నీలి
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపు లోని 26వ కులం. నూలు వడికి, దారం తీసి మగ్గాలపై బట్టలు నేసేవారు నీలి కులస్థులు. ఆధునిక యంత్రాల రంగప్రవేశంతో చేనేత మగ్గాలతో కుస్తీలు పడుతూనే బీడీలు చుట్టేందుకు మొగ్గు చూపారు. తగరేసల అనే చెట్టు గింజలను (ఇవి చూడ్డానికి పెసలు మాదిరే ఉంటాయి) ఉడకబెట్టి రసం తీస్తారు. ఈ రసం నీలం రంగులో ఉంటుంది. దీన్ని నూలు దారాలకు వీరు అద్దుతారు కనుక ఈ వృత్తి చేసేవారిని నీలివాళ్లుగా పిలిచేవారు. ఈ రసానికి బెంగాల్ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగోను కలిపి మీటరు లోతున్న కాగుల్లో మగ్గబెడతారు. ఈ ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మేక, గొర్రె పెంటికలను (పేడ) సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెడతారు. ఒకే చోట పోగుపడిన ఆ పెంటికల నుంచి వెలువడే వెచ్చటి ఆవిరిలో రెండు రోజులపాటు లోపలి ద్రవం మగ్గుతుంది. ఫలితంగా నల్లటి రసం తయారవుతుంది. ఈ విధంగా నల్లరంగు తయారు చేస్తారు. రంగులు పర్మినెంట్‌గా ఉండాలని సున్నపు రాయిని తీసుకొచ్చి బట్టీ పెట్టి సున్నం తయారు చేసేవారు. చౌడు భూముల నుంచి సేకరించిన మట్టితో ఈ సున్నం కలిపి మిశ్రమాన్ని పెద్ద కుండలో వేసి బాగా అదిమి ఉంచుతారు. దానిపై నీళ్లు పోస్తే ఒక్కొక్క బొట్టు ఫిల్టర్ అవుతుంది. ఇది చాలా గాఢంగా అంటే చిక్కగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ద్రవాన్ని నీలి, నలుపు రంగుల్లో కలిపి కడవలలో నిల్వ ఉంచిన రంగులు నూలుకు పట్టించేవారు. వాడకంలో బట్ట చినిగిపోయినా వీరు వేసిన రంగు మాత్రం వెలిసిపోదు. ఇతర రంగులు కావాలంటే ఆయా పాళ్ల వంతున కెమికెల్ వేసి తయారు చేసేవారు. అప్పట్లో నూలును తెచ్చి వీరి దగ్గర ఈ రంగులు అద్దకం చేయించుకునేవారు. విదేశీ రంగులు రావటం, మిల్లు యంత్రాలు ఊపందుకోవటంతో ఈ వృత్తి దెబ్బతింది.వీరి కులవృత్తి దెబ్బతినటంతో దీనికి అనుబంధంగా ఉన్న చేనేతవైపు వీరు దృష్టి సారించారు. కనుకనే ఇప్పటికీ ఆ వృత్తిలోనే చాలామంది జీవనం గడుపుతున్నారు. మీటరు బట్ట నేస్తే 12 రూపాయల చొప్పున మజూరీ (కూలీ) ఇస్తారు. ఈ విధంగా వీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమిస్తే పది మీటర్లు నేయటం గగనం. బాగా అనుభవం ఉన్న వారు మాత్రం మరో రెండు మీటర్లు నేయగలరు. అంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించినా రోజు మొత్తం మీద 150 రూపాయలకు మించి సంపాదించలేరు. చీరలు నేస్తే మజూరీ దీనికన్నా ఎక్కువగా వస్తుంది. అయితే ఈ చీరలెవరు కడతారని తమతో నేయిస్తారని నీలి కులంలోని మహిళలు చెపుతున్నారు. సున్నితమైన పనికి అలవాటు పడిన వీరు కాయకష్టం చేయలేక ఇంటిపట్టున ఉండి బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. బీడీ పరిశ్రమలో యాజమాన్యం వెయ్యి బీడీలకు సరిపోను తునికాకు సప్లయ్ చేయదు. తరుగుబడిన ఆకును వీరే కొనుగోలు చేసి వేయి బీడీలకు లెక్క చూపాలి. దెబ్బతిన్న ఆకు అందజేసి మంచి బీడీలు తయారుచేసి ఇవ్వా లని యాజమాన్యం డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో తరుగు భర్తీ చేయటానికి 60 నుంచి 120 రూపాయలు ఖర్చు చేయా ల్సి వస్తోంది. మన రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నీలి కులస్తులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. కర్నాటక రాష్ర్టంలో గుల్‌బర్గా, చిందోళి, ముధోల్, బీదర్ ప్రాంతాలలో వీరు విస్తరించారు. అక్కడ వీరు నీల్‌గార్ గా పిలువడుతూ బిసి రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్నారు. మహారాష్ర్టలో నీలినిరాళి గా గుర్తింపు పొందారు కానీ వీరికి రిజర్వేషన్ లేదు. వీరంతా ఇక్కడి నుండి వలసవెళ్లినవారే.నీలి కులస్తులను 1968లో బిసి-డి జాబితాలో చేర్చటంతోపాటుగా `నెల్లి ' అని పేర్కొనటంతో నీలి కులస్తులమైన తమకు అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని ఈ పొరపాటు వల్ల అనేకమంది విద్యార్థులు రిజర్వేషన్ సౌకర్యం వినియోగించుకోలేక నష్టపోవాల్సి వచ్చిందని అనేక విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వానికి ఇచ్చుకోగా తమని 2007 ఆగస్టులో బిసి-బి జాబి తాలోకి మార్చటం జరిగిందని నీలి కులసంఘానికి ప్రభు త్వం రాజేంద్రనగర్‌లో స్థలం కేటా యించి రేటు కూడా నిర్ణయించింది. కానీ స్థలం ఉచితంగా ఇవ్వాలని సొసైటీలు ప్రారంభించి పని కల్పించాలని కులనాయకులు కోరుతున్నారు.