మానవుని నిత్య జీవన విధానములో చోటు చేసుకునే కర్మలకు సంబంధించి శుభాశుభ ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పే గ్రంథానికి పంచాంగము అని పేరు.పంచాంగంలేదా పంచాగము అనగా పంచ అంగములు అని అర్థము. ఆ అంగములు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము లు. ఇవి పంచాంగములో ఉన్న ప్రధాన మైన అంగములు. ఈ ఐదు అంగాలే గాక లగ్నము, ముహూర్తము, మొదలగు అనేక ఉప అంగాల వివరణ కూడా ఇందులో ఉంటాయి. వ్యక్తికి, దేశానికి సంబంధించి ఆయా అంగాల ననుసరించి విశద పర్చేదే పంచాంగము. ఉగాది రోజున ఆ ఏడాదికి సంబంధించి అనేక శుభాశుభ ఫలితాలను పండితులు చెప్పగా వింటుంటారు. దానినే పంచాంగ శ్రవణం అని అంటారు. పంచాంగం ప్రజలలో ఎంతగా చొచ్చుక పోయినదంటే....... పంచాంగ శీర్షిక లేని దిన, వార, మాస పత్రికలేవి లేవు. అదేవిధంగా ప్రసార మాధ్యమాలలో పంచాంగానికి సమయం కేటాయించని టి.వి. చానళ్ళు కూడా ఏవి లేవు. పంచాంగం గురించి క్లుప్తంగా తెలుసుకోవడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశము.

పంచాంగ ప్రయోజనము మార్చు

ప్రతి మానవుడు తన దైనందిన కార్యక్రమాలలో భాగంగా వైధిక కర్మలతో పాటు ఎన్నో పనులు ప్రారంభిస్తుంటాడు. తాను ప్రారంభించిన కార్యము ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని అందరూ కోరుకుంటారు.కనుక ఆకార్యక్రమాన్ని సరైన, మంచి ముహూర్తంలో ప్రారంభించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.ఆ ముహూర్తము నిర్ణయించ డానికి, వారి నామ, జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక సమయం అనగా ఒక ముహూర్తము నిర్ణయించవలసి వుంటుంది.ఆ ముహూర్త నిర్ణయానికి పంచాంగము అవసరము. శుభాశుభ కర్మలను బట్టి కొన్ని తిధి, వార నక్షత్రాలు కొన్ని పనులకు విర్దేశింపబడ్డాయి.కొన్నిటికి నిషేధింపబడ్డాయి.అలా తెలుసుకోవడానికి పంచాంగము అవసరము.కొన్ని తిథి, వార, నక్షత్రాల సంయోగము వల్ల కొన్ని గొప్ప ముహూర్తములు ఏర్పడుతుంటాయి.కొన్ని కార్యక్రమాలు ఆయా ముహూర్తములలో చేయడం వలన గొప్ప ప్రయోజనం కలుగుతుంది.అటువంటి ముహూర్తములు ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకోవాలంటే పంచాంగమే మూలం. యజ్ఞ, యాగాదులందు, జప పూజలందు, హోమాదులందు కాల సంకీర్తన చేయడం హిందూవుల సంప్రదాయం.ఈ కాల సంకీర్తన చేయాలంటే తప్పని సరిగా పంచాంగము కావలసినదే.కాల సంకీర్తన అనగా..... చాల సందర్భాలలో పురోహితుల చేత ఇది చెప్పబడుతుంటుంది. అందరూ గమనించే ఉంటారు. కలియుగే పూర్వార్థే, దక్షిణాయనే, మాఘ మాసే, ఫలానా దినం, భరత ఖండం... ఫలానా నక్షత్రం... ఇలా చెపుతుంటారు. దీనిని ఏరోజుకారోజు విడమరచి చెప్పాలి. దానికి కూడా పంచాంగము అవసరము.

పంచ అంగములు ఏవి? మార్చు

మానవుని దైనందిన జీవిత క్రమంలో తారసపడే కాలానుగుణ విధులు పంచ అంగములు: అవి: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు.

పంచాంగములో ఏముంది ? మార్చు

చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుగా పాల్ల్గుణ బహుళ అమావాస్య వరకు ప్రతి దినము తిథి మొదలగునవి ఎన్నిగంటలకు, సూర్యోదయము, సూర్యాస్థమయము రాహు కాలం, యమ గండం, గుళికకాలం, సుముహూర్తము, దుర్ముహూర్తం, మొదలగునవి ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు మొదలగు విషయాలుంటాయి. సూర్యోదయం, సూర్యాస్థమయం అన్ని ప్రాంతాలో ఒకే తీరున ఉండదు. ఆయా ప్రాంతాలలో సూర్యోదయం, అస్తమయం ఎన్ని ఘడియలకు ఉంటుంది అది వ్రాస్తారు. ఆయాకాలాల ఘడియల పట్టికలు అందరికీ అందుబాటులో ఉండేటట్లు శాలివాహన శకం, హూణ శకం, మొదలగు శక నామలతో పాటు తెలుగు మాసము నకు సరియగు ఇంగ్లీషు నెలలను, గంటల, నిముషాలను కూడా వ్రాసి ఉంటారు. అదే విధంగా ఏ నక్షత్రం ఏ పాదంలో ఏ గ్రహం ప్రవేశించిందో ఉంటుంది. పర్వదినాలు, పండగలు ఏ ఘడియలో ప్రారంభ మవుతాయో వంటి విషయాలు కూడా వ్రాస్తారు.

సూర్య, చంద్ర గ్రహణాలుఎప్పుడు, ఎన్ని గంటలకు సంభవిస్తాయి,, ఎప్పుడు విడుస్తాయి... ప్రాంతాల వారిగా వివరాలుంటాయి. నెలల వారిగా, రాశి చక్రము, మొదలగు వివరాలుంటాయి. వీటి వలన రాశి చక్రము వేసే జ్యోతిష్కులకు అధిక శ్రమ తప్పుతుంది. ఆయా నెలల వారీగా వర్షయోగం, సరకుల ధరలు అన్ని రాసుల వారి గోచార ఫలము, నెల ఫలము, సంవత్సర ఫలము మొదలగునవి ఉంటాయి. చదువరులకు సులభ గ్రాహ్యంగా ఉండడానికి నెలల వారిగా సుమూహార్తముల పట్టికలుంటాయి. వివాహ విషయాలకు సంబంధించి వధూవరుల నక్షత్ర ఫలాలెలా ఉన్నాయనే విషయాలు విపులంగా వ్రాసి ఉంటాయి. అదే విధంగా జనన, మరణ కాలాదులలో ఆయా సమయాన ఉన్న నక్షత్ర, రాసి మొదలగు ఫలితాలను కూడా వ్రాసి ఉంటారు.

శరీరం పై బల్లి పడటం వల్ల కలిగే శుభాశుభముల పట్టిక, వార శూల తెలుసుకునే విధానము వివరించ బడి ఉంటుంది. పేరును బట్టి నక్షత్రం తెలుసుకునే విధానము, గ్రహాల మిత్రత్వం, శత్రుత్వం మొదలగు విషయాలుంటాయి. ఈ విధంగా పంచాంగంలో అనేక విషయాలు విపులంగా వ్రాసి వుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=పంచాగము&oldid=3621214" నుండి వెలికితీశారు