మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్రముఖ రచయిత
(మల్లాది వెంకటకృష్ణమూర్తి నుండి దారిమార్పు చెందింది)

మల్లాది వెంకట కృష్ణమూర్తి (జ. 13 నవంబరు, 1949) తెలుగు రచయిత. ఈయన నవలలు, కథలు, యాత్రా రచనలు చేశాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి. విజయవాడలో మల్లాది దక్షిణామూర్తి, శారదాంబ దంపతులకు జన్మించిన ఈయన 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. 1972 వరకు కొన్ని ప్రైవేటు సంస్థల్లోనూ, ప్రభుత్వ ఆడిట్ కార్యాలయంలోనూ పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 1986 లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రచయితగా మారాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి
జననం (1949-11-13) 1949 నవంబరు 13 (వయసు 74)
విద్యకామర్స్ పట్టభద్రుడు
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిఆడిటరు, రచయిత
జీవిత భాగస్వామిపద్మజ
తల్లిదండ్రులు
 • మల్లాది దక్షిణామూర్తి (తండ్రి)
 • మల్లాది శారదాంబ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

బాల్య విశేషాలు

మార్చు

ఆయన 1949, నవంబర్ 13విజయవాడలో జన్మించాడు.[1] మల్లాది శారదాంబ, మల్లాది దక్షిణామూర్తి ఆయన తల్లిదండ్రులు. వారి కుటుంబంలో ఆయన ఏడో సంతానం. 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఆయన 1972 వరకు వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి, హైదరాబాదు లోని ప్రభుత్వ అడిట్ కార్యాలయంలో ఆడిటరుగా చేరాడు. 1986 లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఎందరో సంపాదకులు, మల్లాది చిత్రాన్ని, తమ పత్రికలలో ప్రచురిస్తామన్న అభ్యర్థనకు, రచయిత తన అంగీకారమివ్వనందువలన, మల్లాది ఛాయాచిత్రం ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు.

మల్లాది రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ మల్లాది శారదాంబ ఆంధ్ర ప్రభ వారపత్రిక కొనేది. వారి పక్కింటివాళ్ళు ఆంధ్ర పత్రికని కొనేవారు. ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళలాగా వాటిని ఒకరి పుస్తకం ఇంకొకరు మార్చుకుని చదువుకునేవాళ్ళు. ఇలా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.

ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి దీపావళికి ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికల ప్రత్యేక సంచికలు. ఎక్కువ పేజీలతో, ఆకర్షణీయంగా ఉండేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పడే వారు. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే యువ, జ్యోతి మాస పత్రికలు కూడా దీపావళి, సంక్రాంతి పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. అవసరాల రామకృష్ణారావు, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, భరాగో, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఆదివిష్ణు తదితరుల కథలు వాటిలో వచ్చేవి.

సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన. పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.

ఇవి కాక టెంపోరావు, గుత్తా బాపినీడు, డాక్టర్, భయంకర్, విశ్వప్రసాద్, ప్రసాద్, కనకమేడల, కొమ్మూరి సాంబశివరావు మొదలైన వారి డిటెక్టివ్ నవలలని వారింట్లో అద్దెకి వున్న మద్దాలి సీతమ్మ గారు తమ బంధువుల నుంచి తెచ్చి ఇచ్చేవారు. డిటెక్టివ్ నవలల్లో ఇలా విసుగు కలిగించేవి కనిపించేవి కావు. ఎందుకంటే వారు కథని సంభాషణల ద్వారా నడిపించేవారు. పత్రికల్లోని రచనలకి, డిటెక్టివ్ నవలలకి తేడాని స్పష్టంగా గమనించ గలిగారాయన. డిటెక్టివ్ నవలల్లో ఫిలాసఫీని చెప్పేవారు కారు. సాధారణంగా నవల సంభాషణలతోనే మొదలయ్యేది. గాంధీనగర్లోని న్యూ ఇండియా సెంటర్లో బళ్ళ మీద అద్దెకి ఇచ్చే కొమ్మూరి నవలలని తెచ్చుకుని చదివే వారాయన. వాటి వెల అర్థరూపాయి. రోజుకి అణా అద్దె. వాటిని అణా లైబ్రరీలు అనేవారు.

ఆరోజుల్లో ఆయన పత్రికల్లో చదివిన అనేక వేల మంది రచనా విధానాలే ఆయనకు మార్గదర్శకత్వం అయ్యాయి. ఎలా రాయాలో కంటే ఎలా రాయకూడదో ఆయనకు చిన్న వయసులోనే తెలిసింది. ఏ సమాచారం పాఠకుడిగా నాకు విసుగ్గా వుండేదో దాన్ని ఆయన రచనలనల్లో దొర్లకుండా వారు రచయితగా మొదటినించి జాగ్రత్తని తీసుకోసాగారు. పైగా మెత్తటి వాక్య నిర్మాణంలో దిట్ట అయిన కొమ్మూరి సాంబశివరావు నవలలు అన్ని అనేకమార్లు చదవడం వల్ల ఆయనకు అలాంటి వాక్యాలు రాయడం బాగా పట్టుపడింది. ఏది పాఠకుడిని తికమక పెట్టకుండా, వారి మెదడుని ఒత్తిడి చేయకుండా చెప్పాలి అని ఆయన బాగా గ్రహించారు. ఆ సూత్రాన్ని ఆనాటి డిటెక్టివ్ రచయితలు గ్రహించి పాటించారు. పత్రికల్లోని కథల పోకడకి, డిటెక్టివ్ నవలల్లోని పోకడకి గల తేడాని పట్టుకోగలిగారు. ఈ కారణంగా ఆయన శైలి సులభంగా వుంటోంది.

ఆయన కాలేజిలో చదివేప్పుడు ఓ సారి ఓ కథని రాసారు. అది తెలిసి వారి నాన్న మల్లాది దక్షిణామూర్తి చదువు చెడుతుందని కథలని రాయద్దని చెప్పారు. దాంతో మళ్లీ రాయలేదు. అప్పుడప్పుడు వారి నాన్నగారు, కథలు రాస్తున్నావా? మానేశావా? అని అడిగేవారు కూడా. బి.కాంలో ఆయన సహ విద్యార్థి మురళి అని ఒకడు వుండేవాడు. అతను కూడా చిన్నప్పటినుంచి చదివేవాడు. ఓ రోజు ఆయనకు వారు రాసిన కథని చదవమని ఇచ్చాడు. ఘనమైన అయ్యా అన్న పదాలతో అది మొదలైంది. మర్నాడు వారిద్దరూ అలంకార్ సినిమా హాల్ని దాటి ఎదురుగా వున్నా వంతెన మీదకి రాగానే కథ ఎలా వుందని అడిగాడు. కథా రచనలో మల్లాది ఏర్పరచుకున్న అభిప్రాయాలని అన్నిటి ప్రకారం ఆ కథ బాగా లేదని విశ్లేషణాత్మకంగా చెప్పారాయన. ఆయన పరిజ్ఞానానికి స్నేహితునికి ఆశ్చర్యం వేసింది. వారు మంచి మిత్రులే అయినా ఎన్నడు కథల గురించి అంతదాకా మాట్లాడుకోలేదు. అతను తర్వాత దేవరకొండ మురళి అనే తన పేరుతో 10 దాకా కథలు రాసాడు.

ఉద్యోగం

మార్చు

1970 లో ఆయన చదువు బీకాం అయిపోయింది. ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, 1970 ఫిబ్రవరిలో వారి నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసారు. వారికి చిన్నప్పటి నుంచి కథలకి ఆలోచనలు తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారాయన. అక్కడ ఉద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసారు. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసారు. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసారు. వారు అప్పుడు ఓ సంగతి గమనించారు. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవారాయన. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక ఆయన వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తారని అర్థమయ్యిందాయనకు. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నారు.

వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనం అలవాటు. మల్లాది సికిందరాబాద్ రైల్వే స్టేషను దగ్గర సిటి బస్సు ఎక్కేవారు. అక్కడ పత్రికలు అమ్మే దుకాణాలు చాలా వుంటాయి కాబట్టి ఆయన వారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని మల్లాదికి పురమాయించారు. తొలిసారి 1970 ఆగష్టు మాసంలో చందమామలో ఆయన రాసిన కథ ప్రచురితమైంది. ఆయన రాసిన మొదటి కథే వెనక్కి రాకుండా ప్రచురించబడింది. అంతే కాకుండా వరసగా పత్రిక, ప్రభ, అపరాధ పరిశోధనల్లో కూడా ఆయన కథలు వెంట వెంటనే వరసగా వచ్చాయి.

రచయితగా

మార్చు

పేరు మల్లాది వెంకట కృష్ణ మూర్తి 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కథలు, కొన్ని వ్యాసాలూ, ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసారు. హిందీలో ఒకటి, కన్నడంలో మూడు, తుళు భాషలో ఒకటి, తెలుగులో డజనుకి పైగా ఆయన నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. పోలీసు రిపోర్ట్, తేనెటీగ అనే చిత్రాలకి మాటలు రాసారు. యాత్రా సాహిత్యం ట్రావెలాగు ఐరోపా, ట్రావెలాగు సింగపూర్, ట్రావెలాగు అమెరికా, అమరికాలో మరోసారి. కర్మ-జన్మ తాజా పుస్తకం. పిల్లల పేర్ల పుస్తకం, వంటల పుస్తకం, టిఫిన్ వరైటీలు, కథలు ఎలా రాస్తారు లాంటి నాన్-ఫిక్షన్ పుస్తకాలు, కొన్ని జోక్స్ కలక్షన్స్లని కూడా వెలువరించారు.

 
చంటబ్బాయి (చంటబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది)

నవలలు

మార్చు
 1. వెడ్డింగ్ బెల్ (గోల్‌మాల్ గోవిందం సినిమాగా తీశారు)
 2. ది గెస్ట్
 3. ఆధ్యాత్మక చిన్న కథలు [2]
 4. అందమైన జీవితం
 5. చంటబ్బాయి (ఈ నవల చంటబ్బాయి సినిమాగా నిర్మించబడింది)
 6. కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్
 7. డి ఫర్ డెత్
 8. దైవం వైపు
 9. ధర్మ యుద్ధం
 10. ఎఫ్ ఐ ఆర్
 11. లూపికా రాణి అతడు ఆమె
 12. మందాకిని
 13. రెండు రెళ్లు ఆరు
 14. మిస్టర్ వి
 15. మిష్టర్ నో
 16. సముద్రపు దొంగలు
 17. ముద్దుకు మూడే ముళ్ళంట
 18. ముంగిట మృత్యువు
 19. నిన్నటి పున్నమి
 20. నాకు నువ్వు, నీకు నేను
 21. ఓ మంచి మాట
 22. పారిపోయిన ఖైదీలు
 23. బలి కోరిన వజ్రాలు
 24. ప్రాక్టికల్ జోకర్
 25. పున్నమి
 26. రాక్షస సంహారం
 27. సావిరహే
 28. ష్ గప్ చుప్
 29. సద్దాం ఆంటీ ఇంటి కథ
 30. శనివారం నాది
 31. స్మయిల్ ప్లీజ్
 32. సారీ రాంగ్ నెంబర్
 33. తేనెటీగ
 34. అంకుల్ సాం - ఓ ప్రేమికుడు ఒక అగ్ర రాజ్యం మీద సలిపినపొరులోని ముఖ్యపాత్రధారి.
 35. వైకుంఠ యాత్ర
 36. లిటిల్ రాస్కెల్
 37. కొత్త శతృవు
 38. నత్తలొస్తున్నాయి జాగ్రత్త
 39. డెత్ సర్టిఫికెట్
 40. గ్రీన్ కార్డ్
 41. అ ఆ ఇ ఈ
 42. కథాకేళి
 43. అనగనగా ఓ నాన్న

కథల పుస్తకాలు

మార్చు
 1. పిల్ల ఆఫిల్స్ పుస్తకం
 2. నవ్వుల రవ్వలు

యాత్రానుభవాలు

మార్చు
 1. ట్రావెలాగ్ అమెరికా
 2. ట్రావెలాగ్ ఐరోపా

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2009-05-26.
 2. "మల్లాది వెంకట కృష్ణమూర్తి...చిన్న కథలు..1". Archived from the original on 2016-03-04. Retrieved 2013-04-25.

బయటి లింకులు

మార్చు