ద టీ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తులో ఏర్పాటు చేయబడిన తేయాకు కర్మాగారం. ఇది తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లా లో విస్తరించి ఉన్న నీలగిరి పర్వతశ్రేణుల్లో ఏర్పాటుచేశారు. చుట్టూ తేయాకు తోటల మధ్య, నీలగిరి పర్వతాలలో అత్యంత ఎత్తైన దొడ్డబెట్టశిఖరానికి సమీపంలో ఈ కర్మాగారం ఉంది. వేసవి విడిది ప్రాంతమైన ఊటీకి 8 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఊటీ చుట్టు పక్కల సందర్శనీయమైన ప్రాంతాలలో ఇది ఒకటి. ఊటికి వచ్చే పర్యాటకులు కచ్చితంగా దొడ్డబెట్ట శిఖరాన్ని సందర్శిస్తుంటారు. దొడ్డబెట్ట శిఖర సందర్శనార్థం వచ్చే పర్యాటకులు సమీపంలోనే ఉండే టీ ఫ్యాక్టరికి కూడా వస్తుంటారు. పర్యాటకుల కొరకు కర్మాగారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తేయాకుల నుండి టీ పొడిగా మారే క్రమంలో పచ్చి ఆకుల దశ నుండి తేమలేని పొడిగా మారి, ప్యాకెట్ల రూపంలోకి మారే వరకు ప్రతి దశనూ కర్మాగారంలో పర్యాటకులు క్షుణ్ణంగా పరిశీలించే ఏర్పాట్లుచేశారు. కర్మాగారంలో టీ మ్యూజియం కూడా ఉంది. కర్మాగారం సందర్శనార్థం పది రూపాయలు ప్రవేశ రుసుం ఉంటుంది. సందర్శనార్థం వచ్చిన పర్యాటకులందరికీ ఉచితంగా టీ అందజేస్తారు. చల్లటి ప్రాంతంలో అద్భుత రుచితో ఉండే టీ పర్యాటకులను అనందపరుస్తుంది. అక్కడ దొరికే టీ పొడి కొనడానికి ఉద్యుక్తులను చేస్తుంది.

ద టీ ఫ్యాక్టరీ, ఊటీ

ఇవీ చూడండి

మార్చు

చిత్రమాల

మార్చు

మూలాలు

మార్చు
  • క్షేత్ర సందర్శన