పూజ (2014 సినిమా)

2014 సినిమా

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ స్వీయనిర్మాణంలో హరి దర్శకత్వం వహించిన తెలుగు అనువాద సినిమా "పూజ". దీని మాతృక పూజై అనే తమిళ్ సినిమా. ఇందులో విశాల్, శ్రుతి హాసన్ జంటగా నటించగా సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ ముఖ్యపాత్రల్లో నటించారు. నటి, గాయని ఆండ్రియా జెరెమియా ఐటెం పాటలో నర్తించింది.

పూజ
దర్శకత్వంహరి
రచనహరి, శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్, శ్రుతి హాసన్, సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ
ఛాయాగ్రహణంప్రియన్
కూర్పువి. టి. విజయన్ - జై
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
అక్టోబర్ 22, 2014
భాషతమిళ

యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2014 అక్టోబరు 22న విడుదలయ్యింది.

కథ మార్చు

ఈ సినిమా కథ బొబ్బిలి ప్రాంతంలో మొదలవుతుంది. చిన్నప్పుడే బొబ్బిలి నుంచి పారిపోయి బీహార్ లో గుండాగా దందాలు చేసి మళ్ళీ బొబ్బిలి తిరిగి వచ్చిన సింగన్న పాత్రుడు (ముఖేష్ అద్వానీ) బొబ్బిలిలో అన్నం ఫైనాన్స్ కంపెనీని పెట్టి దాని ముసుగులో కాంట్రాక్ట్ మర్డర్స్ చేస్తుంటాడు. అదే ఊరిలో ఓ మార్కెట్ యార్డులో వాసు (విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కలిసిన దివ్య (శ్రుతి హాసన్)తో వాసు ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వచ్చిన ఎస్.పి శివరాం నాయక్ (సత్యరాజ్)ని సింగన్న చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాసు శివరాం నాయక్ ని కాపాడతాడు.

అదే సమయంలో ఓ కారణంగా సింగన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన గికే గ్రూప్ కంపెనీ యజమానులైన ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. కానీ అదే కుటుంబానికి చెందిన వాసు తనవాళ్ళు ఆపదలో ఉన్నారని తెలియడంతో రంగంలోకి దిగుతాడు. ఏ కారణం చేత సింగన్న వాసు కుటుంబాన్ని చంపాలనుకుంటాడు ? తనకంటూ ఓ కుటుంబం ఉన్నా వాసు వారందరికీ ఎందుకు దూరంగా ఉన్నాడు ? శివరాంతో చేతులు కలిపిన వాసు తన వైరి కుటుంబానికి చెందినవాడని సింగన్న తెలుసుకున్నాక ఏం చేసాడు ? అనేది మిగిలిన కథ.

తారాగణం మార్చు

  • విశాల్ - వాసు
  • శ్రుతి హాసన్ - దివ్య
  • సత్యరాజ్ - ఎస్.పి శివరాం నాయక్
  • రాధిక శరత్‌కుమార్ - వాసు తల్లి
  • ముఖేష్ తివారీ - సింగన్న పాత్రుడు
  • సూరి - వాసు స్నేహితుడు
  • ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం

సంగీతం మార్చు

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ 2014 అక్టోబరు 5న హైదరాబాద్‌లో జరిగింది. శ్రుతి హాసన్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో నితిన్‌ తొలి సీడీని స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని నితిన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌గౌడ్‌, విశాల్‌ సోదరుడు విక్రమ్‌కృష్ణ, శరత్‌మరార్‌, సందీప్‌ కిషన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వడ్డి రామానుజం, నవీన్‌చంద్ర, మాధవీలత, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు.[1] విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.[2]

విమర్శకుల స్పందన మార్చు

పూజ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనను రాబట్టింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘భరణి’ తర్వాత విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘పూజ’ సినిమా కూడా కేవలం మాస్ ప్రేక్షకులని మాత్రమే టార్గెట్ చేసి చేసిన సినిమా. నటీనటుల పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్, కొన్ని చోట్ల ఆడియన్స్ ని పరిగెత్తించే ఎపిసోడ్స్ చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ అయితే, ఊహాజనిత సెకండాఫ్, నో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, విలనిజంని ఎలివేట్ చేయకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.75/5 రేటింగ్ ఇచ్చారు.[3] వెబ్ దునియా తమ సమీక్షలో "మాస్‌ ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథను రాసుకుని దర్శకుడు తెరకెక్కించేశాడు. ఇలాంటి కథలు బోలెడు వచ్చినా హరి స్పీడ్‌ స్క్రీన్‌ప్లేతో మాస్‌ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా ఇది" అని వ్యాఖ్యానించారు.[4] వన్ఇండియా తమ సమీక్షలో "మన తెలుగులోనే కాదు...ప్రక్క రాష్ట్రాలలోనూ పరమ రొటీన్ చిత్రాలే వస్తున్నాయని..మనం వారిని చూసి భాధపడక్కర్లేదని ఈ చిత్రం మరో మారు ప్రూవ్ చేస్తుంది. ఇక కథ,కథనం వంటి వాటికి సంభంధం లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ని చూసి ఇష్టపడే వారు ఈ పూజ చేసుకోవచ్చు. ఫలితం దక్కుతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చారు.[5]

మూలాలు మార్చు

  1. "'ఏడేళ్ల తర్వాత హరి దర్శకత్వంలో నటించా'". ఆంధ్రజ్యోతి. October 6, 2014. Retrieved October 23, 2014.[permanent dead link]
  2. "ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్". సాక్షి. October 6, 2014. Archived from the original on 2016-03-06. Retrieved October 23, 2014.
  3. "సమీక్ష : పూజ – మాస్ ప్రేక్షకులకి మాత్రమే ఇది 'పూజ'.!". 123తెలుగు.కామ్. October 22, 2014. Archived from the original on 2014-10-23. Retrieved October 23, 2014.
  4. "విశాల్, శ్రుతి హాసన్ లకు 'పూజ' దీపావళి వెలుగులను ఇస్తుందా... రివ్యూ రిపోర్ట్". వెబ్ దునియా. October 22, 2014. Archived from the original on 2014-10-28. Retrieved October 23, 2014.
  5. "ఫలించని మాస్ 'పూజ' (రివ్యూ)". వన్ఇండియా. October 22, 2014. Archived from the original on 2014-10-25. Retrieved October 23, 2014.