పడాల చంద్రయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెలంగాణ నుంచి పాల్గొన్న కొద్ది మందిలో ఈయన ఒకరు.[1]

పడాల చంద్రయ్య

జీవిత విశేషాలు మార్చు

అతను కరీంనగర్ జిల్లా  భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన వాడు. 14 ఏళ్ల వయస్సులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. చిన్న వయస్సులోనే జైలుకు వెళ్లాడు. ఆరు నెలలు జైలులో ఉండి వచ్చిన తర్వాత కూడా పోరుబాట వీడలేదు. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఆదిలాబాద్ జిల్లా  నాగపూర్ లోని చాందా క్యాంపులో చేరి  సాయుధ శిక్షణ తీసుకున్నాడు.  దళ కమాండర్ గా పనిచేసిన చంద్రయ్య అప్పట్లో మహారాష్ట్రలోని వీరూర్  పోలీస్ స్టేషన్, రైల్వేస్టేషన్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు నిజాం పోలీసులు చనిపోగా, చంద్రయ్య కాలులోకి బుల్లెట్ దిగింది. హన్మకొండలో ఎనిమిదోతరగతి చదువుతుండగా క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితుడై హన్మకొండ చౌరస్తాలో సత్యాగ్రహం చేశాడు.అతను సోషలిస్టు పార్టీలో చేరి వ్యవసాయ కూలీలు, పాలేర్ల సంఘాలను ఏర్పాటు చేశాడు. రాత్రి బడులను నిర్వహించాడు. గ్రామ కమిటీలు వేసి పట్వారీలు, జమీందార్ల అరాచకాలను  ఎదిరించాడు. తిండిగింజల ఉద్యమాన్ని నడిపించాడు. ప్రభుత్వ గోదాములను లూఠీ చేసి పంటను నిరుపేదలకు పంపిణీ చేశాడు. దీంతో నిజాం ప్రభుత్వం చంద్రయ్యను అరెస్టు చేసి రెండు నెలలపాటు చంచల్ గూడ జైల్లో పెట్టింది. నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కావడంతో మళ్లీ చదువుపై దృష్టిపెట్టాడు. ఉద్యమాలతో మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. 1952లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత దామెరలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అయితే కేసుల వల్ల ఈ ఉద్యోగాలు దక్కలేదు. చివరకు వరంగల్ లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో గుమస్తాగా చేరాడు. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు స్థాపనకు ప్రయత్నించాడు.  బ్యాంకు కార్యదర్శిగా పనిచేశాడు. ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం, మల్టీ ఇండస్ట్రియల్ కన్జూమర్ కో ఆపరేటివ్ సొసైటీ, ఆల్ ఇండియా వూల్ వీవర్స్ కో ఆపరేటివ్ ఫెడరేషన్  స్థాపనలో కీలకపాత్ర పోషించాడు. స్వాతంత్ర్య సమరయోధుని కోటాలో అతనికి మంథని నియోజకవర్గంలో ప్రభుత్వం రెండు ఎకరాల భూమి ఇస్తే ఆ స్థలాన్ని నిరుపేదలకు పంచాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు.[2]

బతుకంతా దేశం కోసం పనిచేసిన చంద్రయ్య చనిపోయిన తర్వాత తన దేహం జనానికి ఉపయోగపడాలని భావించి తన భార్య వెంకటలక్ష్మిని కూడా అవయవదానానికి  ఒప్పించాడు. చనిపోయిన తర్వాత తమ పార్థివ దేహాలను వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలకి అప్పగించాలని లేఖరాశాడు. 2009లో  చంద్రయ్య భార్య  చనిపోగా ఆమె మృతదేహాన్ని కేఎంసీకి అప్పగించాడు. అతను 2018 జూలై 25న మరణించాడు.[1][permanent dead link]

పురస్కారాలు మార్చు

క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చాలామంది స్వాతంత్ర్యసమరయోధులతో పాటు అతనిని సన్మానించాలని నిశ్చయించింది.

మూలాలు మార్చు

  1. "Freedom fighter Padala Chandraiah dead". The Hindu. 2018-07-26. ISSN 0971-751X. Retrieved 2018-08-19.
  2. "పడాల చంద్రయ్య.. స్వాతంత్ర్య సమరయోధుడు".[permanent dead link]

బయటి లంకెలు మార్చు