నీరుకొండ హనుమంతరావు
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నీరుకొండ హనుమంతరావు ప్రముఖ కవి. ఖమ్మం జిల్లా మధిర తాలూకా అల్లీనగరంలో 1933, నవంబర్ 22న జన్మించాడు. ఖమ్మం కేంద్రంగా జరిగిన అన్ని సాహిత్య సాంస్కృతిక పోరాటాలలో ఆయన సలహాలూ సూచనలూ బ్రతికినంత కాలం చేసాడు. జ్ఞానసముపార్జనలో నిరాడంబర జీవితాన్ని గడిపాడు. కాళిదాసు నుంచి ప్రస్తుత కవులదాకా వేలాది పద్యాలు నోటికి చెప్పగలిగిన ధారణ ఆయన సొంతం.
1970 చారిత్రక విరసం మహాసభలు ఖమ్మం వర్తక సంఘ భవనంలో జరిగినప్పుడు, ఆ రోజు సభలో ఆవిష్కరణ చేసిన ఆనాటి ప్రభుత్వం నిషేధించ బడిన ‘ఝంఝ’ కవితా సంకలనం అట్ట మీద చార్వాక పేరుతో “పాణిగ్రాహి బొబ్బిలి సుబ్బరాయ వీరాగ్రణి ,గుమ్మెట లెందరు వాయించలేదు కొమ్ములు ఎందరికి మొలవలేదు….అని “నీలా కలాన్ని కత్తిని పట్టి/కలంతో యగ్నికిరణాలు" విరజిమ్మి/కత్తితో శత్ర్వువు కుత్తుకలుత్తరించ/నిలచిన వాడేడి సమరాన నడిచినవాడేడి” అని అమరుడు శ్రీకాకుళ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి మీద రాసిన చారిత్రాత్మకమైన నివాళి పాట మర్చిపోవాల్సినంత చిన్న విషయం కాదు. మద్రాస్ ప్రెస్ నుండి ఆ కవితా సంకలనాలు చేతిలో పెట్టుకొని ఖమ్మం రైల్వే స్టేషన్ లో ‘నరుడో భాస్కరుడా’ అనే పాటను పాడుకుంటూ రైలు దిగిన శ్రీ శ్రీ నీ మర్చి పోలేరు. ఎనభై మూడేళ్ళ నీరుకొండ ఈ మధ్యనే వైరాలో అమరుడు అయ్యాడని చానా ఆలశ్యంగా తెలుసుకున్నా. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ జీవితంలో సాహిత్యమే ఊపిరిగా బ్రతికిన ఆయన మరణం వర్తమాన పత్రికల్లో రెండు ఇంచుల వార్తగా కూడా నమోదుకాలేక పోయింది.. ఆయనను దగ్గరగా చూసినవారూ రెండు వాక్యాలు రాయకపోవడమూ మరో విషాదం.
ప్రాచీన ఆధునిక ప్రపంచ సాహిత్యం ఆశువుగా చెప్పగల, అమరాన్ని వల్లెవేసి చద్వివిన చదవు. కాళిదాసు నుంచి నిన్నా మొన్నా రాస్తున్నా కవులదాకా వేలాది పద్యాలు నోటికి చెప్పగలిగిన ధారణ ఆయన సొంతం. మంచి పద్యాలు రాయగలడు అనువాదాలూ చేయగలడు. ఆ అనుభవమే కిషన్ చందర్ ‘తిరిగొచ్చిన గాడిద’ ‘నేపాలో గాడిద’ అనువాదం చేయగా విశాలాంధ్ర ప్రచురణలు పుస్తకంగా వేసాయి. శ్రీ శ్రీతో ప్రశ్నా జవాబులలో ఆయన చేసిన ఇంటర్వూ చరిత్రలో నమోదు అయ్యే ఉంది. ఎనభయ్యేళ్లకు పైనా సాగిన ఆయన జీవితం నేమ రేసుకోవడం అంటే ఆయనతో పెనవేసుకున్న చరిత్ర శకలాలను తడుము కోవడమే. ఎందుకంటె ఆయన ఉమ్మడి కమ్మ్యూనిస్ట్ ఆలోచనలో తన వ్యక్తిత్వాన్ని ఉనికినీ చూసుకున్నోడు. బ్రతుకంతా ఎర్రజెండా రెప రెపలు కలగన్నోడు.
చిన్న వయసులోనే ఆంధ్ర మహాసభలో పాల్గొని తన ప్రాపంచక దృక్పదం ఏంటో నిర్ణయించుకున్నాడు. చిర్రావూరి లక్ష్మినర్సయ్య జీవితకథనూ రాసాడు. మధిరలో గాంధీ గారిని కలిసిన ముచ్చట్లు, దాశరథి సోదరుల మొదలు, సర్వదేవభట్లరామనాధం, గుర్రం జాషువా, శివసాగర్, దిగంభరకవులు, రాహుల్ సాన్క్రుత్యాన్, హీరాలాల్ మోరియా, కౌముది, హరీష్, చిత్రకారుడు కాళ్ళ, శివకోటి మొదలు ఈ తరం కవుల దాకా ఎన్ని స్నేహాలు. ఆనాటి జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, అక్షర దీపం లాంటి చారిత్రక సంఘటన లతో మమేకం. పుల్లారెడ్డి నిర్మిస్తున్న ప్రతిఘటనా పోరాటాలకు సన్నాహక సమావేశాలు, ఒకటా రెండా జీవితం అంతా మార్పుకోసం జరిగే ప్రతి చిన్న మలుపులో, కుదుపులో చేయూత అవ్వడమే జీవితం అన్న నమ్మకం నీరుకొండది.
ఖమ్మం జిల్లా మధిర తాలూకా అల్లీనగరంలో 1933 నవంబర్ 22 న మొదలైన బాల్యం పోయిన నెల ఇరవై నాలుగున వైరాలో ముగిసిన ఆయన ప్రస్థానం ఎందుకో జయంతి పురం రాజావారి సంస్థానంలో కొంతకాలం గడిచింది అని ఆయన తరుచూ నాతో చెబుతూ ఉండేవాడు.వాళ్ళ తాత అక్కడ ఉద్యోగి అనీ, తను పుట్టాక ఖమ్మం జిల్లాకు మారారు అని చెప్పేవాడు. ఆయన పుట్టింది జయంతిలో అయినప్పటికీ పెరిగిన అల్లీనగరం తెలంగాణా సాయుధపోరాట యోధులకు నిలయం. సాయుధ పోరాటం జరిగే క్రమంలో పోలీసు ఆయుధాలను గుంజుకొనే క్రమంలో మొదటి దాడి పరిటాలలో జరగగా రెండో దాడి నీరుకొండ హనుమంతరావు ఊరు అల్లీనగరంలో జరిగింది. అక్కడే సాయుధ పోరాట సహచరులు అభ్యుదయ కవి వట్టికొండ రంగయ్య మొదలు ఎందరో గెరిల్లా యోధులు వట్టికొండ నాగేశ్వరరావు, రామకోటయ్య, కాంతయ్య, నీరుకొండ అప్పారావు, వాసిరెడ్డి సత్యనారాయణ లాంటి వాళ్ళ సహచర్యంలో ప్రోదిచేసుకున్న బాల్యం ఆయనది. అల్లీనగరం దాడి జరిగన చారిత్రక ప్రాంతం మొదలయిన ఆయన బాల్యం అటు జయంతిపురం రాజా దివాణం మలి దశ సుమారు ఏడు దశాబ్దాలు ఆయన జీవితం ఖమ్మంలో అంత్యంత నిరాడంబరంగా సాగింది. ఖమ్మంలో నేటి సిద్దారెడ్డి కళాశాల పూర్వ రూపం అయిన జ్యోతి ట్యుటోరియల్ లో లాభాపేక్షలేని అధ్యాపకత్వం, ఆ నాడు ఆంధ్రా మెట్రిక్ కోసం ఆ ట్యుటోరియల్ ఒక్కటే ఉండేది అనేవాడు. జ్యోతి పుస్తకాల షాప్, ఖమ్మం బస్టాండ్ లో జీవిక కోసం నడిపిన చిన్న హోటల్ లో నాడు అజ్ఞాత కార్యకర్తలు కష్టకాలంలో వస్తే హోటల్ వెనక ఉన్న ఊక బస్తాల్లో దాపరికాలు, రంగురాళ్ళ అమ్మకాలు, అజ్ఞాతంగా ఎన్నో అనువాదాలు, ఎం ఎస్ రెడ్డి (మల్లెమాల) తో కలిసి సినిమా కథలు ఒకటా రెండా, ఇలా ఎన్ని పనులు చేసినా ఒక తృప్తికోసం తప్ప ఏనాడూ సొంత ఇల్లు, సొంత ఆస్తిలే కుండా ఒక అద్దె ఇంట్లో పదిలీటర్ల పాలు కొని కాచి కాస్త పాలూ మజ్జిగా నమ్ముకోవడం కోవడం తప్ప విశ్వాశాన్ని ఏనాడూ అమ్ముకోలేదు. నమ్మిన విశ్వాసాలు చీలికలు పేలికలు అయితే ఎంత క్షోభను చెప్పేవాడో, ఏదయినా ఈ వ్యవస్థ మార్పుకు శస్త్ర చిక్సిత వినా మరే మార్గం లేదు అని సాయుధపోరాటం అవసరం అనేవాడు నాతో. ఇటీవల ఖమ్మం కవి దిలావర్ ఆయన కొత్త పుస్తకం ‘దూరాల చేరువలో’కి విప్లవ కవి వరవరరావు ముందుమాట రాసాడు. అందులో నాటి విరసం సభల్లో కవి కౌముది తనను కలిసాడు అనీ ఆయనే ఝంఝ కవితా సంచికలో “పాణిగ్రాహి బొబ్బిలి సుబ్బరాయ వీరాగ్రణి” రాసానని ఆయన చెప్పాడు అని ముందుమాట రాసాడు. పుస్తకం అచ్చులో రావడానికి ముందు రాయించుకున్న వాళ్ళు ఒక సారి సరి చూసుకుంటే బాగుండేది కానీ ఆ తప్పుతోనే పుస్తకం బయటికి వచ్చింది. ముందుమాట చదివిన నీరుకొండ ఒక రోజు చానా బాధపడ్డాడు. నేను మీరే ఏదయినా రాయండి అని అన్నా, దానికి ఆయన నేను పేరు కోసం ఏం రాయలేదు, ఒక లక్ష్యం కోసం ఏది రాయాలో అది రాసా, కానీ నేను బ్రతికి ఉండగానే విషయాలు తడబడుతున్నాయి. వీలయితే నిజం రాసిన వరవరరావుకు నా మాటగా చెప్పు అన్నాడు. చరిత్ర శకలాలు అలా మరుగున పడిపోకూడదు అంటూ ఆయన వాస్తవం తెలుసుకుంటే చాలు అన్నాడు. అంతటి నిరాడంబరత ఆయనది.
నీరుకొండ జీవితం చెప్పాలి అంటే ఆయన మొదట్లో హీరారాల్ మోరియా ఇంట్లో అద్దెకు ఉండేవాడు. వందలాది కవుల సహచర్యం, నిత్య అధ్యయనం. బహుశా తాను నడవగలిగిన అంతకాలం అటు ప్రజాశక్తి పుస్తకాల షాప్ లోకానీ, రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో కానీ బోడేపుడి భవన్ లో అన్ని పేపర్లతో బాటు చేతికి ఏది దొరికినా క్షుణ్ణంగా చదివేవాడు . నేను శివసాగర్ సమగ్ర కవితా సంకలనం వేసే క్రమంలో పుస్తకం మొత్తం సరిచేసాడు. నేనే కాదు ఖమ్మంలో ఏ కవి అయినా తాను వేయబోయే పుస్తకాన్ని ముందుగా ఒక సారి ఆయనకు చూపించడం ఆనవాయితీ.
ఖమ్మం నర్శింహా స్వామీ టెంపుల్ రోడ్ సమీపంలో ఆ పాత చెర్వుకట్ట పక్కన చిన్న అద్దె ఇంట్లో ఉండగా ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తుంటే చూస్తూ చూస్తూ అవి మేడలు మిద్దెలు అయి మిలియన్ల రూపాయలు ఎలా అయ్యాయో చెప్పేవాడు. ఖమ్మం నగరం మొత్తం తన అరచేతిలో ఉన్న పహానీ లా ఏ భూమి ఎవరిచేతి లోకి ఎంతకి అక్రమంగా సక్రమంగా మారిందో, కబ్జాలకు గురి అయిందో, దశాబ్దాల కాలం లోనే ఖమ్మం నేల వలసలకు సాంస్కృతిక దోపిడీకి నిలయంగా మారిందో చెప్పేవాడు. పార్టీ నిర్మాణంలో ఉంటూ కూడా వందల కోట్లు సంపాదిస్తూ ఎలా నాయకులుగా చెలామణి అవుతున్నారో చెప్పేవాడు. అధికారం కోసం అంగలారుస్తూ వామపక్షాల అవకాశవాద దివాలకోరుతనాన్నీ చూసి బాధపడేవాడు. ఆయన ఒక సాదా మనిషి తెల్లకాగితంలా ఏ మలినం అంటకుండా ఉండేవాడు. తెలిసిన వాళ్ళు ఏదయినా క్రయ విక్రయాలు జరిగితే కాస్త రాయండి అని ఆయనతో సాదా బైనామాలు రాయించుకొనేవారు. ఖమ్మం వీధుల్లో నడుస్తూ ఖమ్మానికి ఒక పెద్దమనిషి లా ఉండేవాడు.
నీరుకొండ సహచరి కమలమ్మ ఉన్నవ లక్ష్మినారాయణ స్థాపించిన శారదానికేతనంలో చాద్వుకున్న జ్ఞాపకాలు ఇంటికి వెళితే ఆమె తన గురవు ఉన్నవ గారి విషయాలు ఎన్నో చెప్పేది. నీరుకొండకు ఒక కొడుకు, కూతురు. ఈ మధ్యనే కూతురి మరణం ఆయన్ని కోలుకోకుండా చేసింది. ఏడాది కింద కలిసి నప్పుడు ఒక సారి తాను పుట్టిన పెరిగిన ఊరు జయంతి ఒకసారి చూసివద్దాం అన్నాడు. నా పరిశోధన పనుల్లో ఆపని చేయలేక పోయా.ఆయన కళ్లముందే జ్యోతి ట్యుటోరియల్ డిగ్రీ పిజి కళాశాలగా మారి మూతపడ్డది. అందులో అటెండర్ గా పనిచేసే ఆయన కొడుడు తన మకాంను వైరాకు మార్చాడు అని తెలిసింది. కంటి చూపు మందగించినా ఆరు నెలల కింద తాను పుట్టి పెరిగిన ఊరు చూసివద్దాం అని వెళ్లి ఆ గోడలు తడిమి బాల్యపు జ్ఞాపకాల బరువుతో వచ్చాడు అని వాళ్ళ అబ్బాయి చెప్పాడు.అంతకు మించి ఆయన గిరించి ఏ వార్తా ఆయన బాగోగులూ ఎవరికీ పట్టలేదు అంతే. ఆయన ఏం రాసాడో సాక్షాలూ దస్తావేజులూ లేవు కేవలం ఏభై అరవై ఏళ్ళుగా రాసుకున్న విలువయిన డైరీలు హైదరాబాద్లో ఏదయినా గ్రంథాలయానికి ఇవ్వమని చెప్పాడు. అవి ఎక్కడో ఉన్నాయి వెతికి కొన్ని కవితలు అయినా వేస్తే ఈ కాలానికి అయన ఎవరో తెలుస్తాది. ఆయన జీవితం ఎన్ని పేజీల్లో నింపగలం నింపే వయసు పరిణతీ నాలో లేదు. నిజంగా ఆయన జ్ఞాపకాలు రాసిఉంటే వర్తమాన సాహిత్య సాంస్కృతిక పోరాటాలకు విలువయిన పుస్తకం అయ్యేది. నేను ఎన్నో సార్లు ఏదయినా రాయండి అనేవాణ్ణి చెప్పుకునే అంత గొప్ప చరిత్ర ఏమీలేదు అనేవాడు.
ఖమ్మం భిన్న రాజకీయాల సమాహారంగా ఉండేది. ప్రజాశక్తి పుస్తకాల షాప్ లో ప్రతి సాయంత్రం ఎందరో కవులు అక్కడ చేరేవారు. అమరుడు హరీష్, పొట్లూరి వేంకటేశ్వర రావు, లాయర్ బోడేపూడి, ఆనందా చారి, కపిల రాంకుమార్, ప్రతాపనేని రామకోటేశ్వరరావు, శివకోటి, వసంతరావు అపుడప్పుడూ తమ్మినేని గారు, గోపీనాథ్ సర్ సాహితీ స్రవంతి మిత్రులూ మిగతా విప్లవ సానుభూతి పరులూ అక్కడ చేరేవారు. కాసింత కాఫీ, పాను వక్కలూ, సాహిత్యం సమకాలీన పోరాటాలూ అదో కంగ్లామరేషన్. ఎవరయినా ఎక్కడయినా తడబడితే నీరుకొండ ఆ లోటును పూడ్చేవాడు. ఇప్పుడు హరీష్ లేడు, నీరుకొండ లేడు పొట్లూరి మంచాన ఉన్నాడు. రాను రాను ఖమ్మం సాహిత్య వాసనకు దూరం అవుతోంది. ఈ మధ్య అమరుడు దాశరథిని కలిస్తే మాటల మధ్యలో హరీష్ లేని ఖమ్మంని ఊహించ లేకపోతున్నా అన్నాడు. ఇలా తరాలు తరాలు అంతర్ధానం అవుతున్నాయి వాళ్ళ జ్ఞాపకాలు సజీవంగా మాలాంటి వాళ్ళతో బ్రతికే ఉన్నాయి. పాత కొత్తా తరానికి వారదిలాగా నిలిచిన కొన్ని జ్ఞాపకాల గొలుసులను సజీవంగా రాయాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో నీరుకొండ అంత నిజాయితీగా నిక్కచ్చిగా బ్రతికిన మనిషిని చూడలేదు. ఆయన సహచర్యం నాలో చదవాలి అనే జిజ్ఞాషను కలిగించింది .అవును బాపూ..నీలా. నిండు హృదయంతో, మండే గుండెల కన్నీళ్ళ/ వేదనల గళమున మేళవించి కార్మిక కర్షక/హృదయాలు పొంగ ప్రళయంలా ప్రభంజనంలా/భూన భూలు మారుమ్రోగ నినదించిన వాడేడి వినిపించిన వాడేడి ?