పాలగుమ్మి విశ్వనాథం

పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) ఆంధ్ర ప్రదేశ్లో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన తొలితరం కళాకారుల్లో ఒకరు. ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలో15000 పైగా పాటలకి సంగీతాన్ని సమకూర్చారు. వందకి పైగా పాటలు రాశారు. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణరెడ్డి వంటి ఎందరో ప్రముఖ కవుల కవితలకి స్వరాలు కూర్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ రామారావు, చిత్తరంజన్, వేదవతీ ప్రభాకర్ వంటి ఎందరో ప్రముఖ కళాకారులు ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్నవారే.

పాలగుమ్మి విశ్వనాథం
జననంపాలగుమ్మి విశ్వనాథం
1919
తిరుపతిపురం, తూర్పు గోదావరి జిల్లా
మరణం2012
వృత్తిలలిత సంగీత విద్వాంసుడు

"అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" అన్న ఆయన గీతం విశేష ప్రజాదరణ పొందిన లలితసంగీత గేయాల్లో ఒకటి.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

విశ్వనాథం 1919లో తూర్పు గోదావరి జిల్లా తిరుపతిపురం గ్రామంలో జన్మించారు. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు ఈయన సోదరులు. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన విశ్వనాథం విద్యాభ్యాసం రాయకుడూరు, రాజమండ్రి లలో జరిగింది.

చిన్నవయసులోనే సంగీతం వైపు ఆకర్షితుడైన విశ్వనాథం కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కాకినాడలో "సంగీతభూషణ" మర్ల సూర్యనారాయణమూర్తి వద్ద కర్నాటక సంగీతం అభ్యసించారు. "మహామహోపాధ్యాయ" ఈమని శంకర శాస్త్రి ప్రథమ శిష్యుడిగా వీణ నేర్చుకున్నారు. తరువాత సంగీత కళానిధి డక్టర్ ఎస్.రామనాథన్ వద్ద చెన్నైలో సంగీత విద్యాభ్యాసం కొనసాగించారు.

ఉద్యోగ జీవితం

మార్చు

40లలో సంగీత దర్శకుడు విష్ణుదాస్ శిరాళి ట్రూపులో వైణికుడిగా ఉదయశంకర్ తీసిన కళాత్మక చిత్రం "కల్పన"కు పనిచేయడంతో విశ్వనాథం కెరీర్ మొదలైంది. అదే సమయంలో ఈమని శంకర శాస్త్రి గారి సహాయకుడిగా దక్షిణాది చిత్రరంగంలో చంద్రలేఖ, మంగమ్మ శపథం, అవ్వైయార్ వంటి చిత్రాలకి పనిచేశారు. ప్రగతి పిక్చర్స్, వాహిని స్తూడియో వంటి వారి సినిమాల్లో వీన వైనికుడిగా పనిచేశారు. అయితే, 1954లో ఆకాశవాణిలో చేరడం ఆయన సంగీత ప్రస్థానంలో ఒక మలుపు.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి లలితసంగీత విభాగానికి ప్రొడ్యూసర్ ఇంఛార్జ్ గా 1979లో పదవీ విరమణ చేశారు. ఈ సమయంలో ఆనాటి సంగీత, సాహిత్య, నాతక రంగ ప్రముఖులందరితోనూ పనిచేసారు. సంగీత రూపకాలు, గ్రామీణ కార్యక్రమాలు, నాటకాలు, భక్తి కార్యక్రమాలూ, ప్రభుత్వ ప్రకటన్లూ ఇలా రకరకాల కార్యక్రమాలకి సంగీతం కూర్చారు. తాను స్వయంగా ఎన్నో గేయాలను రచించారు, గానం చేశారు.

పదవీ విరమణ అనంతరం కూడా లలిత సంగీత రంగంలో అనేక సంస్థలకి సలహాదారుగా ఉన్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పొట్టిస్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలితసంగీత విభాగం ఏర్పరచి, సిలబస్ కూర్చడంలో, పాఠ్యపుస్తకం రూపొందించడంలోనూ పాలుపంచుకున్నారు. ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ బోర్డులో, నందీ అవార్డు కమిటీలోనూ, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ లలో సభ్యులుగా కూడా పనిచేశారు.

రచనలు

మార్చు
  • లలిత సంగీత చరిత్ర - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ
  • Fiddle Naidu - Life and Achievements of Violin Master Late Dwaram Venkataswamy Naidu భారత ప్రభుత్వ సమాచార విభాగం ప్రచురణ
  • అమ్మ దొంగా - గేయాల సంకలనం
  • ఇవి కాక వివిధ పత్రికల్లో సంగీత సంబంధ విషయాల గురించి వ్యాసాలు రాసారు.

మూలాలు

మార్చు