నత్తా రామేశ్వరాలయం
నత్తా రామేశ్వరాలయం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం, నత్త రామేశ్వరంలో గ్రామంలో ఉంది. నత్తారామేశ్వరాలయం ఒక విశిష్టదేవాలయం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను, వాయు పురాణంలోను ఉంది. పరశురాముడు "ఏడు కోట్ల మంది మునులూ దేవర్షులతో కలసి శివ లింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగము" అని పేరు. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి వుండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా వుండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివ లింగానికి పూజలూ, అభిషేకాలు చేస్తారు. ఈనెలలో మాత్రమే శివ దర్శనం వుంటుంది. ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.
నత్తా రామేశ్వరాలయం | |
---|---|
పేరు | |
స్థానిక పేరు: | నత్తా రామేశ్వరాలయం |
స్థానం | |
ప్రదేశం: | ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
సత్తా రామేశ్వరంలోని మరో శివలింగం.... రామేశ్వర లింగం. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకొని.... నత్తగుల్లలు, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని అందుకే దీనికి నత్తాలింగేశ్వరుడని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానము కలుగుతుందని, అపమృత్యుభయం వుండదని భక్తుల నమ్మిక. కాశీ క్షేత్రంలో లాగ ఈ క్షేత్రానికి మహాస్మసానమున్నది. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నత్తా రామేశ్వరమూర్తి చిన్న పరిమాణంలో గ్రామకంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంది. ఈ నత్తా రామేశ్వరాలయంలో వేరొక శిలపై రెండు సన్ననత్తగుల్లలంటి యున్న రాతిని చూపుతూ ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తారామేశ్వరుడు అనబడునంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తనీ నదీలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడుని పరశురామేశ్వరుడంటారు. ఈ పరశురామేశ్వరాలయం ఉత్తరాభిముఖంగా ఉంది. ముఖ మండపం ఈ ఆలయానిదే.
ఇక్కడ ఉన్న గోస్తనీ నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. పృధు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలు గోస్తనీ నదిగా ప్రవాహమయ్యాయట. మాతృ, భ్రాతృ హత్యా పాపవిముక్తికి ఇచట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయు పురాణములో నున్నది. నత్తారామేశ్వరుని ప్రతిష్థించింది సీతయట. రావణ వధానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముడు ఇక్కడ శయనించారని కథనం. అది పుణ్యక్షేత్రమైనందున శివప్రతిష్ఠకై సీత కోరికపై బాణమునకై ఆంజనేయుడు నర్మదానదికి పోయెనట. ముహూర్తకాలము దాటి పోవుచున్నందున, ఆంజనేయుని రాక ఆలస్యమై నందున సీత అచటి ఇసుక, నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినట. పరశురామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో ఉండుటచేత ధవళలింగం గోధుమలింగంగా మారిపోయింది.
చరిత్ర
మార్చుతూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం పునర్వైభవాన్ని సంతరించుకున్నది. తూర్పు చాళుక్య రాజులలో ఒకటో శక్తి వర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తున్నది. 1583 లో ఖులీపాదుషా ఆదేశల మేరకు ఇక్కడ ఆలయ పున:ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాదారల వలన తెలుస్తున్నది. ఈ ఆలయ రాజగోపురము నాలుగంతస్తులతో రమణీయంగా ఉంది. కళ్యాణ మండపంలో రాతిస్థంబాలపైనున్న శిల్పకళ నాటి శిల్పుల నైపుణ్యానిని నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రంలో మహాశివ రాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఒకానొక ప్రభవనామ సంవత్సరంలో మహామండలేశ్వర సింగారకోట ప్రతాప అన్నమరాజుకు భృత్యుడూ, తెల్లింగూటి అన్నమనీడు కొడుకునైన గంగినీడు రామేశ్వరనుకూ, జత్తిగ సోమేశ్వరునకూ స్థానం వారినుండి క్రయముచేసిన పూదోటను సమర్పించుకున్న వైనం నత్తారామేశ్వరం మండప శాసనాలలో ఉంది.
ఈ మండపంలో మరొక శాససనం శక. 1236 (సా.శ 1314) లో నాయిని దేవి రడి కొడుకు వల్లభరడి ఈ మూలస్తానము నతదేవరకు అరదీపము సమర్పించినట్లున్నది. వల్లభరెడ్డి నాడీ గ్రామ నామం నత్తారామేశ్వరం కాదు; గంగినీడు నాటికీ ఒక దేవుని పేరు నతదేవర-జుత్తిగ. బహుసా ఆయన పేరు మీదనే ఈ ఊరికి ఆపేరు వచ్చి ఉండవచ్చును కూడా!పరశురామేశ్వరాలయం అనబడుతున్న ఆలయ ప్రసక్తి శక. 1180 (సా.శ 1258) నాటి శాసనంలో ఉంది. నాటికాదేవుని పేరు రామేశ్వరుడనే వ్యవహరించబడేది. ఈ రాజులు కాకతీయుల పూర్వపు ప్రథమ సరోనాధులు-ఆంధ్రుల చరిత్ర ప్రకారం నేటి కాపు, తెలగకులంవారి వంశపురుషులు.
- ఎలావెళ్ళాలి.
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కి.మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ, అత్తిలి నుండి. 6 కి.మీ, మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రముంది.
మూలాలు
మార్చు- 1969 భారతి మాస పత్రిక వ్యాసం: కరవాలభైరవ మండపం-శ్రీ.జి.ఆర్.వర్మ.