పాటిబండ్ల రజని స్త్రీవాద రచయిత్రి, రచయిత్రి.[1] [2]శక్తివంతమైన భాషాసంపద, నేరుగా హృదయాన్ని తాకే లోతైన భావసంపద రజని కవిత్వం ప్రత్యేకత. .‘‘గ్రామీణ మహిళల జీవితమే నా కవిత్వ చిరునామా’’ అని ఆమె అంటుంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యురాలుగా పనిచేసింది.

జీవిత విశేషాలు

మార్చు

ఆమె స్వస్థలం కృష్ణాజిల్లా తిరువూరు గ్రామం. ఇంటర్మీడియట్‌ తర్వాత, కరీంనగర్‌లో టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకుని సొంత ఊళ్ళోనే 1983లో ఉపాధ్యాయినిగా విద్యారంగంలో ప్రవేశించాక, రచనావ్యాసంగం ప్రారంభించింది. ప్రైవేటుగా ఉన్నత చదువులు చదివింది. ఆమె తండ్రి పాటిబండ్ల సీతాపతిరావు ఆర్టీసీ ఉద్యోగి. కార్మికసంఘ నాయకుడు. తల్లి ఝాన్సీలక్ష్మి. బాల్యం నుంచీ తల్లి ప్రభావమే ఆమెపై ఉండేది. ఆడపిల్లలపట్ల ఆంక్షలు, వివక్ష బలంగా ఉండే రోజుల్లో హైపర్‌ యాక్టివ్‌ ఛైల్డ్‌గా ఆటపాటల్లో గడిపేది. ‘ఫలానా పత్రికలో సీరియల్‌ చదువు ఆడపిల్ల ఎలా అణగిమణగి ఉండాలో తెలుస్తుంది’ అని తల్లి ఇచ్చిన సలహాతో ఆ సీరియల్ చదివేది. అలా ఆమెకు పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. పాఠశాలలో తెలుగు మాస్టారు ఎంతో శ్రావ్యంగా తెలుగు పద్యాలు నేర్పడం, తల్లి చెప్పే కథలు, సామెతలు భాషమీద ఆమెకు మమకారాన్ని పెంచాయి. చుట్టుపక్కలున్న ఆడవాళ్ళ కష్టాలు, బాధలు, సమస్యలు ఆమెను కదలించేవి. రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ నవల చదివాక ఆమె దృక్పథంలో మార్పు రావడంతో సాహిత్యాన్నీ, వాస్తవికతను పోల్చిచూస్తూ సత్యాన్వేషణ చేసేది. ఆడపిల్ల పుస్తకాలు ఎక్కువ చదివితే చెడిపోతుందనే దృక్పథం ఉన్న ఆ కాలంలో ఇంట్లోవాళ్ళకి తెలియకుండా గ్రంథాలయానికి వెళ్ళే సాహిత్యపఠనం చేసేది. రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక, దిండుకింద దాచుకున్న లైబ్రరీ పుస్తకాల్ని జీరో క్యాండిల్‌ బల్బ్‌ వెలుగులో చదువుకునేది.

రజని మొదట్లో కథలు ఎక్కువ రాసేది.1987లో ఆంధ్రజ్యోతి వీక్లీ న్యూజెర్సీ కథల పోటీల్లో రెండుసార్లు ఆమె కథలకు నగదు బహుమతులు లభించాయి. అలా ఆమె తొలికథ ‘అపరిచిత అతిథి’ ఆంధ్రజ్యోతి వీక్లీలో ఆమె ఫోటోతో సహా వచ్చింది. మరో కథ ‘మందు’. ఈ రెండు కథలూ స్ర్తీల సమస్యలను ప్రతిబింబించినవే. దీంతో ఆమె రచయిత్రిగా పేరు పొందింది.[3]

  • జేబు (కథలు)
  • ఎర్రజాబిళ్ళ ఎరీనా (కవిత్వం)

కవితలు

మార్చు
  • అబార్షన్ స్టేట్ మెంట్  : కవిత ద్వారా పురుషాధిక్య సమాజాన్ని ఉలిక్కిపడేట్టు చేసి వారి భావజాల మార్పుకు దోహదపడింది.
కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
అన్నయ్ గారు ఆంధ్రజ్యోతి ఆదివారం 1998-09-13
అపరిచిత అతిథి ఆంధ్రజ్యోతి వారం 1987-07-24
ఎక్ స్ట్రా గ్రోత్ వార్త ఆదివారం 2001-09-23
జన్మజన్మలబంధం ఆహ్వానం మాసం 1996-11-01
పాయితోలే మనుషులు ఆంధ్రజ్యోతి ఆదివారం 1994-02-20
పున్నామ నరకం ఆంధ్రప్రభ వారం 1997-05-28
బరి ఆంధ్రజ్యోతి ఆదివారం 1995-08-27
మందు ఆంధ్రజ్యోతి వారం 1988-07-01
సత్యవ్రతం అమెరికా భారతి ద్వైమాసిక 2000-01-01

టెలీ ఫిలిమ్స్ గా కథలు

మార్చు
  • రూమ్మేట్ : దీనిని రచయిత, దర్శక నిర్మాత వి.ఎన్‌.ఆదిత్య (మనసంతా నువ్వే ఫేమ్‌) టెలిఫిలిమ్‌గా తీశాడు.
  • సత్యవ్రతం
  • వరదగుడి

వ్యక్తిగత జీవితం

మార్చు

1987లో పాటిబండ్ల రజని వివాహం జరిగింది. ఆవిడ జీవిత భాగస్వామి మోరంపూడి కిషోర్‌కుమార్‌ .విజయవాడ ఆర్టీసీలో సిస్టమ్‌ సూపర్‌వైజర్‌. వారికి ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి సుదీప్‌. రెండో అబ్బాయి ధీరజ్‌.

మూలాలు

మార్చు
  1. కథానిలయంలో "పాటిబండ్ల రజని"[permanent dead link]
  2. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.[permanent dead link]
  3. "అసమానతలపై అసహనమే నా సాహిత్యం". lit.andhrajyothy.com. Retrieved 2020-07-24.