నత్తలొస్తున్నాయి జాగ్రత్త

నత్తలొస్తున్నాయి జాగ్రత్త మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఒక సైన్సు ఫిక్షన్ నవల.[1] తన ప్రదేశంలో లేని, దొరకని జంతువునో, జీవినో మనిషి తన సరదా కోసమో లేక అవసరార్థమో మరో ప్రదేశం నుంచి తెచ్చుకుంటే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికరంగా తెలిపుతుంది ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్ట్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది.

కెన్యాలో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సింగ్ కి అక్కడ అందరూ బాగా ఇష్టంగా తినే రాక్షసనత్తమాంసం తినటం అలవాటవుతుంది. పదవీ కాలం ముగిశాక, ఆ దేశం నుంచి భారతదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకుంటాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 300 గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు. ఎందుకంటే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పిల్ల ఐన ఒక్కొక్క నత్తా తిరిగి వారం రోజులలోనే దేనికది స్వతంత్రంగా సంతాన ఉత్పాదక శక్తిని పొంది స్వంత ఫ్యాక్టరీని ప్రారంభించేస్తాయి. కనుక ఉత్తమ్ రాక్షసనత్త జనాభా అధికం కాకుండా తన జాగ్రత్త తను పడుతూ ఉంటాడు. కానీ, ఒకసారి ఉత్తమ్ ఢిల్లీ నుంచి మదరాసుకి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఖాజిపేట దగ్గర ప్రమాదం జరిగి సింగ్ తోపాటు అతని సూటుకేసులో ప్రయాణిస్తున్న రాక్షసనత్తలు బంధవిముక్తులై వివిధ మార్గాల ద్వారా నెమ్మదిగా హైదరాబాదుకి చేరుకుంటాయి. అసలు వినాశనం ఇక మొదలవుతుంది.

పుట్టిన ప్రతి నత్తా వారం రోజులలో సంతాన సాఫల్యతా శక్తి సంపాదించుకుని తడవకి 300 గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఈ 300 గుడ్లు ఒక్క రోజులో నత్తలై వారం తిరిగేసరికల్లా (300X300) 90000 నత్తలకి ప్రాణమివ్వగలవు. అలా వాటి జనాభా అనతి కాలంలోనే చైనా జనాభాని సైతం అధిగమించి పోతుంది. ఈ నత్తలకీ ఆకలి అధికం. అది తీరనిది. వజ్రాలని కొరకలేవు తప్ప, పచ్చగడ్డి నుంచి పసిడి నగలదాకా అవి వేటినైనా స్వాహా చేసేయగలవు. పసిపిల్లలని సైతం వదిలి పెట్టకుండా కొబ్బరి ముక్కల్లా కొరికి చప్పరించేస్తాయి. ఈ జరుగుతున్న మారణహోమానికి దేశం దేశమే కంపించిపోతుంది. పరాయి దేశాలలోనూ ప్రకంపనలు మొదలవుతాయి. ఆ దేశాలు మన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటాయి. ఎయిర్ ఇండియా సంస్థ మూల పడుతుంది. ఈ నత్తలు విధ్వంసక సామ్రాట్టులవటంతో బీమా సంస్థలన్నీ దివాళా తీస్తాయి.

ఈ విలయతాండవానికి అంతం లేదా? పరిష్కరించటం ఎలా? అని తలలు బద్దలు కొట్టుకోటానికి పెద్దలు అందరూ ఓచోట చేరినపుడు, పరిశోధక పత్రికా రచయిత రఘుపతికి బల్బు వెలుగుతుంది. రాక్షసనత్తలకి జన్మస్థలమైన కెన్యా దేశంలో వీటివల్ల కించిత్తైనా బెడద లేదు. ఒకేఒక్క నత్త వల్ల దాని విధ్వంసకర సంతతి కేవలం నెల, నెలా పదిహేను రోజులలో ఒక బిలియన్ లేదా వంద కోట్ల స్థాయికి చేరుకుంటే, ఆ దేశం ప్రపంచ పటం నుండి ఎప్పుడో మాయమైపోయి ఉండేది. సృష్టిలో ఉన్న విచిత్రమైన విశిష్టత ఏమిటంటే ప్రతి అనర్థానికి ఒక సహజమైన విరుగుడు ఉంది. పాములు విపరీతంగా పెరగకుండా గద్దలు, ముంగీసలు ఉన్నాయి. అలాగే రాక్షసనత్తలకి విరుగుడు ఉండే ఉంటుంది. అది ఆ దేశానికి వెళితే కానీ తెలియదు. ఇలాంటి సహేతుకమైన ఆలోచనలతో కెన్యాదేశానికి బయలుదేరతారు రఘుపతి, జంతుశాస్త్ర ప్రొఫెసర్ పాంచజన్య. పశ్చాత్తాపంతో, పాప ప్రక్షాళన కోసం వీరిని వెంబడిస్తాడు ఉత్తమ్ సింగ్. అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొన్నాక, వారికి రాక్షస నత్తలకి శత్రువైన గినాక్సిస్ నత్తలు లభిస్తాయి. వాటిని పదిలంగా భారతదేశానికి తీసుకువచ్చి రాక్షసనత్తలని సంహరించి జరుగుతున్న ఘోరాన్ని అదుపులోకి తేగలుగుతారు.

మూలాలు

మార్చు
  1. వేమూరి, వెంకటేశ్వర రావు. "తెలుగులో సైన్సు ఫిక్షన్ రచనలు". sakshi.com. సాక్షి. Retrieved 3 February 2017.