నిష్ఠల సింహాచల సిద్ధాంతి

నిష్ఠల సింహాచల సిద్ధాంతి (1877 - 1946) సుప్రసిద్ధ నాటక కర్త, నటులు. వీరు విజయనగరం జిల్లా ఇంగిలపల్లి గ్రామంలో జన్మించారు. అదే జిల్లాలోని సాలూరు పట్టణంలో స్థిరపడ్డారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తిచేశారు. వీరు క్రమంగా నాటక రచన, నటనపై అభిమానం పెంచుకున్నారు. వీరు సాలూరు, గొట్టిముక్కల ఆస్థానాలలో పలు గౌరవాలు పొందారు. సాలూరు జమిందారు లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు గారి అస్థాన విద్వాంసులుగా ఉండేవారు. రాజా వారి కోరికపై 'కిమ్మూరివారి వంశావళి' అనే గ్రంథాన్ని రాశారు. అలాగే 'సాలూరి వారి వంశాలు' అనే మరొక గ్రంథం కూడా రాశారు. రాజావారు స్థాపించిన 'సీతారామ విలాస నాటక సమాజం' వారు ప్రదర్శించే నిమిత్తం 'లక్ష్మణా స్వయంవరం', సీతాకళ్యాణం' మొదలైన నాటకాలు రాశారు. వీటిని విజయనగరం జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారు. 'లక్షణా పరిణయం' అనే ఒక ప్రబంధం రాసి పరమశివునికి అంకితం చేశారు. తర్వాత 'గొట్టిముక్కల వారి వంశావళి' అనే చారిత్రక కావ్యం రాశారు. గొట్టిముక్కల వారు విజయనగర రాజ బంధువులు కావడం మూలంగా వీరి చరిత్ర విజయనగర వాసులకు ఆనందం కలిగించింది. భద్రాచల క్షేత్ర మహాత్మ్యం పై చివరి రచన చేశారు. వీరి రచనలు సరళంగాను, సుబోధకంగాను ఉంటాయి.

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 2005.