పూర్ణ కాశ్యపుడు

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో పూర్ణ కాశ్యపుడు ఒకడు. బౌద్ద గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో మొదటి వాడు. ఇతను గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు. ఇతను అక్రియా వాదాన్ని ప్రచారం చేసాడు.

బోధి ధర్మానికి చిహ్నం - ధర్మచక్రం

ఆధార గ్రంధాలు మార్చు

ప్రాచీన భారతీయ భౌతికవాదులలో ఒకడైన పూర్ణ కాశ్యపుడు బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా, వైదిక మత విశ్వాసాలను తిరస్కరిస్తూ భౌతికవాదాన్ని ప్రజలలో తీసుకు వెళ్ళడంలో ప్రముఖమైన పాత్ర వహించాడు. అయితే ఇతనిపై దాడి తాత్వికంగాను భోతికంగాను రెండువైపులనుంచి జరగటంతో పూర్ణ కాశ్యపుని చరిత్ర, బోధించిన భౌతికవాద సూత్రాలు స్పష్టంగా లభించలేదు. మూల ఆధారగ్రంధాలు ధ్వంసమై పోయాయి. ఒకవేళ అవి వుండి వున్నప్పటికీ వాటిని తీవ్రంగా నిరసించిన జైనులు, బౌద్ధులు వాటిని నాశనం చేసి వుండవచ్చు. అసలు మనకు పూర్ణ కాశ్యపుని గురించి తెలిసినది, అతనిని విమర్శిస్తూ జైనులు, బౌద్ధులు తమ తమ గ్రంథాలలో ఉటంకించిన వ్యాఖ్యలు, కథనాల నుండి మాత్రమే. ఈ ఉటంకలు కూడా పూర్ణ కాశ్యపుని భౌతికవాద బోధనల గురించి యదార్ధంగా చెప్పినవి కావు. అతనిని అపతిష్టపాలు చేయడానికి అతనిపై ద్వేషం, అసహ్యం కలిగించే ప్రయత్నంలో అతని భౌతికవాద బోధనలను వక్రీకరిస్తూ నిందిస్తూ జైన, బౌద్ద మతాల రచయితలు తమ గ్రంథాలలో రాసుకొన్న ఉటంకనలు మాత్రమే. పూర్ణ కాశ్యపుని మతం గురించి వివరాలు తెలుసుకోవడానికి సైతం, ఆ మతాన్ని ద్వేషిస్తూ, వక్రీకరిస్తూ, అవహేళన చేస్తూ వచ్చిన ఇతర మతగ్రంధాల ఉల్లేఖనలే దిక్కయ్యేంతగా పూర్ణ కాశ్యపునికి తత్వబొదనలకు సంబంధించిన మూల ఆధార గ్రంథాలు ధ్వంసం చేయబడ్డాయి.

పూర్ణ కాశ్యపుని గురించి అతని తాత్విక ధోరణి గురించి ఉటంకించిన కథనాలు, వ్యాఖ్యలు బౌద్ద గ్రంథం 'దిఘ నికాయ', బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” తదితర బౌద్ద, జైన మత గ్రంథాలలో లభిస్తాయి.

ప్రారంభ జీవితం మార్చు

పూర్ణ కాశ్యపుని పూరణ కాశ్శప, పూరణ కాశ్యపునిగా  జైన బౌద్ద గంధాలు పేర్కొన్నాయి. ఇతని వ్యక్తిగత విషయాలు, బోధనలు గురించిన మూల ఆధార గ్రంథాలు లభ్యం కాలేదు. పేరును బట్టి బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నప్పటికీ ఇతను ఒక గృహబానిస. బొద్ద తత్వవేత్త బుద్ధఘోషుడు తన “సుమంగళ విలాసిని”లో ఇతన్నిచులకనగా చేస్తూ పూర్వాశ్రమంలో ఇతను గృహబానిస అని, ఇతని పుట్టకతో యజమానికి చెందిన బానిసల సంఖ్య వందకు కావడంతో పూర్ణ అనే పేరు సంక్రమించినదని, తన యజమాని ఇంటినుండి పారిపోయాడని, దారిలో దొంగలు ఇతడిని నిలువు దోపిడీ చేసి కట్టు బట్టలను సైతం దోచుకొని నగ్నంగా వదిలేసారని, ఆప్పటి నుంచి దిగంబరంగానే సంచరించాడని అపహాస్యం చేస్తూ పేర్కొన్నాడు. చివరకు పూర్ణ కాశ్యపుడు దుఖంతో నిరాశతో ఒక చెరువులో దూకి ఆత్మహాత్య చేసుకోన్నాడని పేర్కొన్నాడు.

పూర్ణ కాశ్యపుని బోదనలు మార్చు

పూర్ణ కాశ్యపుడు ఇతర భౌతికవాద తత్వవేత్తల వలె గంగ మైదాన ప్రాంతాలలో దిగంబరంగా పర్యటిస్తూ అక్రియా వాదాన్ని ప్రతిపాదిస్తూ, ప్రజలలో వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతికవాద సూత్రాలను ప్రచారం చేసాడు.

పూర్ణ కాశ్యపుని తాత్విక దృష్టిలో యజ్న యాగాదులు, కర్మ కాండలు అర్ధరహితమైనవి.అసంబద్దమైనవి. అయితే ఆ నాడు యజ్న యాగాదులను నిరసించడం అంటే వేదం ప్రామాణ్యాన్నినిరాకరించడమే. పూర్ణ కాశ్యపుడు ఆ సాహసానికి ఒడిగట్టినందుకు అతనిని మతదూరుడిగా (Antinomian) పరిగణించారు. అతని దృష్టిలో పాప పుణ్యాలు లేవు. స్వర్గ నరకాలు లేవు. దాన ధర్మాలు చేసినా, ఇంద్రియ నిగ్రహం పాటించినా, సత్యవ్రతాన్ని పాటించినా అతనికి పుణ్యం రాదు. అలాగే ఇతరులను హింసించినా, వధించినా, దొంగతనం చేసినా, అబద్దాలాడినా, పరస్రీని కామించినా పాపం అంటదు అని బోధించినట్లు బౌద్ద గ్రంథం 'దిఘ నికాయ' వక్రీకరిస్తూ పేర్కొంది. మంచి పనికి చెడు పనికి తేడా లేకుండా బోదిస్తున్నాడని అరాచక వాదిగా ముద్ర వేసారు.

పూర్ణ కాశ్యపుడు అక్రియావాది. అంటే ఆత్మ అకర్త. దానికి కర్మ ఫలం అంటదు. అంటే. చేసిన కర్మ ఫలితం ఆత్మకు అంటదు అన్నది ఇతని సిద్ధాంతం. ఏ పనిచేసినా దాని ఫలితం ఆత్మకు దక్కదు. అంతే తప్ప మంచి పనికి చెడ్డ పనికి తేడా లేదని చెప్పి ఉండడని భావిస్తారు. ఆ నాటి భావవాదానికి చెందిన వైదిక వ్యవస్థతో ఘర్షణ పడుతున్నప్పుడు ఆ వైదిక కాలానికన్నా ఎంతో ముందు ఆలోచనలను గల భౌతికవాదుల బోధనలకు పట్టిన గతే ఇతని బోధనలకు కూడా పట్టింది. ఇతని బోధనల అసలు వాస్తవ రూపాన్ని కనిపించనంతగా ఇతని బోధనలు కూడా వక్రీకరణలకు లోనయ్యాయి అని తెలుస్తుంది.

 మూలాలు మార్చు

  • History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L. Basham
  • The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
  • భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
  • ప్రాచీన భారతంలో చార్వాకం –సి.వి.