పెంచికల బసిరెడ్డి
పెంచికల బసిరెడ్డి (జ.1907, జూన్ 1[1] - మ. 1977, ఏప్రిల్ 27), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి, శాసనసభ్యుడు. కడప జిల్లా తొలి జిల్లా పరిషత్తు అధ్యక్షుడు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి 1955, 1967, 1972 మూడు పర్యాయాలు, శాసనసభకు ఎన్నికయ్యాడు. పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశాడు.
బసిరెడ్డి, 1907, జూన్ 1న కడప జిల్లా, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామంలో జన్మించాడు.[2] ప్రముఖ సినీ దర్శకుడు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఈ గ్రామానికి చెందిన వాడే.[3] ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, జిల్లా బోర్డులో క్లర్కుగా పనిచేశాడు. ఆక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే, న్యాయశాస్త్రంలో పట్టబధ్రుడై, జిల్లాలో ప్రసిద్ధ క్రిమినల్ లాయరుగా ఎదిగాడు. 1938 నుండి 1941 వరకు కడప జిల్లా బోర్డుకు కార్యదర్శిగా పనిచేశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1946లో జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికై, మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగాడు. 1951లో కడప జిల్లా నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యాడు. 1952లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] 1956లో కడప జిల్లా పరిషత్తు ఏర్పడినప్పుడు ఎకగ్రీవంగా జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమాభివృద్ధి సంస్థ ఏర్పడినప్పుడు, ఆ సంస్థ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత విశాఖపట్నంలోని భారత్ హెవీ ప్లేట్స్ వెసల్స్ లిమిటెడుకు చైర్మన్‌గా పనిచేశాడు.[5][2]
బసిరెడ్డి 1971లో పి.వి.నరసింహారావు మంత్రి వర్గంలో న్యాయశాఖా మంత్రిగా పనిచేశాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించాడు.[6] తొలుత ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని సమర్ధించి, పి.వి.నరసింహారావుకు వ్యతిరేకంగా ధర్నాచేసిన బసిరెడ్డి, ఆ తర్వాత కాలంలో తన మనసు మార్చుకొని, ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించి, రాష్ట్ర సమైక్యతను కాపాడాడు.[4] ఆ తరువాత జలగం వెంగళరావు మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశాడు. కానీ ఈయన స్వతంత్ర వ్యక్తిత్వంతో, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.[7] ఆ తర్వాత కాంగ్రేసు పార్టీకి రాజీనామా చేసి, జనతా పార్టీలో చేరాడు. 1977లో జనతా పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యాడు. జనతా పార్టీ నాయకులు శాసనసభా పక్ష నాయకుడిగా ఉండమని కోరడంతో ఆ బాధ్యతను స్వీకరించాడు.[4]
బసిరెడ్డి, 1977 ఏప్రిల్ 27న కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో హృద్రోగం వల్ల మరణించాడు. ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన మృతదేహానికి కడపలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.[8] కడప జిల్లాలో చిత్రావతి నదిపై నిర్మించిన బాలెన్సింగు రిజర్వాయరుకు ఈయన స్మారకార్ధం పెంచికల బసిరెడ్డి జలాశయంగా నామకరణం చేశారు.
మూలాలు
మార్చు- ↑ "రాష్ట్ర మాజీమంత్రి శ్రీ బసిరెడ్డి కాలధర్మం" (PDF). ఆంధ్రప్రభ. No. 1977 ఏప్రిల్ 28. p. 1. Retrieved 28 November 2017.[permanent dead link]
- ↑ 2.0 2.1 "జనతా ఫ్రంట్ నాయకుడు బసిరెడ్డి హఠాన్మరణం" (PDF). ఆంధ్రభూమి. No. 1977 ఏప్రిల్ 28. p. 1. Retrieved 28 November 2017.[permanent dead link]
- ↑ నర్రెడ్డి, తులసిరెడ్డి. "వినోద విజ్ఞానాల కృషీవలుడు". ఆంధ్రజ్యోతి. No. 25-02-2017. Retrieved 28 November 2017.[permanent dead link]
- ↑ 4.0 4.1 4.2 AP Assembly Archives - AP Legislature (PDF). Hyderabad: Government of Andhra Pradesh. 20 June 1977. Archived from the original (PDF) on 19 ఆగస్టు 2017.
- ↑ "Kiran unveils Basi Reddy's statue". The Hindu. No. April 23, 2012. Retrieved 27 November 2017.
- ↑ Nadendla, Bhaskar Rao (2008). Walking with Destiny. Andhra Pradesh, India. p. 41.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ Narisetti, Innaiah (2009). Political History of Andhra Pradesh :1909-2009 (PDF). Center for Inquiry India. p. 101. Archived from the original (PDF) on 16 మే 2013.
- ↑ "బసిరెడ్డి మృతి" (PDF). ఆంధ్రభూమి. No. 1977 ఏప్రిల్ 28. p. 4. Retrieved 28 November 2017.[permanent dead link]