నారాయణ భట్టు, తొలితరం తెలుగు కవిగా ప్రసిద్ధుడైన నన్నయకు ఆంధ్ర మహాభారత రచనలో సహాయపడినాడు.వేణీసంహార నాటక కర్త యైన భట్టనారాయణుడు మరొక వ్యక్తి. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం సా.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.[1]

నారాయణభట్టు నన్నయకు సహాధ్యాయుడు అట. నారాయణభట్టు తనకు చేసిన సహాయాన్ని కీర్తిస్తూ నన్నయ చెప్పిన పద్యం -

పాయక పాక శాసనికి భారత ఘోరరణంబునందు నా
రాయణునట్లు వాణస ధరామర వంశ విభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయ ధురంధరుఁడుం దనకిష్టుఁడున్ సహా
ధ్యాయుడునైన వాఁడభిమత స్థితిఁ దోడయి నిర్వహింపగన్

నారాయణభట్టు ఎలాంటి సాయం చేశాడనే విషయంపై వివిధాభిప్రాయాలున్నాయి. వారు జంటకవులని కూడా కొందరంటారు. అయితే అది నిరాధారమని చెబుతూ పింగళి లక్ష్మీకాంతం ఇలా భావించాడు - "ఆయుధం పట్టకుండా కృష్ణుడు అర్జునునికి సాయం చేసినట్లే తాను స్వయంగా ఘంటం పట్టకుండా నారాయణభట్టు నన్నయకు తగిన సూచనలు ఇచ్చి ఉండవచ్చును. ఏ ప్రకరణం ఎలా పెంచాలి, కుదించాలి, సంస్కృతభారతాన్ని తెలుగులోకి ఎలా చేయాలి వంటి సముచితమైన సంప్రదింపులు వారిమధ్య జరిగి ఉండవచ్చును. గ్రంధారంభం నుండి తనకు చేదోడు వాదోడుగా సహాయపడుటనుబట్టియే నన్నయ కృతజ్ఞతాపూర్కంగా పై పద్యాన్ని చెప్పాడు. ఇది ఎంతో సార్ధకమైన పద్యము."[2]

నారాయణభట్టుకు రాజరాజనరేంద్రుడిచ్చిన నందంపూడి అగ్రహారం శాసనాన్ని నన్నియభట్టే వ్రాశాడు. అందులో "సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర ఇతి ప్రథిత సుకవిత్వ విభవేన్" అని నారాయణభట్టుగురించి చెప్పాడు.

ఇందు నారాయణభట్టు నామము నన్నినారాయణుడని ప్రస్తావించబడింది.నన్ని శబ్దము కన్నడ భాషలోదనియు, దానికి సుందరము లేక ప్రియమనియు అర్ధము ఉన్నదని పండితుల అభిప్రాయము.హారీత గోత్ర సంభవుడు, అపస్తంబసూత్రుడు, విద్వాంసుడు, ద్విజశ్రేష్ఠుడు అయిన కంచెన సోమయాజి ఈతని ముత్తాత. శాత్రువులకు కాలయముడై, కవీంద్రులకు కామధేనువై వాసికెక్కిన కంచెనార్యుడీయని పితామహుడు. మహాత్ముడు, శౌచాంజనేయుడు అయిన యకలంక శంకనాత్యుడు ఈతని తండ్రి. సామెకాంబ ఈతని తల్లి. నారాయణభటు సంస్కృత, ప్రాకృత, కర్ణాట, పైశాచికాంధ్ర భాషలయందు మంచి ధిట్ట. ఈనారాయణభట్టుని గురుంచి మరియొక శాసనం ద్రాక్షారామం లోని లభించిన కుపమ శాసనము.ఇది శకపురుషులు 977వ సంవత్సరంబున త్రైలోక్యమల్లదేవర ప్రధానిగా చెప్పబడిన నారాయణభట్లు కుమార్తెయైన 'కుపమ' దాక్షారామ భీమేశ్వర దేవరకు అఖండదీపము మొసగినట్లు తెల్పిన శాసనము.ఈ త్రైలోక్యమల్లుడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి.

మూలాలు

మార్చు
  1. డా. బి.స్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
  2. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం