షడ్దర్శనాలలో ఐదవది మీమాంసా దర్శనం. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని వివరిస్తుంది కనుక దీనికి పూర్వమీమాంస అని పేరు వచ్చింది. కాగా, జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని (ఉపనిషత్తులను) వివరిస్తుంది కనుక బ్రహ్మసూత్ర దర్శనానికి ఉత్తరమీమాంస అని పేరు వచ్చింది. మీమాంస అంటే వివేచించడం, వితర్కించడం, విచికిత్స చేయడం.

పూర్వమీమాంసా కర్త జైమిని. ఇతడు భారతాన్ని కూడా వ్రాశాడు. దీనిని జైమిని భారతం అంటారు. జైమిని సూత్రాలు కర్మకాండను, యజ్ఞ యాగాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ముఖ్యోద్ధేశ్యంగా రచించబడ్డాయని ఒక అభిప్రాయం. మీమాంసా దర్శనములో 2500 సూత్రాలున్నాయి. ఇవి 12 అధ్యాయాలుగా, 60 పాదాలుగా ఉన్నాయి.

"అథాతో ధర్మజిజ్ఞాసా" అని జైమిని పూర్వమీమాంసా సూత్రాలు ప్రారంభమవుతాయి. అంటే "ఇప్పుడు ధర్మాన్ని గురించి వివేచన చేద్దాము" అని అర్థం. పూర్వమీమాంస ధర్మోద్ధరణకు ఉద్దేశించిన దర్శనం. ధర్మం అంటే వేదధర్మం. అంటే యజ్ఞయాగాది కర్మకాండ. అందుచేత దీనికి కర్మ మీమాంస, ధర్మ మీమాంస అనే పేర్లు కూడా ఉన్నాయి.

యజ్ఞ కర్మకాండకు ఆధారం బ్రాహ్మణాలు. ఏ యజ్ఞాలను ఏ విధంగా చేయాలి, ఏ కర్మలను ఏ క్రమంలో చేయాలి మొదలైన అనేక విషయాలపై సందేహాలు బయలుదేరినప్పుడు వాటిపై వివిధ సందర్భాలలో చర్చలు జరిగేవి. ఆ చర్చలపై ఆధారపడి వాటి సారాంశాన్ని సూత్రాల రూపంలో మీమాంస దర్శనంగా జైమిని క్రోడీకరించాడు.

మూలాలు

మార్చు