పాణ్యం దత్తశర్మ

తెలుగు కవి, రచయిత, విమర్శకుడు

పాణ్యం దత్తశర్మ తెలుగు రచయిత, కవి, పండితుడు.

పాణ్యం దత్తశర్మ
జననం
పాణ్యం దత్తశర్మ

(1956-06-20) 1956 జూన్ 20 (వయసు 68)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ.(సంస్కృతం), ఎం.ఫిల్, పి.జి.డి.ఇ.టి.
వృత్తిలెక్చరర్, రీడర్
క్రియాశీల సంవత్సరాలు1984-2016
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి, వక్త, విమర్శకుడు
గుర్తించదగిన సేవలు
సాఫల్యం,
దత్త కథాలహరి,
దత్తవాక్కు
తల్లిదండ్రులుపాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి, పాణ్యం లక్ష్మీ నరసమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఈయన 1956, జూన్ 20వ తేదీన కర్నూలు జిల్లా, వెల్దుర్తి గ్రామంలో పండిత కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి కవి, అవధాని. తల్లి పాణ్యం లక్ష్మీ నరసమ్మ. దత్తశర్మ ఎస్.ఎస్.సి. వరకూ వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ హైస్కూలులో చదివాడు. తరువాత 10 సంవత్సరాలపాటు వ్యవసాయం చేశాడు. పట్టుపురుగుల పెంపకం, నిమ్మతోట మొదలైనవి నిర్వహించాడు. ప్రైవేటుగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివాడు. ఇంగ్లీషు, సంస్కృత భాషలలో స్నాతకోత్తర పట్టాలను పొందాడు. ఎం.ఫిల్, పి.జి.డి.టి.యి. చదువుకున్నాడు. 1984లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలలో నెగ్గి ఇంటర్మీడియట్ విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్‌గా చేరి, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా వివిధ స్థాయిలలో పనిచేశాడు. 2016లో పదవీ విరమణ పొంది ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు. కొంతకాలం ధృవ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, అరోరా బిజినెస్ స్కూల్ వంటి ప్రైవేటు విద్యాసంస్థలలో ఇంగ్లీషు, బిజినెస్ కమ్యూనికేషన్ మొదలైనవి బోధించాడు.

రచనా వ్యాసంగం

మార్చు

ఇతను కవిగా, రచయితగా, విమర్శకునిగా, గాయకునిగా, కాలమిస్టుగా పేరు సంపాదించుకున్నాడు. 80కి పైగా కథలను వ్రాశాడు.

రచనలు

మార్చు
  • చంపకాలోచనం (ఖండకావ్యము)
  • దత్తకథాలహరి (కథాసంపుటి)[1]
  • సాఫల్యం (నవల)
  • మహాప్రవాహం (నవల)
  • శ్రీమద్రమారమణ (హరికథ కళాకారుని జీవితాన్ని చిత్రించే నవల)
  • ఆపరేషన్ రెడ్ (నవల)
  • అడవితల్లి ఒడిలో (పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల)
  • అంతరిక్షంలో మృత్యునౌక (సైన్స్ ఫిక్షన్ నవల)
  • ప్రాచ్యం పాశ్చాత్యం (నవల)
  • శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి! (పరిశోధక గ్రంథం)
  • గుండెతడి (మనోవైజ్ఞానిక నవల)
  • జయభారత జనయిత్రి (నవల)
  • జంటరాజ్యాల వెంట (నవల)
  • శ్రీనందమూరి తారకరామ శతకము
  • సమకాలీనం (పద్యకావ్యం)
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు
  • Garland of poems (ఆంగ్ల కవితా సంపుటి) మొదలైన రచనలు చేశాడు. అనేక రచనలను తెలుగు నుండి ఆంగ్లంలోనికి, ఆంగ్లం నుండి తెలుగులోనికి తర్జుమా చేశాడు. దత్తవాక్కు పేరుతో ఆంధ్రప్రభ దినపత్రికలో శీర్షికను నిర్వహించాడు. ఇతని రచనలు ఆంధ్రప్రభ, సంచిక, ఉషా, కథామంజరి, రవళి, జ్యోతి, స్రవంతి, ఔచిత్యం, జాగృతి, రమ్యభారతి, నెచ్చెలి, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, స్వాతి, విపుల మొదలైన ప్రింట్, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతడు అనేక గ్రంథాలకు విమర్శలు, సమీక్షలు వ్రాశాడు. అనేక గేయాలను, పాటలను, కీర్తనలను, కవితలను రచించాడు. పలుచోట్ల సాహిత్య, ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగించాడు.

బహుమతులు, గుర్తింపులు

మార్చు

ఇతని అనేక రచనలకు బహుమతులు, పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.

  • రంజని తెలుగు సాహితీ సమితి, ఎ.జి.ఆఫీసు, హైదరాబాదు వారిచే కవిసామ్రాట్ విశ్వనాథ పురస్కారం.
  • బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారిచే సిద్ధాంత గ్రంథానికి అవార్డు.
  • సి.పి.బ్రౌన్‌ సమితి, బెంగుళూరు వారిచే ‘ఎన్.టి.ఆర్. స్మారక శతకరత్న’ అవార్డు.
  • చదువు - అన్వీక్షికి ప్రచురణ సంస్థ నిర్వహించిన 2023 ఉగాది నవలల పోటీలో 'ఆపరేషన్ రెడ్' నవలకు బహుమతి.
  • ఉషా పక్షపత్రిక నిర్వహించిన వెలగపూడి సీతారమయ్య స్మారక నవలల పోటీలో 'ప్రాచ్యం-పాశ్చాత్యం' నవలకు మొదటి బహుమతి.
  • సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో 'శ్రీమద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికయ్యింది.[2]
  • ఉషా పత్రిక నిర్వహించిన తటవర్తి భారతి స్మారక కథా పోటీలో ఇతని కథ బహుపత్నీవ్రతుడు ఎంపికయ్యింది.
  • గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్స్ వారు నిర్వహించిన కీ. శే. గోవాడ మల్లీశ్వరి స్మారక నాటిక రచనలో పోటీలో 'కుమాతానభవతి' అనే నాటికకి ప్రశంసా బహుమతి.
  • ‘బాలబాట’ మాసపత్రిక నిర్వహించిన బాలల నాటిక రచనల పోటీలో ‘పరధర్మో భయావహః’ అనే నాటికకు విశిష్ట బహుమతి.
  • తెలుగు కళాసమితి విశాఖ వారు నిర్వహించిన కథానాటిక రచన పోటీలలో 'యత్ర నార్యస్తు పూజ్యంతే'కు తృతీయ బహుమతి.
  • ఔచిత్యమ్-"తెలుగు పరిశోధనవ్యాసరచన పోటీలలో 'రామం భజే శ్యామలమ్' : మన సనాతన ధర్మపునరుజ్జీవనం అనే వ్యాసానికి బహుమతి.[3]
  • ‘తెలంగాణ పాయిటిక్‌ఫోరమ్‌’ వారిచే ‘Poet of Profundity’ అనే బిరుదు.

మూలాలు

మార్చు
  1. శ్రీ (3 December 2023). "ఆలోచింపజేసే కథలు". ఈనాడు ఆదివారం. Retrieved 21 August 2024.
  2. విజయవాడ కల్చరల్ (11 April 2024). "ఉత్తమ బహుమతికి రెండు నవలలు ఎంపిక". సాక్షి దినపత్రిక. Retrieved 21 August 2024.
  3. సంపాదకుడు (1 December 2022). "ఔచిత్యమ్-"తెలుగు పరిశోధనవ్యాసరచన పోటీలు-2023"- ఫలితాలు". ఔచిత్యమ్. 3 (13). Retrieved 21 August 2024.

బయటి లింకులు

మార్చు