శ్రీ మదాంధ్ర మహాభారతం

(ఆంధ్ర మహాభారతం నుండి దారిమార్పు చెందింది)


మహా భారతం సంస్కృతంలో వేద వ్యాసుడు వ్రాసిన మహా కావ్యం. భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు. దానిని శ్రీ మదాంధ్ర మహాభారతం అని అంటారు. దీనిని తెలుగులో వ్రాసిన ముగ్గురు కవులు - నన్నయ, ఎర్రన, తిక్కన - వీరిని కవిత్రయం అంటారు. తెలుగు సాహిత్యంలో నన్నయ వ్రాసిన శ్రీ మదాంధ్ర మహాభారతము నకు "ఆదికావ్యం" అని పేరు. ఎందుకంటే అంతకు పూర్వం తెలుగులో గ్రంథస్థమైన రచనలు ఏవీ ఇప్పటికి లభించలేదు.

తెలుగులో ఆదికావ్యం

మార్చు
 
ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరిన రాజరాజ నరేంద్రుని (సా.శ. 1019–1061) విగ్రహం (రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద

తెలుగులో నన్నయ ప్రారంభించిన మహాభారతమే ఆదికావ్యమా అనే విషయంపై అనేక సందిగ్ధాలున్నాయి. ఒక్కసారిగా అంతటి పరిణత కావ్యం ఉద్భవించదనీ, కనుక అంతకు ముందు తప్పకుండా కొన్నయినా పద్యరచనలు ఉండి ఉండాలని సాహితీచారిత్రికుల అభిప్రాయం. అయితే సూచన ప్రాయంగా పాటల, కవితల ప్రసక్తి (నన్నెచోడుడు) ఇంకా శాసనాలలో లభించే కొన్ని పద్యాలు తప్ప మరే రచనలూ లభించలేదు. కనుక నన్నయనే ఆదికవిగా తెలుగు సాహితీ ప్రపంచం ఆరాధించింది. ప్రాఙ్నన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ ద్వా.వా.శాస్త్రి ఇలా వ్రాశాడు[1] - "మొత్తంమీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి. మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉంది. శాసన కవిత వాడుకలో ఉంది. తెలుగు భాష జన వ్యవహారంలో బాగా ఉంది. అయితే గ్రంథ రచనాభాష రూపొందలేదనవచ్చును. అలా రూపొందడానికి అనువైన పరిస్థితులు లేవు. సంస్కృత ప్రాకృతాలపై గల మమకారమే అందుకు కారణం కావచ్చును.

ప్రాజ్ఞనన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ, నన్నయ యుగ రచనకు నాందిగా కాళ్ళకూరు నారాయణరావు ఇలా వ్రాశాడు [2] - "సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు." (నందంపూడి శాసనంలో 'నన్నియభట్టు' అని ఉంది).

కనుక మహాభారతాన్నే ఆదికావ్యంగాను, నన్నయను ఆదికవిగాను మన్నించడం తెలుగు సాహిత్యంలో నెలకొన్న సంప్రదాయము.

ఆంధ్ర మహాభారత ప్రశస్తి

మార్చు

ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ప్రాణం వంటిది. ఇది ఆది కావ్యమే కాదు. తెలుగు వారికి అమర కావ్యం కూడాను. "తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి." అన్న సూక్తి జనబాహుళ్యమైనది కవిత్రయం కృషివల్లనే. నన్నయ, తిక్కన, ఎఱ్ఱనాదుల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో వ్యాకరణానికి, నిఘంటువులకు, సూక్తులకు, జనప్రియ గాథలకు, కవిత్వ స్ఫూర్తికి ఇది పుట్టినిల్లు.

కవిత్రయం ప్రశంస

మార్చు

తెలుగు సాహిత్యంలో కవిత్రయంగా ప్రసిద్ధులైన నన్నయ, తిక్కన, ఎర్రనలకు ఉన్న స్థానం అనన్యమైనది. ముగ్గురూ మూడు తెలుగు సాహిత్య యుగాలకు యుగకర్తలుగా భావింపబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాహితీ ప్రక్రియకు ఆద్యులు అనవచ్చును. కావ్యరచనా శైలికి, ప్రసన్న కథా కలితార్ధయుక్తికి నన్నయ ఆద్యుడు. నాటకీయతకు, అక్షర రమ్యతకు తిక్కన ఆద్యుడు. ప్రబంధ శైలికి ఎఱ్ఱన ఆద్యుడు.

నన్నయ

మార్చు

ఆంధ్ర కవిత ఆరంభ దినాలలో నన్నయ ఆంధ్రభాషకొనర్చిన మేలు ఇంతింత అనరానిది. జన వ్యవహారంలోని పదజాలాన్ని అంతటినీ పరిశీలించి, సంస్కరించి, సంస్కృత పదాలను తెలుగులో వాడే విధానాన్ని నిర్ణయించి, తగిన సంస్కృత వృత్తాలను గ్రహించి, కన్నడ వాఙ్మయమునుండి ప్రశస్త లక్షణాలను సేకరించి, తెలుగులో ఉత్తమమైన కావ్యరచనావిధానాన్ని తీర్చి దిద్దాడు.[3]

రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణ రచన కు ప్రోత్సాహించాడు. అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడైన వయ్యాకరణి నన్నయ. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం సా.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.[4]

తిక్కన సోమయాజి 13వ శతాబ్దికి చెందిన కవి. మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉండేవాడు. ఈయన తొలిరచన నిర్వచనోత్తర రామాయణం. తిక్కన తెనుగు చేసిన రెండో గ్రంథం మహాభారతం. విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు ఒక్కచేతిమీదుగా తెనిగించాడు. తెలుగు పదాలను ఎక్కువగా వాడి, తెలుగు భాషకున్న ప్రత్యేక శక్తిని నిరూపించాడు.[5]

ఎఱ్ఱన ప్రోలప్రగడ వేమారెడ్డి కొలువులో ఉండేవాడు. ఈయనకు ప్రబంద పరమేశ్వరుడు అని బిరుదు ఉంది. వీరు హరివంశం ఇంకా రమాయనమును సంస్కృతము నుంచి తెలుగు లోకి అనువాదము చేసి ప్రొలప్రగడ వేమారెడ్డికి అంకితము చేశారు. వీరు ఆంధ్ర మహా భారతములో నన్నయ వదిలి పెట్టిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి కవిత్రయంలో ఒకరయ్యారు.

కవిత్రయం పాళ్ళు

మార్చు

నన్నయ ఆది పర్వాన్ని, సభాపర్వాన్ని, అరణ్యపర్వంలో కొంత భాగాన్ని 1054-1061 మధ్య కాలంలో రచించి దివంగతుడైనాడు. తరువాత 13వశతాబ్దంలో తిక్కన అరణ్యపర్వం శేషాన్ని వదలి, విరాట పర్వంనుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించాడు. ఆ తరువాత 14వశతాబ్దంలో ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు. ఇలా ఈ ముగ్గురు యుగ కవులూ కవిత్రయం అనే పేరుతో తెలుగు సాహిత్యకారులకు పూజనీయులయ్యారు. ఈ విధంగా రెండున్నర శతాబ్దాల కాలంలో ముగ్గురు కవులు రచించినా ఆంధ్ర మహాభారతం ఏకకాలంలో ఒకే మహాకవి రచించిన కావ్యాన్ని చదివిన మహానుభూతిని అందించడం ఆంధ్రావళి అదృష్టం. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంథమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉంది. ఈ రెంటినీ కలిపి ఖిలవంశ పురాణమనే స్వతంత్ర గ్రంథంగా పరిగణిస్తారు. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంథంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.ఆ విభజన క్రింది పట్టికలో చూడవచ్చును.[6]

పర్వం ఉపపర్వాల సంఖ్య సంస్కృత భారతంలో
శ్లోకాల సంఖ్య
ఆంధ్ర భారతంలో
ఆశ్వాసాల సంఖ్య
పద్య గద్య సంఖ్య
1. ఆదిపర్వం 18 9,984 8 2,084
2. సభాపర్వం 9 4,311 2 618
3. అరణ్యపర్వం 16 13,664 7 2,894
4. విరాట పర్వం 4 3,500 5 1,624
5. ఉద్యోగపర్వం 11 6,998 4 1,562
6. భీష్మ పర్వం 5 5,884 3 1,171
7. ద్రోణ పర్వం 8 10,919 5 1,860
8. కర్ణ పర్వం 1 4,900 3 1,124
9. శల్య పర్వం 4 3,220 2 827
10. సౌప్తిక పర్వం 3 2,874 2 376
11. స్త్రీ పర్వం 5 1,775 2 376
12.శాంతి పర్వం 4 14,525 6 3,093
13. ఆనుశాసనిక పర్వం 2 12,000 5 2,148
14. అశ్వమేధ పర్వం 2 4,420 4 976
15. ఆశ్రమవాస పర్వం 3 1,106 2 362
16. మౌసల పర్వం 1 300 1 226
17. మహాప్రస్థానిక పర్వం 1 120 1 79
18. స్వర్గారోహణ పర్వం 1 200 1 97
19. భవిష్య పర్వం 2 (వదలబడినవి) -- --
మొత్తం 100 1,00,500 63 21,507

కవిత్రయం రచనా శైలి

మార్చు

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.[7]

కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి .[6] నన్నయ చూపిన మార్గంలోనే ఇతర కవులూ కథనంలోను, కథలోను మూలానికి భంగం కలుగకుండా, క్రొత్త అందాలు సంతరించి దానిని ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దారు. ఈ పునస్సృష్టి విశిష్టతను అనేక సాహితీకారులు పరిశోధించారు. అందుకు నిరూపణగా చెప్పబడిన కొన్ని అంశాలు -

 1. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలుపలేదు.ఇలా భారత గాథను తెలుగులో పాండవనాయకంగా మలచారు.
 2. వ్యాసమహర్షి రచనలో శాస్త్రప్రతిపాదనా దృక్ధం, ప్రబోధ ప్రవృత్తీ ప్రముఖంగా ఉన్నాయి. కావ్యస్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం. "కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి".
 3. వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
 4. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
 5. వ్యాసుని శ్లోక రచనా శైలికంటే నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
 6. కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కథను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించాఱు. కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.

కవిత్రయంలో ముగ్గురు మహాకవులూ తెలుగు సాహితీ చరిత్రలో ఆయా యుగాలకు ప్రధాన దీపస్తంభాలుగా ఆదరణీయులయ్యారు. వారిలో ఒక్కొక్కరు కొన్ని ప్రత్యేక రచనా నైపుణ్యాలకు ప్రసిద్ధులయ్యారు

నన్నయ

నన్నయ శైలిలో ప్రధానంగా పరిగణింపబడిన అంశాలు నన్నయయే ఇలా చెప్పుకొన్నాడు

 • ప్రసన్న కథా కలి (వి) తార్ధ యుక్తి
 • అక్షర రమ్యత
 • నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం
తిక్కన

తిక్కన శైలిలో ముఖ్యాంశాలు -

 • ప్రక్రియా వైచిత్రి - హరిహరనాథ తత్వదర్శనం, ఉభయ కవిత్వ తత్వ విచారం
 • నాటకీయత, సన్నివేశరంగాలు, సంభాషణా శిల్పాలు
 • పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత సంభాషణలు
 • యుద్ధ ఘట్టాల వర్ణనలో అసాధారణ నైపుణ్యం
 • అలంకార శిల్పం

"తిక్కన శిల్పపుఁ ధెనుఁగు తోఁట" అని విశ్వనాధ సత్యనారాయణ కీర్తించాడు. "తెనుంగుల జాతులేర్పడన్ తిక్కన విధాత శబ్ద సంతానాన్ని ఏలాడు" అని రాయప్రోలు సుబ్బారావు అన్నాడు. "అచ్చ తెనుఁగు భాష సూక్ష్మాతిసూక్ష్మములైన మనోభావములను వ్యక్తము చేయుట యందును, అతి గంభీరములైన శాస్త్ర పరమార్ధములను నిష్కర్షగా వివరించుట యందును కూడ సమర్ధమే అని తన ప్రయోగములచే లోకమునకు చూపినవాడు తిక్కన.... వ్యావహారి భాషా పదములకే శుద్ధరూపమును, క్రొత్త ప్రాణమును ఇచ్చి ఆయన భారతమును రచించెను." అని పింగళి లక్ష్మీకాంతం అన్నాడు.

ఎఱ్ఱన

నన్నయ, తిక్కనలు పన్నిన హారం రెండు భాగాలను మధ్యన తన అరణ్యపర్వశేషరచన అనే మణితో అనుసంధానించాడట ఎఱ్ఱన. వినయం, వర్ణనా కౌశలం ఎఱ్ఱన రచనలో ముఖ్యమైనవి.

 • ప్రబంధ శైలి
 • మంజుల వాగమృత ప్రవాహం
 • చతురోక్తులు, మధురోక్తులు, హృద్యోక్తుల సమాహారం

"ఎఱ్ఱన మహాకవి రచన నన్నయ, తిక్కనల త్రోవలను తప్పిపోవక అటనట వర్ణనలు కథాభావములందు ప్రవసింపగా సరళముగా, శిథిల మధురమగు నడకతో మాఘమాసపు సరస్వతీ ప్రసన్నతతో మృదువుగా చదువరులను ఆకర్షించును" - అని శిరోమణి వేదాల తిరువేంగళాచార్యులు అన్నాడు.

తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభారతం స్థానం

మార్చు

లభిస్తున్న వివిధ ప్రతులు

మార్చు

క్రింద రచయితలచే రాయబడిన మహాభారత పుస్తకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి

 • పుల్లెల శ్రీ రామ చంద్రుడు
 • పిలకా గణపతి శాస్త్రి
 • ఉషశ్రీ
 • కవిత్రయ మహాభారతం

ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులు

మార్చు

విశేషాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 1. తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
 2. కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
 3. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
 4. బి.ఎస్.ఎల్._హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - ప్రచురణ:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-28. Retrieved 2020-02-14.
 6. 6.0 6.1 కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతము - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ.- డా. జి.వి. సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో - కవిత్రయం మహాభారతం ప్రాజెక్టుగా 15 సంపుటాలలో ముద్రింప బడింది. - 2008 ప్రచురణ
 7. http://telugusahityavedika.wordpress.com/ Archived 2009-02-01 at the Wayback Machine లో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచన - "అనువాదాలు అరసున్నాలేనా" (రచయిత అనుమతి తీసుకొనలేదు. కాని తెలియబరచడమైనది. అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో...

బయటి లింకులు

మార్చు
అంతర్జాలంలో లభించే ఆంధ్ర మహాభారతానికి సంబంధించిన రచనలు