పుట్టపర్తి కనకమ్మ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పుట్టపర్తి కనకమ్మ (1921 జూలై 22 - 1983 మార్చి 22) ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఈమె భర్త.
ఈమె 1921, జూలై 22 తేదీన ప్రొద్దుటూరు లో జన్మించారు. ఈమె కాశీ పండితులుగా ప్రసిద్ధిగాంచిన కిడాంబి రాఘవాచార్యులు మనుమరాలు. చిన్ననాటి నుండే గ్రంథపఠనం యందు ఆసక్తి తో ఎన్నో కావ్యాలు పఠించింది. 14 సంవత్సరాల వయసులో ఈమెకు నారాయణాచార్యులతో వివాహం జరిగింది. సహధర్మచారిణిగా భర్త వద్ద విద్యనేర్చుకోవడానికి వచ్చిన శిష్యులను సొంత పిల్లలవలె ఆదరించేది.
ఈమె సాహిత్యం మీద మక్కువతో భర్తకు తెలియకుండా కవిత్వం రాస్తుండేవారు. వాటిని ఒక ట్రంకుపెట్టెలో భద్రంగా ఉంచేది. ఒకనాడు పుట్టపర్తి వారు ఆ కవితల్ని చూసి ఆమె భావ పరిపక్వతకు, భాషా సౌందర్యానికి మురిసిపోయారు. ఆమె వద్దంటున్నా వాటిని వివిధ పత్రికలకు పంపారు. అవి ప్రచురించబడి లోకానికి ఆమె కవయిత్రిగా తెలిసింది. యశోధర, పశ్చాత్తాపం, విషాదగానం వంటి కవితా ఖండికలను కలిపి అగ్నివీణ పేరుతో పుట్టపర్తివారు వెలువరించారు. గాంధీజీ హత్యకు గురైనపుడు,ఆ మహనీయ అహింసా మూర్తికి కన్నీటి నివాళిగా 'గాంధీజీ మహా ప్రస్థానం' అన్న ఆశువుగా శోక కావ్యాన్ని (ఎలిజీ) పుట్టపర్తి వారితో కలిసి రచించగా, వెంటనే ప్రచురింప బడింది కూడా!! అప్పట్లో ఆకాశవాణి విజయవాడ నిర్వహించే సమస్యా పూరణం కార్యక్రమానికి ఉత్సాహంతో పద్యాలు వ్రాసి పంపేవారు.1970 ల నుండే, ఆకాశవాణి హైదరాబాద్, కడప కేంద్రాల సంగీత నిర్వాహణలో, భక్తి రంజని లో కనకమ్మ గారి అనేక భక్తి కీర్తనలు ప్రసారమవుతూనే ఉన్నాయి. శ్రీయుత పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, కలగ కృష్ణ మోహన్ , నేలభట్ల రంగ నాయక శర్మ, కుమారి కౌతా ప్రియం వద, వంటి ప్రముఖులు స్వర పరచగా ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించారు.
వాల్మీకి రామాయణo ఆమెకు ఇష్టమైన కావ్యం రాముడు ఆరాధ్య దైవం. వాల్మీకి రామాయణమును దాదాపు వంద పర్యాయాలు ఆమె పారాయణం చేసారు. వివిధ దైవాలపై చక్కని కృతులను భర్తతో కలిసి వ్రాసారు అవి అన్ని ఆకాశవాణి కేంద్రాలలోనూ ఎన్నో సంవత్సరాలు ప్రసారమయ్యాయి.
ఆమె తన తపోబలంతో ఎందరి ఈతి బాధలనో తీర్చేవారు అప్పట్లో!! ఈ రకంగా ఆమె ను మాతృ మూర్తి గా ఆరాధించేవారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ఆమె సామాజిక స్పృహతో, స్త్రీ శక్తి గురించీ, వరకట్నానికి వ్యతిరేకంగా కవితారచన చేశారు. ఈమె సంస్కృతంలో శ్రీరామ సుప్రభాతం పార్థ సారథి సుప్రభాతం రచించారు. అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1974లో ఈమెను ఉత్తమ కవయిత్రిగా సన్మానించారు.
ఈమె 1983 సంవత్సరంలో పరమపదించారు.