నీలికళ్లు

తెలుగు అనువాద రచన


ఫ్రెంచి రచయిత బాల్జాక్ (w:Honoré de Balzac 1799–1850) లఘునవల లేదా నవలిక తెలుగు అనువాదం నీలికళ్లు బెల్లంకొండ రామదాసు దీన్ని అనువదించారు.[1]

నీలికళ్లు
కృతికర్త: బెల్జెక్
అనువాదకులు: బెల్లంకొండ రామదాసు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): అనువాదం
ప్రచురణ: భవానీ పబ్లిషింగ్ హౌస్, వుయ్యూరు
విడుదల: 1985

కవి పరిచయం

మార్చు
 
Honoré de Balzac (1799-1850)

బాల్జాక్ 19వ శతాబ్దంలో జీవించిన మహారచయితలలో ఒకరు. దాదాపు 100 రచనలు చేశారు. కథలు, నాటకాలు, నవలికలు, వ్యాసాలు రచించారు. ఫ్రెంచి సమాజ జీవితాన్ని సమగ్రంగా చిత్రించాలని వారు ఆశయంగా పెట్టుకున్నారు! నవలలు, కథానికలు పుంఖానుపుంఖంగా రాశారు. నిత్యం పన్నెండు గంటలపైగా రచనావ్యాసంగం లో ముణిగి పోయి, ఆరోగ్యం కోల్పోయి ఏభై ఏళ్ళకే మరణించారు. ఆర్ధికసమస్యలు, చేపట్టిన ఏ వ్యాపారం లాభసాటిగా నడవకపోవడం, ఒక స్త్రీని ఇరవై ఏళ్ళు ప్రేమించి పరిణయమాడిన అయిదు నెలలలోపే తాను చనిపోవడం ఆయన జీవితంలో దురదృష్టం. బాల్జాక్ యూరోపియన్ సాహిత్యంలో వాస్తవిక వాదాన్ని ప్రవేశపెట్టారు. పేరిస్ నగరం అన్ని పార్శ్వాలను కాచి వడపోశారు.

కథాంశం

మార్చు

నీలికళ్ళు నవల ఆరంభం పేరిస్ నగర జీవితం ఆయావర్గాల బ్రతుకులు, సంపన్న"కులీనుల" విలాస శృంగారజీవితం, వేశ్యావాడలు, ధనగర్వంతో అసహజ శృగారజీవితానికి వాడుక పడడం, ఈ మొత్తం వ్యవస్థలో బానిసలవలె బ్రతికే స్త్రీలు అన్నీ కళ్ళకు కట్టించారు ఈనవలలో. ఈనవలలో హెన్రీ అనే సంపన్న యువకుడి చుట్టూతా కథ అల్లబడింది. అతనితల్లి లోకాతీతమైన సుందరి. విశృంఖల జీవితం గడుపుతుంది. ఒక భర్త తర్వాత మరొకరు భర్తలు. లార్డ్ డడ్లీతో ఆమెకు వివాహేతర బంధంలో కలిగిన హెన్రీకి ఒక తండ్రిని ఏర్పరుస్తారు. తండ్రి గా వ్యవహరించేందుకు ధనాశతో ఒకవ్యక్తి ఆమెను వివాహం చేసుకొంటాడు.. హెన్రీ అదృష్టవశాత్తు ఒక క్రైస్తవ మతగురువు పెంపకంలో పెరిగి విద్యాబుద్ధులు నేరుస్తాడు. పాతికేళ్ళు రాకముందే స్వతంత్ర జీవనం, జనకతండ్రి డడ్లి ద్వారా లభిచిన సంపద, అపూర్వమైన దేహసౌందర్యంతో పేరిస్ కులీన సమాజంలో ఒక బంభరం, యవ్వనవతుల కలల కథానాయకుడవుతాడు. లార్డు డడ్లి విశృంఖల శృంగారజీవితం ఫలంగా అనేక దేశాల్లో అతని సంతానం అనామకంగా పెరుగుతారు. డడ్లి మరొక సంతానం మార్గరెటా. ఆమె ఒక వృద్ధుణ్ణి, స్పానిష్ కోటీశ్వరుణ్ణి వివాహంచేసుకొని పేరిస్.లో జమీందారిణి వలే విశృంఖల జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె ఒక ముల్లెటొ (అనగా దక్షిణ అమెరికా లో నల్లజాతి స్త్రీకి శ్వేతజాతీయునికీ జన్మించిన) సుందరి పకితను బానిసగా తనవద్ద ఉంచుకొఃటుంది. రెండేళ్ళలో హెన్రీకి అందని అందగత్తెలు ఆనగరంలో ఉండరు. అటువంటి సమయంలో దేవలోకంనుంచి వచ్చిన సుందరి వంటి చిన్నది పకిత అతని కంటపడుతుంది. ఆమె పొందుకోసం ప్రయత్నించి ఆమె ప్రేమను పొందుతాడు. ఆమె హెన్రీతో ఏకాంతంలో సుఖిస్తున్న సమయంలో ఆశ్చర్యకరంగా - తన యజమానురాలిపేరు-మార్గరెటా పేరు పలుకుతుంది. తనను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకొన్నదని అతను భావిస్తాడు. అతని అహం దెబ్బతింటుంది. పకితను చంపాలని మరురోజు హెన్రి ఆమెగదిలోకి ప్రవేశించేసమయానికే ఆమె నెత్తురు మడుగులో పడివుంటుంది. మార్గరెటా రక్తసిక్తమైన కత్తిపట్పుకొని అతనిపైకి దూకుతుంది. హెన్రీ ఆమె చేయిపట్టుకొని ఆపుతాడు. ఇద్దరూ ఒకరిముఖంలోకి ఒకరు చూసుకొని "మీతండ్రి లార్డ్ డడ్లినా",అని ఆశ్చర్యపోతూ ఒకేసారి అంటారు. పకిత అతనిలో మార్గరెటా పోలికలు చూసి ఆశ్చర్యం గా అన్నమాటని తెలిసినా ఇపుడేంచేయగలడు? అసూయా గ్రస్తమైన మార్గరెటా పకితను అన్యాయంగా చంపుతుంది.

కులీనుల అసహజ శృంగారజీవితం, అమానవీయ ప్రవర్తన చాలా ఆసక్తికరంగా చిత్రించారు బాల్జాక్ ఈనవలలో. పాఠకులు నవలలో ప్రతివాక్యాన్నీ శ్రద్ధగా చదవాలి. ముందు జరగబోయే విషయాలను యధాలాపంగా నిక్షిప్తం చేస్తూపోతారు రచయిత., చిన్న వివరం గమనించక పోయినా కథ అర్థంకాదు. కధనశిల్పం పత్తేదారు నవలల్లోలా అనిపిస్తుంది. ఊహించని ముగింపు. ఆసక్తి పట్టలేక చివరి పేజీలు చదివినా బోధపడదు. మార్క్సు, ఏంజెల్స్ బాల్జాక్ రచనలను ప్రముఖంగా పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానం యూరపులో విస్తరిస్తున్న దశ వీరిరచనల్లో చక్కగా చిత్రించబడిందని, శ్రామికుల జీవితాన్ని రచనల్లో చూపారని వారు పేర్కొన్నారు. బాల్జాక్ ప్రకృతిని, పేరిస్ వీధులను, నగరజీవితాన్ని చాలా వివరంగా వర్ణించారు. అనువాదంలో మూలంలోని కవితాధోరణి యధాతధంగా నింపారు బెల్లంకొండ. ఒకవాక్యం కూడా కవితా స్పర్శ లేకుండా కనిపించదు. బాల్జాక్ రచనా రాక్షసుడు. ఎన్ని వేలపేజీలు రాశాడు, ఎన్ని మానవ మనస్తత్వాలను చిత్రించాడు, ఎంత జీవిత వైవిధ్యాన్ని మనముందు ఆవిష్కరించాడని మ్రాన్పడిపోతాము.

మూలాలు

మార్చు
  1. బెల్లంకొండ రామదాసు (1958). నీలికళ్లు. వుయ్యూరు: భవానీ పబ్లిషింగ్ హౌస్. Retrieved 15 September 2020.