు- ↑ "భాగ్యనగరం మెడలో మరో మణిహారం". Sakshi. 2020-09-02. Retrieved 2020-09-26.
- ↑ "హైదరాబాద్‌లో తీగల వంతెనను ప్రారంభించిన కేటీఆర్". Samayam Telugu. Retrieved 2020-09-26.
- ↑ "దుర్గం చేరువుపై వేలాడే తీగల వంతెన పనులు ప్రారంభం | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2020-09-26.
- ↑ "ETV Bharat". www.etvbharat.com. Retrieved 2020-09-26.
- ↑ "కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్". ntnews. 2020-03-02. Retrieved 2020-09-26.[permanent dead link]