నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు (జ.సెప్టెంబరు 15, 1924) సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.
జీవిత సంగ్రహం
మార్చువీరు 1923 సెప్టెంబరు 15న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తర్క, వ్యాకరణ, అలంకాల శాస్త్రాలను చదవటమే గాక సంగీతంలోనూ అందెవేసిన చేయి. 1948 డిసెంబరులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్థాపించారు. అప్పుడే వీరు వైలిన్ కళాకారులుగా ఉద్యోగంలో చేరారు. 35 సంవత్సరాలు విధి నిర్వహణ గావించి, 1983లో పదవీ విరమణ చేశారు. వీరు ప్రస్తుతం వయోలిన్ A Top కళాకారులు. హరికథా గానంలోను స్వీయ రచనలలోనూ ప్రతిభావంతులు. విప్రనారాయణ చరిత్ర వంటి యక్షగాన రచనలు, అష్టావధాన ప్రదర్శనలు వీరి ప్రతిభకు నిదర్శనలు. సంస్కృతాంధ్రాలలో 25కు పైగా గ్రంథాలు వ్రాశారు.
ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి వారు ' గాన కళాప్రపూర్ణ ' బిరుదుతో సత్కరించారు. ' సంగీత సాహిత్య కలానిధి ', ' హరికథా చూడామణి ' వీరి ఇతర బిరుదులు. సునిశిత హాస్యానికి ఆచార్యులవారు మారుపేరు. బిడాల మోక్షం పేరుతో వీరు వ్రాసిన కావ్య ప్రహసనం ఈ కోవకు చెందినది. గోదా గ్రంథమాల వారు వీరి త్యాగరాయ చరితము, పరకాల విలాసము, శఠగోప చరితము, శ్రీనృసింహ తాండవము ప్రచురించారు.
ఆచార్యులవారి సప్తతి పూర్తి మహోత్సవాలను అసంఖ్యాకమైన వారి శిష్య కోటి 1995 అక్టోబరులో విజయవాడలో ఘనంగా జరిపింది. కళాతపస్వి కృష్ణామాచార్యులని చినజియ్యర్ స్వామి] ప్రశంసించారు. బాలమురళి, అన్నవరప, N. Ch. త్రయం పారుపల్లి రామకృష్ణయ్యగారి శిష్య పరంపరకు చెందినవారు. కృష్ణమాచార్యుల తండ్రిగారు తిరువేంకటాచార్యులూ గొప్ప పండితులు. సంస్కృతం లోనూ కృష్ణమాచార్యులవారు నౌకా చరిత్రం, శఠ గోప చరితం, భూప్రశంస అనే గ్రంథాలు వ్రాశారు. నౌకా చరితము త్యాగరాజు తెనుగు గ్రంథానికి సంస్కృత అనువాదము. సంగీత సాహిత్యముల పరస్పరోపకారము ఈ రచనలో ప్రతిఫలించుచున్నదని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రశంసించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ఆచార్యుల వారివద్ద ఎందరో గాత్ర సంగీతము వయోలిన్ వాదనము అభ్యసించారు. N.C.V. జగన్నాధాచార్యూలు, N. Ch. నరసింహాచార్యులు వీరి బంధు వర్గములోని వారు. వారు కూడా ఆకాశవాణిలో పనిచేయటం విశేషం.