పింజివాక్కం

తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా తిరువళ్ళూరు తాలూకాకు చెందిన గ్రామం

పింజివాక్కం తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా తిరువళ్ళూరు తాలూకాకు చెందిన గ్రామం. ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం. చెన్నై నుండి కంచి మార్గంలో 50 అడుగుల రహదారికి దక్షిణంగా అర కిలోమీటరు దూరంలో కూవం ఏరుకు దక్షిణంగా ఉన్న చిన్నగ్రామం ఇది. వ్యవసాయం తప్ప గ్రామంలో ఇతర ఉపాధి వసతులు లేవు. ఉపాధి కొరకు ప్రజలు పరిసర ప్రాంతాలకు వస్తూ పోతూ ఉంటారు.[1]

గ్రామంలో ఒక వీధి

వ్యవసాయం

మార్చు

ఈ గ్రామంలో ప్రధానంగా వరి, వేరుశనగ పండిస్తారు. ఒకప్పుడు ఇచ్చట పూలతోటలు వేసేవారు.ఇచ్చట వంకాయలు, బెండకాయలు, గోంగూర, ముల్లంగి, పచ్చి మిరపకాయలు మొదలైన కూరగాయలు పండిస్తారు.

విద్య

మార్చు
 
ప్రాథమిక పాఠశాల

ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో చదవడానికి కాన్‌వెంటు చదువు కొరకు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడంబత్తూరుకు వెళుతుంటారు. అక్కడ మాత్రమే కాన్‌వెంటులు ఉన్నాయి. అలాగే ఐదవ తరగతి తరువాత కాన్‌వెంటు చదువుకు తిరువళ్ళూరుకు వెళ్ళాలి. అలాగే ఉన్నత పాఠశాల చదువులకు పుదుమావిలంగై, కడంబత్తూరుకు వెళ్ళాలి. పుదువిలంగైలో 8వ తరగతి వరకు చదవడానికి వీలైన మాధ్యమిక పాఠశాల ఉంది. కడంబత్తూరులో ప్లస్ టూ వరకు చదవగలిగే ఉన్నత పాఠశాల మాత్రమే ఉంది. కాలేజ్ చదువులకు సమీపంలో ఉన్న పట్టాభిరాం, చెన్నైకు వెళ్ళాలి. పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యా సౌకర్యం సమీపంలోని వేపంపట్టిలో ఉంది.

ఆలయాలు

మార్చు

ఇచ్చట శివాలయం, వినాయకుని ఆలయం, రామాలయం, గ్రామదేవతలు ఐన ఎట్టమ్మ, మారేమ్మ దేవాలయాలు ఉన్నాయి. పురాతనమైన శివాలయానికి శైవ బ్రాహ్మణులు పూజాధికాలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివునికి జరిపించే సకల విధమైన పూజలు నిర్వహిస్తుంటారు. పూజారికి ఆలయం వెలుపల గృహవసతి చేయబడి ఉంది. వాలాయమ్మ విగ్రహం పూజారి ఇంట్లోనే ఉంటుంది. అమ్మవారి నిత్యపూజాధికాలు విధిగా నిర్వహించబడుతుంటాయి. ఆర్యవైశ్యుల చేత నిర్మించబడిన రామాలయం ఉంది. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ లేదు. ఆర్యవైశ్యులు ఈ ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్సవం నిర్వహిస్తుంటారు. గ్రామదేవత అయిన ఏట్టెమ్మ మరెమ్మలకు ఇక్కడ వేసవికాలంలో వైభవోపేతంగా జాతర నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం గ్రామదేవతకు సామూహికంగా పొంగలి పెడతారు. ఇక్కడ కన్యకలకు ఒక అలయం ఉంది. ఆ అలయానికి పైకప్పు ఉండదు. ఈ ఆలయంలో కూడా సాముహికంగా పొంగలి నైవేద్యంగా పెట్టి పుజాదికాలు చేస్తుంటారు. గ్రామదేవత ఆలయాలలో పూజను పండారీలు నిర్వహిస్తారు.

ప్రజలు

మార్చు
 
ఆర్యవైశ్యులు నివసించే వీధి
  • ఒకే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. శివాలయం వెలుపలి ఆవరణలో వీరి గృహం వసతి చేయబడి ఉంది. వీరి ఇంటిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారికి ఆలయంలోలాగా నిత్యపూజాధికాలు నిర్వహించబడతాయి. పిల్లలకు అనారోగ్యం, భయపడడం వంటి సమయాలలో వీరు వేపఆకులతో మంత్రం వేయడం వీరి విధులలో ఒకటి. అయినప్పటికీ వీరు పౌరోహిత్యం చేయరు. కనుక అధికంగా పురోహితులు సమీపంలోని పుదుమావిలంగై గ్రామం నుండి పిలిపించబడతారు.
  • ఇచ్చట అధిక సంఖ్యలో మోదళియారులు ఉన్నారు. వీరు శైవభక్తులు. వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నవారు. ప్రస్తుతం చదువుకున్న యువతీ యువకులు కార్యాలయాలలో పనిచేయడానికి చెన్నై వరకు పోతూ వస్తూ ఉంటారు.
  • తరువాత స్థానంలో ఆర్యవైశ్యులు ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కామేపల్లి నుండి ఇక్కడ స్థిరపడిన తెలుగువారు. వీరు ఒకే కుటుంబానికి చెందిన ఒకే వ్యక్తి వంశానికి చెందిన వారు కావడం విశేషం. కుమ్మరి, కమ్మరి, గొల్ల, చాకలి, పండారి, ఈండ్ర, తలారి మొదలగు కులాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విక్రయం, బియ్యం తయారీ విక్రయం వీరి ప్రధాన జీవనోపాధి.
  • తరువాత స్థానం గొల్లవారిది. వీరు పాలవిక్రయం మీద అధికంగా ఆధారపడి ఉంటారు. పశుపోషణ, వ్యవసాయం వీరి జీవనోపాధి.
  • తరువాత స్థానం పండారీలది. వీరు అధికంగా పూల విక్రయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. వీరు పూలతోటలను పెంచుతుంటారు. ఆలయానికి, వివాహాది శుభకార్యాలకు పూలను అందించడం, పూల అలంకారం, వివాహ మండప అలంకారం వంటి పనులు చేస్తుంటారు.
  • తరువాత స్థానం కంసలి వారిది. వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తయారీ వీరికి జీవనోపాధి.
  • మంగలి వారిది ఒక కుటుంబం ఉంది. ఆలయాలలో పూజవిధికి, శుభ కార్యాలకు మంగళ వాయిద్యాలను వాయించడం వీరి జీవనోపాధి.
  • చాకలి వారు ఒక కుటుంబం ఉంది. వీరిని ఊరికి అవసరం కనుక వెలుపలి ఊరి నుండి పిలిపించి ఇంటికి స్థలమిచ్చి వారు గ్రామంలో నివసించేలా చేసారు. ఆమ్మవారి జాతర సమయాలలో అమ్మవారిని కుంబం రూపంలో వీరి ఇంట ఉంచుతారు. వీరి కుటుంబానికి చెందిన వారు మాత్రమే అమ్మవారి కుంభం ఎత్తుకునే అధికారం ఉంటుంది. అమ్మవరికి మొక్కుబడులు తీర్చడానికి వీరి సాయం కావాలి.
  • కుమ్మరి వారు ఒకే కుటుంబం ఉంది. వీరు గ్రామవాసులకు అవసరమైన మట్టి పాత్రలను తయారుచేసి ఇస్తుంటారు.అమ్మవారి జాతరకు తాజాగా విగ్రహం తయారు చేసి ఇచ్చేది వీరే.
  • తలారి కుటుంబం ఒకటి మాత్రమే ఉంది. దహనసంస్కారం జరపడంలో వీరి పాత్ర అత్యవసరం.
  • ఈన్ర వారి కుటుంబాలు ఉన్నాయి. వీరు వ్యవసాయం పశుపోషణ వంటి వృత్తులని జీవనోపాధిగా చేసుకున్నారు.
  • ఒకేఒక క్రైస్తవ కుటుంబం ఉంది. అయినప్పటికీ వారికి ప్రార్థనా మందిరం లేదు.

వసతి సౌకర్యాలు

మార్చు
 
వాటర్ ట్యాంక్

ఇచ్చట త్రాగునీటి సరపరా, విద్యుత్ దీపాల వసతి ఉంది. గ్రామంలోని వీదులన్నింటికి సిమెంటు రోడ్డులు ఉన్నాయి.ఇచ్చట రైసు మిల్లు ఉంది.రేషన్ దుకాణం ఉంది. అవసరానికి లభించేలా చిన్నతరహా చిల్లవస్తువుల దుకాణాలు ఉన్నాయి.

ప్రయాణ వసతులు

మార్చు
  • గ్రామానికి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో చెన్నై, కంచి రోడ్డు నుండి బసు వసతి ఉంది. అక్కడి నుండి గ్రామానికి చేరడానికి చిన్న రోడ్డు మద్యలో ఏటి మీద ఒక వంతెన ఉన్నాయి.
  • సమీపంలోని కడంబత్తూరు నుండి రైలు వసతి ఉంది.

ఇచ్చటకు మినీ బసుల వసతి ఉంది. ఆటోలు, కాన్వెంట్ వ్యానులు, బాడుగ కారులు ఉన్నాయి.

వసతి లోపాలు

మార్చు

వైద్యవసతి లేదు. వైద్య అవసరాలకు సమీపంలో ఉన్న కడబత్తూరుకు వెళ్ళాలి. అక్కడ ప్రభుత్వ వైద్యులు మాత్రం కొన్ని ప్రత్యేక సమాయలో కంసల్టింగ్ మాత్రం చేస్తారు. అక్కడ ప్రభుత్వేతర వైద్యుల ఆసుపత్రులు ఉన్నాయి. చిన్న అవసరాలకు పడకల వసతి ఉన్న ఆసుపత్రి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యసహాయానికి జిల్లా కేంద్రమైన తిరువళ్ళూరు, పేరంబాకం గ్రామాలలో ఆసుపత్రులు ఉన్నాయి.

ప్రత్యేకతలు

మార్చు

గ్రామదేవత జాతర ఈగ్రామ ప్రత్యేకత.

వెలుపలి లింకులు

మార్చు

మూలాల జాబితా

మార్చు