పావులూరి మల్లన

భారతీయ గణితవేత్త

పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త.

గురించి

మార్చు

ఇతని కాలం 11 వ శతాబ్దం. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనే గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యంలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తుంది. ఇతను శైవమత ప్రీతిపాత్రుడని తెలుస్తోంది. ఇతని తల్లిదండ్రులు శివన్న, గౌరమ్మలనీ, ఈతను మల్లయామాత్యుని పౌత్రుడనీ ఇతని రచనల ద్వారా తెలుస్తోంది.[1] గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన కరణంగా ఉండేవాడట. ఇతడు మహావీరాచార్యులు రచించిన "జైన గురుసార సంగ్రహ గణితము"ను సంగ్రహించి "లీలావతి గణితము" అని ఆంధ్రీకరించాడు.. మూలం ఆ సంస్కృత గ్రంథం కావచ్చునుగాని లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకొన్నవే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఇతని రచనలో కవిస్తుతి, పరిచయం వంటివి లేవు.

ఇతనివని చెప్పబడుతున్న పద్యాలు

మార్చు

శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ-పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్ బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళాశీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్ [2]

చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్
బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యం
దులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది చేనలు రాజహంసమీ
నలిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే

[3]

మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.[4]

అర్కాది గ్రహ సంచర గ్రహణ కాలాన్వేషణోపాయమునన్
దర్క వ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సం
పర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారమున్
దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?

విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.

మూలాలు

మార్చు
  1. కవుల చరిత్ర 2 వ పుట
  2. "రచ్చబండ" గూగుల్ సమూహంలో[permanent dead link] "జెజ్జాల కృష్ణ మోహన రావు" ఉదహరించినది
  3. కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  4. ఆంధ్రుల చరిత్ర - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)