పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

(పుత్తడి బొమ్మా పూర్ణమ్మా నుండి దారిమార్పు చెందింది)

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.[1] ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది.[2][3]

రచయిత గురజాడ అప్పారావు

సామజిక నేపద్యం

మార్చు

అయితే నాడు మొత్తం సమాజమంతా ఈ కన్యాశుల్కం దురాచారానికి బలి అయ్యినదంటే నేడు నమ్మసఖ్యంగా ఉండకపోవచ్చు. పూర్ణమ్మ అనే బాలిక బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరు, ఆ విషాదకర మరణానికి మూల కారణం ఏమిటి. ఇటువంటి రుగ్మతకు కారణం కులమా, సమాజమా అని ప్రశ్నిస్తే, ఈ జాడ్యం కేవలం ఒక కులానికే పరిమితమైనదా లేదా మొత్తం నాటి సమాజానికంతటికి చీడలా వ్యాపించినదా అని తర్కిస్తే చర్చ శాస్రీయ ధోరిణి వైపు, వాస్తవాల వైపు మళ్ళాల్సివుంటుంది. ఈ కన్యాశుల్కం దురాచారానికి ముగింపుగా బలవన్మరణం పొందడం లేదా విధవాపునర్వివాహం లేకుండా కన్య గానే మిగిలిపోవడం అనేది నాడు అన్ని కులాలలో కనిపించినదా లేదా కేవలం సనాతన బ్రాహ్మణ కులాలలోనే కనిపించినదా అన్న కోణం నుంచి కూడా పరిశీలించాల్సివుంటుంది.

ముందుగా సమస్య ప్రభావ పరిధి ఏమిటి అని చూడాల్సివుంటుంది. ఏదైనా ఒక సమస్య యొక్క దుష్ప్రభావం సమాజం లోని కొద్ది కులాలకే పరిమితమైవుంటే మౌలికంగా ఆ సమస్యను కుల సమస్యగానే పరిగణించాల్సివుంటుంది. అలా కాక సమస్య దుష్ప్రభావం సమాజం లోని అధిక శాతం ప్రజలందరిలోను కనిపిస్తుంటే లేదా ఎక్కువ సంఖ్యలోని కులాలకి వ్యాపించి అతలకుతలం చేస్తుంటే దానిని మొత్తం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా, సామాజిక సమస్యగానే పరిగణించాల్సివుంటుంది. ఈ విధంగా కన్యాశుల్క సమస్య దుష్ప్రభావ పరిధిని పరిశీలించాల్సి వుంటుంది. నాడు మొత్తం సమాజం జనాభాలో బ్రాహ్మణ సామాజిక వర్గం 5 శాతానికి కాస్త అటూ ఇటూగానే వుండి వుంటుంది. మిగిలిన జనాభాలో 60-70 శాతం బలహీన దళిత వర్గాలు కాగా మిగిలిన బ్రాహ్మాణేతర అగ్ర వర్ణాలు 20 శాతం లోపే ఉండవచ్చు. ముప్పిరిగొన్న చాందస భావాలు, మార్పును ప్రతిఘటించే భావజాలం ఎక్కువగా వున్న చాందస సమాజంపై ఇటువంటి ఆచారాల ప్రభావం దారుణంగా కనిపిస్తుంది. అయితే అంతిమంగా ఇటువంటి దురాచార దుష్ప్రభావానికి బలయ్యేది అటువంటి చాందస సమాజంలోని అన్నెం పున్నెం ఎరుగని నోరు మెదపని పిల్లలు స్త్రీలే అన్నది అనాది నుండి మనకు తెలిసినదే. ఒక పూజారింటను పుట్టిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అటువంటి చాందససమాజపు వడిలో పుట్టి పెరిగిన బాలిక కాబట్టే ఆమె జీవితం విషాదకరంగా ముగిసి కంట తడి పెట్టిస్తుంది.అదే ఆ పసి మొగ్గ వేరే సామాజికవర్గపు వడిలో పూసి వుంటే ఫలితం ఇంత దారుణంగా చిదిమివేయబడి వుంటుందా అని ప్రశ్నిస్తే కాదనే చెప్పాల్సివుంటుంది.

నాటి జనాభాలో 60-70% జనాభా గల బలహీన దళిత వర్గాలలో అటువంటి విపత్కర పరిస్థితులలో ఆ స్త్రీ పునర్వివాహానికి బలహీన వర్గాల సమాజం మద్దతు తప్పనిసరిగా వుండేది. కారణం నిత్యం బ్రతుకు పోరాటం చేసే దళిత వర్గాలకు తమ స్త్రీలను అలాంటి చాందస భావాలతో శ్రమశక్తికి దూరం చేసుకొనే సామజిక ఏర్పాటు, కట్టుబాట్లు లేకపోవడమే. ఆయా దళిత కులాలలో స్త్రీలు పురుషులతో సమానంగా కష్టపడడం అన్నిటికీ మించి స్త్ర్రీ శ్రమశక్తి అవసరాలు నాటి దళిత సమాజాలలో తప్పనిసరి కావడంతో వారు తమ స్రీలను ఉత్పత్తి ప్రక్రియకు దూరం చేసుకోలేదు. అలా దూరం చేసుకొన్న రోజున ఆయా దళిత కులాలు మనజాలలేవు కూడా. అందువల్లనే అటువంటి చాందస ఆచార దుష్ప్రభావాలు బలహీన దళిత సామాజికవర్గాలలో కనిపించవు. అందుకే చరిత్రలో బలహీన దళిత వర్గాల బాలికలు బాలవితంతువులుగా మిగిలిపోయిన ఉదంతాలు మనకు కనిపించవు. అదేవిధంగా బ్రాహ్మణేతర అగ్ర వర్ణాల (20% ప్రజలు) విషయానికి వస్తే వారు నాటి సమాజంలో ఆర్థిక పరంగా, శక్తి పరంగా అధిపత్యం చెలాయించేవారు. ఆ సుసంపన్నమైన ఉన్నత సమాజాల వారు చాందసవాద ఆచారాలను పేరుకు పాటించినా వాటి దుష్ప్రభావం వల్ల తమకు నష్టం కలుగుతుంటే ఎంతమాత్రం సహించబోరు. వారు ఆ ఆచారపు దుష్ప్రభావాలను పరిగణన లోనికి తీసుకొనడానికి సాద్యమైనంత వరకు నిరాకరిస్తూనే వుంటారు. ఆర్థికంగా, శక్తి పరంగా వున్న నేటి ఉన్నత వర్గాలు కూడా ప్రాచీన ఆచారాలను పైపైకి పాటిస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికిని వాటి వల్ల కలిగే దుష్ప్రభావఫలితాలను లెక్క చేయకపోవడం నేటికి మనకు అనుభవైకవేద్యమే. ఈ విధంగా బ్రాహ్మణేతర అగ్ర వర్ణాల స్ర్తీలు బాల్యం లోనే కన్యాశుల్కం దురాచానికి బలైనప్పటికి ముసలి భర్త మరణాంతరం ఆ బాలికల విధవ పునర్వివాహానికి ఆయా ఆధిపత్య సమాజాలు పెద్దగా అభ్యంతరాలు తెలియచేసిన దాఖలాలు చరిత్రలో మనకు కనిపించవు.దీనిని బట్టి ప్రధానంగా నాటి సమాజంలోని 95 శాతం వున్న ప్రజల్లో ఈ కన్యాశుల్కం దురాచారానికి ముగింపుగా బలవన్మరణం పొందిన పూర్ణమ్మ లాంటి బాలికలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ కనిపించరు అని తెలుస్తున్నది. అంటే నాటి జనాభాలో కేవలం 5 శాతం వున్న ప్రజల్లోనే (అనగా సనాతన బ్రాహ్మణ సామాజిక వర్గం లోనే) ఆ దురాచారానికి బాలికలు బలి కావడం మనకు గోచరిస్తుంది.

నాటి సంఘసంస్కర్తల కవిత్వధోరిణీ లో ప్రతిఫలించిన ఒక అసహజ ద్వంద్వత్వం

మార్చు

నాటి జనాభాలో కేవలం 5 శాతం ప్రజలలోనే (అనగా సనాతన బ్రాహ్మణ సామాజిక వర్గం లోనే) ఆ దురాచారానికి పసి బాలికలు బలి కావడం (బలవన్మరణం పొందడం లేదా విధవాపునర్వివాహం లేకుండా నిర్బందవైదవ్యానికి గురై కన్య గానే జీవచ్ఛవంగా మిగిలిపోవడం) కనిపిస్తున్నది అని తెలిసినప్పుడు మరి ఈ 5% ప్రజలు అనుభవిస్తున్న దుర్గతికి మొత్తం సమాజంలో లభించిన ప్రచారం, రేకెత్తిన సానుభూతి, మరోవైపు 25% ప్రజలు అస్పృశ్యులుగా అలమటిస్తున్నదుర్గతి సమస్యకు ఎందుకు రాలేదు అని కూడా ఆలోచించాల్సివుంటుంది. ఒక కులదుర్గతిని ఇంత ప్రభావంతంగా వేలెత్తి చూపిన నాటి కవులు అదే సమయంలో ఇతర సామజికదుర్గతులను అంతే ప్రభావంతంగా చూపడంలో ఎందుకు విఫలమయ్యారు? ఒక కులసమస్య పట్ల మొత్తం సమాజాన్ని నిలదీసి కుదిపేసిన వీరి మానవత్వం, కవితాపటుత్వం, దాన్ని మించిన సామాజిక సమస్య పట్ల పేలవంగా ఉరమడానికి, నిస్తేజంగా మూలగడానికి మూల కారణం ఏమై వుంటుంది.

నాటి సమాజంలోని 25 శాతం వున్న ప్రజల్లో (అణగారిన దళిత సామాజికవర్గాలు) స్త్రీ పురుషులు మనవ హక్కులు కోల్పోయి అంటరాని వారుగా జీవిస్తూ వున్నప్పటికీ వారి దుర్గతిని మొత్తం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామజిక సమస్యగా చిత్రించడానికి నాడు ఏ అగ్ర వర్ణ కవులు, మానవతావాదులు స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. వచ్చినా మహాత్మా గాంధీ లాంటి వారి ప్రభోదాలతో వత్తిడితో ఇక తప్పదన్నట్లు సామజిక సమస్యగా చూసారే గాని చిత్తశుద్ధితో గాదు.దీనికి కందుకూరి లాంటి వారు మినహాయింపు అని చెప్పవచ్చు. కేవలం 5% జనాభా గల తమ సామాజికవర్గానికి చెందిన స్త్రీలు బలి అవుతున్న తమ కుల సమస్య ప్రభావాన్ని, మొత్తం సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యంగా చూపించడం, దానిని 100 % సామజిక సమస్య ప్రభావంగా తమ కలం, గళమెత్తి భూతద్దంలో చిత్రించడం, అదే సమయంలో సమాజంలోని 25% ప్రజలకు జీవన్మరణ సమస్యగా దాపురించిన అంటరానితనం సమస్యను 100 % సామజిక సమస్యగా చూడకుండా చూసినా తూతూ మంత్రంగా సాదాగా పట్టించుకోవడం మన జాతీయోద్యమ సంఘసంస్కర్తల కవిత్వధొరిణీలో ప్రతిఫలించిన ఒక అసహజ వైపరీత్యం.అంటరానితనాన్ని ఒక సామజిక సమస్యగా చిత్తశుద్ధితో చూసారా లేదా అనేది అలనాటి జాతీయోద్యమ, సంఘసంస్కర్తల అంతరాత్మలకే తెలుసు.

సంఘసంస్కరణోద్యం కవిత్వం లోని ద్వంద్వత్వానికి కారణం

మార్చు

ఈ ద్వంద్వత్వానికి ఒక కారణం నాటి సంఘ సంస్కర్తల, కవుల యొక్క ఆలోచన పరిధి వారు పుట్టి పెరిగిన వాతావరణం, సామాజికవర్గ పరిధులు దాటక పోవడం, వారి సహజ ఆలోచనా పరిధి మానవత్వాన్ని స్పృశించే ప్రయత్నం చేయకపోవడమేనని చెప్పవచ్చు. వారు తమ తమ ఇళ్ళలో కునారిల్లితున్న సమస్యలను చూసిన కోణంలో, తమ సామాజికవర్గం అనుభవిస్తున్న సమస్యలను అర్ధం చేసుకొన్న రీతిలో మొత్తం సమజాన్ని కుదిపేస్తున్న పెను సమస్యలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడమేనని చెప్పాలి. ఒక సమస్యపై గళమెత్తాలి అంటె మునుముందుగా ఆ సమస్య పట్ల అవగాహన కలిగివుండాలి.సమస్య పట్ల, బాధితుల పట్ల సహానుభూతి పొందగలగాలి. అస్పృశ్యత లాంటి సమస్యలపై ప్రతిస్పందించాలి అంటే ఆ సమస్య పట్ల బాదాతప్త హృదయం, ఆ భాదితుల పట్ల మానవత్వంతో స్పందించే గుణం హృదయంలో సహజంగా కలిగివుండాలి. అలా స్పందించే సహజ గుణం వున్నప్పుడు, వారు నిజమైన మానవతావాదుల్లా రెండు సమస్యలను (కన్యాశుల్కం, అస్పృశ్యత) చూసివుంటే అస్పృశ్యత సమస్యే వారికి అతి పెద్ద సమస్యగా కనిపించి వుండేది. కాని వారు తాము పుట్టి పెరిగిన బ్రాహ్మణ సమాజంలోని కన్యాశుల్కం, విధవ పునర్వివాహం వంటి చాందస కుల సమస్యాప్రభావాల పట్లనే ఎక్కువగా ప్రతిస్పందించారు. పలవరించారు. తమ కులాలకే పరిమితమైన సమస్యాప్రభావాలను మొత్తం జాతి సమస్యలుగా, సమాజం ముందున్న అతి పెద్ద రగులుతున్న సమస్యలుగా చిత్రించడం ప్రారంభించారు. ఇది మనం అంగీకరించినా అంగీకరించక పోయినా చారిత్రిక వాస్తవం. కాని వాస్తవం ఎప్పుడు కఠోరంగా వుంటుంది. పాశ్చాత్య విద్యా సంపర్కంతో నేమి, గాంధీజీ ప్రభోదాలతో నేమి వీరిలో అంతకుముందు ఎన్నడు సహజంగా తలెత్తని ఒక మానవతావాదం, అణగారినవర్గాలపట్ల సహానుభూతి కొత్తగా తలెత్తడం ప్రారంభించాయి. అయితే కవిత్వం అనేది ఒక సహజ కళ. అది ఒకరు నెట్టితే వచ్చేది కాదు. స్వతఃసిడ్డంగా వచ్చేది. అందుకే కవి తన సమాజంతో కృతకంగా సహానుభూతి చెందినపుడు వెలువడిన అసహజ కవిత్వం, సమాజంతో సహజంగా సహానుభూతి చెందినపుడు వెలువడిన సహజ కవిత్వం కన్నా ఎల్లప్పుడూ తక్కువ స్థాయి లోనే వుంటుంది. పైగా అటువంటి అసహజ కవిత్వం పేరుకు పుంఖాను పుంఖాలుగా వెలువడినప్పటికీ సమాజంలో ఏ విధమైన కదలికను గాని, సకారాత్మకమైన మార్పును గాని తీసుకొని రాబోదు. సమాజ ప్రక్షాళనకు దోహదం చేయలేదు.

అందుకే అలనాటి సంఘ సంస్కర్తల కవిత్వం ఆ కవులు పుట్టి పెరిగిన కులాలలోని సమస్యలపై స్పందించినప్పుడు మాత్రం ఆ సమస్య లోతులను హ్రుద్యంగా తాకగలిగింది. ఆ సమస్య ప్రభావాలను మూలాలను ఆర్ధంగా స్పృశించగలిగింది. మానవత్వంతో సహజంగా స్పందించే గుణంతో వారు ఆ బాదితుల పట్ల సహానుభూతి చెందినపుడు పొంగిపొరలిన వారి కరుణరసాత్మక కవిత్వం తర తమ భేదం లేకుండా వర్గాలకతీతంగా అంతే స్థాయిలో అశెష జనావళి హ్రుదయాలను సైతం కదిలించగలిగింది. సంఘసంస్కరణోద్యమానికి నాంది పలికింది. దీనికి విరుద్దంగా అదే కవులు తాము పుట్టి పెరిగిన కులాలలోని సమస్యలపై కాకుండా అంటరానితనం వంటి పరకులాల సమస్యలపై స్పందించినప్పుడు మాత్రం పూర్తి అనుభూతిరాహిత్యంతో పలవరించడంతో ఆయా సమస్యలపై ప్రజలను చైతన్యపరచడంలో, సమాజాన్ని ఉత్తేజపరచడంలో విఫలమై చతికిలబడ్డారు.

మరో వైపు బ్రిటీష్ ప్రభుత్వకాలంలో భారతదేశంలో పలు సాంఘికమార్పులు చోటుచేసుకున్నాయి. అంతవరకు అస్పృశ్యత కారణంగా ప్రధాన స్రవంతి నుండి వెలివేయబడ్డ అణగారిన వర్గాలకు కొత్త సామాజిక పీఠాలు కల్పించబడటం అవి స్ధిరంగా కుదురుకొనడం ప్రారంభమైంది. నాటి బ్రిటీష్ ప్రభుత్వం అండతో నేమి, మిషనరీల ఉత్సాహభరిత సేవాకార్యకలాపాలతో నేమి అస్పృశ్యులు తప్పనిసరైన పరిస్థితులలో ఇతర మతాలను అశ్రయించడం ప్రారంభించారు.గతంలో ఇటువంటి మతమార్పిడులు ప్రధాన స్రవంతికి కొత్త కానప్పటికి శతాబ్ధాలపాటు కొనసాగిన మద్యయుగపు మతమార్పిడిలతో పోలిస్తే, బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా ప్రభుత్వ మద్దతుతో ఒక్క శతాబ్దం పాటు ఉదృతంగా కనివిని ఎరుగని రీతులో కొనసాగిన ఈ తరహా మతమార్పిడిలు నాటి చాందస సమాజాన్ని కుదిపివేసాయి.దాని ఉనికిని, మనుగడను ప్రశ్నార్ధకం చేసింది.అస్పృశ్యులపట్ల సమాజపు దయారహితమైన వైఖిరిని పునరాలోచించుకోనేటట్లు చేసింది. పాలకులు ఎవరైనప్పటికి వేల సంవత్సరాల నుండి చెక్కుచెదరకుండ నిరాఘాటంగా నిలబడివున్న ప్రధాన స్రవంతి బురుజు అస్పృశ్యుల మతమార్పిడిలతో బీటలు వారడంతో అది మరింత ప్రమాదకరపరిస్థితికి దారి తీయకుండా దానిని పునర్నిర్మించుకోవాల్సిన తరుణాన్ని ప్రధాన స్రవంతిలోని కొన్ని వేగుచుక్కలు ముందే పసిగట్టాయి.సమాజపు వైతాళికులు మొద్దునిద్ర నుండి మేల్కొనబడ్డారు.దానితో ప్రధాన స్రవంతిలో అస్పృశ్యుల దుర్గతిపై అంతర్మథనం ప్రారంభమైంది. ఫలితంగా మత మార్పిడిల అంచులలో వున్న అస్పృశ్యులనే కాకుండా ఇతర మతాల వడిలో చేరుకొన్న అస్పృశ్యులను సైతం సముదాయించి తిరిగి ప్రధాన స్రవంతి లోనికి తీసుకొనిరావడం, అసలు సమస్యలకు మూల హేతువులైన తమ చాందస మూఢాచారాలను పరిహరించి మొత్తం ప్రధాన స్రవంతి బురుజుని పునర్నిర్మింపచేసుకోవాల్సిన అవసరం ఆ వేగుచుక్కలకు ఏర్పడింది.

దీనికి తోడు తరువాతి కాలంలో జాతీయోద్యమంలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరతమ భేదం లేకుండా సమాజపు అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకురావాల్సిన, కలుపుకుపోవాల్సిన చారిత్రక అవసరం భారత సమాజానికి కలిగింది. సొంతిల్లుని చక్కదిద్దుకొంటేనేకాని పరాయిపాలనని, పరాయికరణను సమర్దవంతంగా ప్రతిఘటించలేని ఆవశ్యకత లోనికి సమాజం నెట్టివేయబడటానికి బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దోహదం చేసాయి. ఆ విధంగా సొంతిల్లు చక్కదిద్దుకొనే క్రమంలో అణగారిన వర్గాలను కూడా తమతో కలుపుకు పోవాల్సినతరుణంలో వారి సమస్యలను కూడా పట్టించుకోవాల్సినవసరం, వాటిపై సహేతుకంగా దయగా స్పందించాల్సినవసరం నాటి సంఘసంస్కరణోద్యమకారులకు, కవులకు కొత్తగా కలిగింది. దానివలన అప్పటివరకు అస్పృశ్యత అనేది ఒక సమస్యగా సహజంగానే తట్టని వీరికి, చివరకు పాశ్చాత్య విద్యా సంపర్కంతో తమ సామాజికవర్గ పరిధులు దాటి ఆలోచించి అంటరానితనాన్ని ఒక సాంఘికసమస్యగా పరిగణించాల్సినవసరం వచ్చింది. అప్పటివరకు సామజికసమస్యను ఒక సామాజిక అవసరం గానే పరిగణించినవారికి, సమస్యకు కర్మసిద్దాంతకనుగుణంగా భాష్యం చెప్పడమే ఎరిగిన వర్గాలకు ఇక తప్పనిసరై తత్వ్యతిరేకంగా స్పందించి గళమెత్తాల్సివచ్చింది. వారిని అంటుకోవడమే మైలపడ్డట్లుగా భావించిన వర్గాలకు వారితో సహపంక్తి భోజనాలుకు కూర్చొనవలసిన అగత్యం కలిగింది. శతాబ్దాలపాటు దయారహితంగా ఘనీభవించిన హృదయాలతో, కరడుకట్టిన మూడాచారపు కట్టుబాట్లలో కూరుకుపోయిన విష సమాజాన్ని వైతాళికులు నిదురలేపి దయార్దహృదయంతో సమాజాన్ని ఉద్దరించే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ చారిత్రాకావసరంలో భాగంగా తాము అంతకుముందెన్నడూ చవిచూడని, అనుభవించని శతాబ్దాల పాత సమస్యను కొత్తగా ఎరువు తెచ్చుకొన్న మానవత్వపు కళ్ళద్దాలతో కొత్తగా చూసి, అంటరానితనంపై మేల్కొలుపు కవిత్వం పలవరించడం ప్రారంభించారు. అయితే అనుభూతిరాహిత్యంతో, అవగాహనాలేమితో, స్పందన ప్రతిస్పందన కోసమే అన్నట్లుగా అస్పృశ్యతపై కలవరించి పలవరించిన ఆ కవిత్వ స్థాయి ఎలా వుంటుందో ప్రత్యెకంగా చెప్పాల్సినవసరం లేదు. అందుకే ఆస్పృశ్యత లాంటి ఇతర కులాల సమస్యల పట్ల మౌలిక అవగాహన లేమితొ వచ్చిన నాటి కవుల సంఘసంస్కరణోద్యమ కవిత్వం తీరు చిలకపలుకుల్లా అసలు సమస్య ఫైపైనే స్ఫృశిస్తూ, అవసరార్ధం మొక్కుబడిగా మూలగడంతో అసహజంగా తయారయ్యింది. ఫలితంగా అవసరార్ధం వచ్చి, సహానుభూతి లోపించిన ఆ అసహజ కవిత్వం సమాజంలో అంటరానితనం నిర్మూలన లాంటి మౌలిక సామాజిక మార్పుల పట్ల ప్రజలను ఉత్తేజపరచడంలో, మార్పుకి ప్రజలను సంసిద్ధపరచి కార్యోన్ముఖులను చేయడంలో చతికిలబడిపోయింది. అందువల్లనే స్వకులసమస్యాప్రభావాల చిత్రణలో కూరుకుపోయిన వారి కవిత్వం పరకులసమస్యప్రభావాల పట్ల నాటి సంఘంలో విస్తృత స్థాయిలో నూతన ఆలోచనలను రేకెత్తించలేకపోయింది సరికదా కనీసం రాబోయే తరాలకు సైతం ప్రేరణ కలిగించలేకపోయింది. తమ కుల సమస్యాప్రభావాలను ఎంతో ప్రతిభావంతంగా వ్యక్తీకరించిన వీరి కవిత్వ ప్రభ అస్పృశ్యత గురించి మాట్లాడవలసి వచ్చేసరికి నిస్తేజంగా మిగిలిపోయింది. అందువలన అస్పృశ్యత లాంటి ఇతర కులాల సమస్యల పట్ల వారు వెలువరించిన కవిత్వం అచేతనమై చివరకు చరిత్ర పుటల్లో ఒక రిఫరెన్స్ అంశంగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు.

దీనికి విరుద్దంగా ఒక కవి తాను పుట్టి పెరిగిన సామాజికవర్గంతోనే కాక మొత్తం సమాజంతొ సహజంగా మమేకమై తరతమ భేదం లేకుండా బాదితుల పట్ల సహానుభూతి చెందినపుడు, పీడితుల సమస్యల పట్ల నిబద్దతతో సహజంగా ఆక్రోశించినపుడు, ఆ ఉరవడిలో ఆర్తితో ఆర్ధంగా స్పందిస్తూ వెలువరించిన సహజ కవిత్వం అతని వర్గాన్నే కాక మొత్తం సమజాన్నే ఒక కుదుపు కుదిపేస్తుంది. అతని సామాజికవర్గం లోనే కాక మొత్తం సమాజప్రక్షాళనకు బీజం వేస్తుంది. సామాజిక మార్పుకు నాంది పలుకుతుంది. అది ఒక 'గబ్బిలం' కావచ్చు. ఒక 'పూర్ణమ్మ' కావచ్చు. అసలు సమస్యకు కాలదోషం పట్టినా, సమస్య ప్రభావం కనుమరుగైనా చరిత్రలో ఆ సహజకవి సృజన అజరామమై నిలుస్తుంది. తరాలు మారినా, సమస్య మూలాలు చెదిరినా మనలను ఆలోచింపచేస్తుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే కరుణ రసాత్మకమైన గేయం అటువంటి సహజ కవిత్వం నుండి జారువాలిన ఆణిముత్యం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఏది ఏమైనప్పటికీ తమ కులాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్ని అందరి సమస్యగా చిత్రించడమన్నది సంఘ సంస్కరణోద్యమ యుగంలో ఆయా కవులు చేసిన్నప్పటికి, ప్రజలందరూ ఆ సమస్యలను కులాలకతీతంగా సామజిక రుగ్మతలుగానే భావించారు. అటువంటి చారిత్రక, సామాజిక నేపథ్యం నుండి వెలువడిన సుప్రసిద్ధ కరుణ రసాత్మక గేయం పూర్ణమ్మ గేయం. ఒక పూజారింటను పుట్టిన పూర్ణమ్మ అనే బాలిక కన్యాశుల్కం కారణంగా తాత వయసు వున్న వరుడితో బాల్యవివాహమై మూఢాచారానికి బలయిన తీరు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదం మనసున్న ఎవరికైనా కళ్ళను చమర్చేటట్లు చేస్తుంది. కన్యాశుల్కపు విషాద విపరిణామాలను ప్రతిబింబించిన ఈ గేయం 5% బ్రాహ్మణ సామాజికవర్గం యొక్క కులసమస్య ఫలితమైనప్పటికి నాటికి నేటికి ప్రజలు కులసామాజికవర్గాలకు అతీతంగా ఈ విషాద కరుణ రసాత్మక గేయ స్ఫూర్తిని ఆర్దంగా మనస్సుల్లో నిలుపుకొన్నారు. కన్యాశుల్క తదనంతర పరిణామాలను (బలవన్మరణం పొందడం లేదా విధవా పునర్వివాహం లేకుండా కన్య గానే మిగిలిపోవడం) కేవలం బ్రాహ్మణ కులసమస్యగానే చూడక అలనాటి ప్రజలందరూ దీనిని ఒక సామజిక సమస్యగా విశాలదృక్పధంతో 100 శాతం సామజిక జాడ్యంగా పరిగణించారు.

గేయం పూర్తి పాఠం[4]

మార్చు

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా ఈ కథను ?

ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?

కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.

ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో
కిలకిల పలికెను కీరములు.

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.

"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.

ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

పూర్తి పాఠం

మార్చు
  • ఇక్కడ s:పూర్ణమ్మ పూర్తి పాఠం వికీసోర్సులో చూడండి.

మూలాలు

మార్చు
  1. "Books and products with tag name: Puttadi bomma poornamma". Archived from the original on 2015-05-05. Retrieved 2015-07-18.
  2. "నవ్యంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ". వి.కొండలరావు,శ్రీకాకుళం జిల్లా. సాక్షి. Retrieved 30 November 2014.
  3. "Fitting tribute to Gurajada". RANEE KUMAR. The Hindu. Retrieved 27 September 2012.
  4. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయం

ఇతర లింకులు

మార్చు