నిమి ఇక్ష్వాకుపుత్రులలో ఒకఁడు. ఇతఁడు ఒకానొక సమయమునందు ఒక యాగము చేయ కోరి తన పురోహితుఁడైన వసిష్ఠుని ఒద్దకు పోయి తాను చేయఁబూనిన యజ్ఞమును నడపింప ప్రార్థించెను. అందులకు అతఁడు నన్ను ఇంతకుముందే ఇంద్రుఁడు తన యజ్ఞమునకు అధ్వర్యుఁడుగా వరించి పోయి ఉన్నాఁడు కనుక ఆయజ్ఞమును నెఱవేర్చివచ్చి నీయజ్ఞమును నడపెదను అని చెప్పెను. దానికి ఇతఁడు కోపించి ఆయనను విడిచి గౌతమఋషిని వరించి ఆయనచేత యజ్ఞమును సాగించెను. అనంతరము వసిష్ఠుఁడు ఇంద్రుని యజ్ఞమును నెఱవేర్చివచ్చి ఇతనియొక్క ఇంటివాకిట చేరి కాచి ఉండెను. అప్పుడు బడలికచేత పగలు అని ఎంచక ఇతఁడు నిద్రించుచు ఉండెను కనుక ఆవృత్తాంతము విచారింప అనుకూలింపక పోయెను. అంతట వసిష్ఠుఁడు కులగురుఁడను అగు నన్ను విడిచి యజ్ఞము చేయుటగాక నేనువచ్చి వాకిట నిలిచి ఉన్నను విచారింపక మత్తుఁడై నన్ను అవమానించిన ఈదుష్టుఁడు అంగహీనుఁడు అగుగాక అని శపించెను. అది హేతువుగ ఇతఁడును వసిష్ఠుని అట్లే శపించెను. అపుడు బ్రహ్మ వీరి తెఱఁగు ఎఱిఁగి నిమిని సకల ప్రాణుల కనుఱెప్పలయందు వసించునట్లును, వసిష్ఠుని మిత్రావరుణులకు కొడుకై దేహధారి అగునట్లును అనుగ్రహించెను. కనుకనే ఱెప్పపాటునకు నిమిషము అను పేరు కలిగెను. ఇతని కొడుకు మిథిలుఁడు. ............. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=నిమి&oldid=1886185" నుండి వెలికితీశారు