నీతి సుధా లహరి సంస్కృత శ్లోక, తెలుగు పద్య, గద్య వివరణలతో ప్రచురించబడిన పుస్తకము. దీనిని శ్రీ కోట రఘురామయ్య గారు రచించారు. ఈ పుస్తక రచనకు మూలం నీతి శాస్త్రము పేర సంస్కృతంలో ముద్రించబడి చాలా ప్రచారములో నున్నది. ఈ అనువాద ప్రక్రియకు బ్రహ్మశ్రీ వట్టిపల్లి మల్లినాథశర్మ సహాయాన్ని అందించగా, బ్రహ్మశ్రీ వింజమూరి విశ్వనాథమయ్య గారు ప్రతి పద్యమునకు తాత్పర్యములను, వ్యాఖ్యలను జోడించి కృతిని అందరూ చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా తయారుచేశారు. దీనిని 2009 సంవత్సరంలో ఋషి బుక్ హౌస్, విజయవాడ వారు ముద్రించారు.

నీతి సుధా లహరి పుస్తక ముఖచిత్రం.

రచయిత మార్చు

కోట రఘురామయ్య గారు కోఆపరేటివ్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తూ డిప్యూటీ రిజిస్ట్రారుగా పదవీ విరమణ చేశారు. ఉద్యోగరీత్యా తీరిక లేకున్నా తెలుగు సాహిత్యాధ్యయనం చేస్తూవుండడం విశేషం. బాల్యం నుండి సంప్రదాయబద్ధమయిన ఛందోవిలసిత పద్యములు వ్రాస్తూ కవిపండితుల ప్రశంసలు పొందడం అలవాటుగా చేస్తుకున్నారు.

ఉదాహరణలు మార్చు

శ్లోకం 16: పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతమ్,

అథవఅ పునరాయాతం జీర్ణం భ్రష్టా చ ఖండాశః

కందం: విత్తంబును, బిత్తరియును,

పొత్తము పెరవారు గొంచు బోయిన బోవున్
ఎత్తఱి నైనన్ వచ్చిన
కత్తెరబడు, భ్రష్టమగును, కండంబెయగున్.

తాత్పర్యం: ధనం, యువతి, పుస్తకం - వీటిని ఇతరులు తీసుకొని వెళ్తే తిరిగిరావు. ఒకవేశ ఎప్పుడైనా వచ్చినా ముక్కలై, చెడిపోయి, చిరిగిపోయి వస్తాయి.

వివరణ: పద్యం ఎత్తుగడ, నిర్వహణ అంతా అచ్చతెనుగు గుబాళింపే. అందువల్ల అనువాదమన్న్ట్లు కాక, కొత్త పద్యంలా భాసిస్తోంది. బిత్తరి (వనిత), కత్తెరబడు (ఖండశః) అనే ప్రయోగాలు కొత్త వెలుగునిచ్చాయి.

శ్లోకం 17: ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రౌషధ సమాగమాః,

దాన మానావమానాశ్చ నవ గోప్యా మనీషిభిః.

ఆటవెలది: ఔషధమ్ము, ధనము, నాయువు, దానము,

మనసులోని పొంగు, మంత్రములును,
సంగమవివరాలు, స్వావమానం, బింటి
గుట్టు నెపుడు బైట బెట్ట దగదు.

తాత్పర్యం: ఔషధం, ధనం, ఆయుస్సు, దానం అధిక సంతోషం, మంత్రాక్షరాలు, రతి విషయాలు, తనకు జరిగిన అవమానం, ఇంటి గుట్టు - ఈ తొమ్మిదింటిని బహిరంగపఱచరాదు.

శ్లోకం 25: ఉత్తమే క్షణకోపస్స్యా న్మధ్యమే ఘటికాద్వయమ్,

అధమే స్యా దహోరాత్రం పాపిష్ఠే మరణాంతకమ్.

తేటగీతి: ఉత్తముని యందు క్షణకాల ముండుకోప,

ముండు, మధ్యము నందిది రెండుఘడియ,
లధమునం దొక దివసము నరుగుదాక,
పాపియందిది వాడుండు వరకు నిల్చు.

తాత్పర్యం: కోపం ఉత్తమునిలో క్షణకాలమే ఉంటుంది. మధ్యమునిలో రెండు ఘడియలు ఉంటుంది. అధమునిలో ఒక దినం దాకా ఉంటుంది. పాపిష్ఠి వానిలో వాడు బ్రతికి ఉన్నంత కాలం నిల్చి ఉంటుంది.


శ్లోకం 72: అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకౌ,

రిక్తహస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుమ్.

ఆటవెలది: అగ్నిహోత్రుగృహము, ననఘమౌక్షేత్రంబు,

వగ్గు, నిసుగు, గర్భవతిని, గురువు,
దైవతమ్ము, రాజు దర్శింప దలచిన
జేతు లూపుకొనుచు జేర జనదు.

తాత్పర్యం: హోమం జరిగే చోటుకు, ఇంటికి, పుణ్యక్షేత్రానికి, వృద్ధులు, శిశువులు, గర్భవతులు వీరి దగ్గరికి, గురువు, దేవుడు, రాజు వీరి దగ్గరికి దర్శనార్థం వెళ్ళినప్పుడు వట్టిచేతులతో పోరాదు. అంటే పూలు, పళ్లు లాంటి వేవైనా తీసుకొని వెళ్లాలన్నమాట.

మూలాలు మార్చు

  • నీతి సుధా లహరి (శ్లోక - పద్య - వివరణలతో), అనువాదం శ్రీ కోట రఘురామయ్య, వివరణ డా. వింజమూరి విశ్వనాథమయ్య, ఋషి బుక్ హౌస్, విజయవాడ, 2009.