పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు కథల పుస్తకం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు పెద్దిభొట్ల సుబ్బరామయ్య వ్రాసిన మధ్యతరగతి ప్రజల జీవితాలు, కుటుంబాల పరిస్థితికి అద్ధం పట్టే కథా సంకలనం. ఈ కథా సంకలనాన్ని రెండు సంపుటాలురా ఆయన వ్రాసారు. అందులో మొదటి సంపుటి కథల సంకలన విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును గెలుచుకున్నది.[1][2].[3] [4]

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు
Peddibotla sitharamayya kathalu-1.jpg
"పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: పెద్దిభొట్ల సుబ్బరామయ్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: మధ్యతరగతి ప్రజల జీవితాలు, కుటుంబాల పరిస్థితికి అద్ధం పట్టే కథా సంకలనం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 2010
పేజీలు: 352

కథావస్తువుసవరించు

ప్రతి కథలోనూ జీవిత మధుర ఫలాలు చేతికందే లోపున చేజార్చుకున్న నిర్భాగ్యులూ, చేతికి అందకుండానే కాలాన్ని దాటిన అభాగ్యులూ, మనసుండి నలిగిపోయే మనుషులూ, కాలచక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ, వీళ్ళే అడుగడుగునా పలకరిస్తారు మనల్ని. ఈ కథల్లో మృత్యువు తరచుగా కనిపిస్తున్నా, మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు, ప్రవర్తించని సహజ ఘటనలూ కథల్లో చోటు చేసుకుని ప్రతి కథా ఆసాంతం చదివేలా ఉంటాయి. రచయిత వ్యక్తి గత జీవితంలో అలవోగ్గా ఎదురయ్యే రోజువారీ సంఘటనలే ఆయన చేతిలో పడి అద్భుతమైన శిల్పంతో మెరికల్లాంటి కథలుగా తయారై పాఠకుల ముందుకు వచ్చి ఉంటాయన్న అనుభూతి కల్గుతుంది.[5]

రచయిత గురించిసవరించు

పెద్దిభొట్ల సాంఘీకంగా అగ్రకులజీవి. వర్గపరంగా మధ్యతరగతికి చెందినవారు. భావజాలపరంగా అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలించడం అభ్యుదయ రచయిత కర్తవ్యం. పెద్దిభొట్ల ఈ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ఆయన అభ్యుదయ చింతనతో తనకు తెలిసిన మధ్యతరగతి జీవితంతోపాటు, బాధ్యతాయుతంగా తాను పరిశీలించిన క్రింది తరగతి జీవితాలను కూడా కథలుగా మలిచారు. ఆయన కథలు గుంటూరు, విజయవాడల మధ్య జరుగుతుంటాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ ఆర్థిక రాజకీయ పరిస్ధితులు ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. భూస్వామ్య, పెట్టుబడిదారీ విలువల మధ్య చిక్కుకున్న మధ్యతరగతి ఆయన కథలలో వాస్తవికంగా దర్శనమిస్తుంది. మానవ సంబంధాలను నియంత్రించే ఆర్థికాంశం ఆయన కథలలో స్వస్వరూపంతో కనిపిస్తుంది.[6]

విశేషాలుసవరించు

నీళ్ళు కథలో కథానాయకుడు నీటిలోనే ప్రమాద వశాత్తూ మునిగి మరణించినపుడు గుండె జలదరిస్తుంది. ఆ తర్వాత ముసురు కథలో కిరసనాయిలు తాగి ప్రాణం పోగొట్టుకున్న సింగార వేలు, నిప్పు కోడి కథలో తిండికి అలమటించి దిక్కు లేని చావు చచ్చే రామ కోటి, పూర్ణాహుతిలో రోడ్డు దాటుతూ దుర్మరణం పాలయ్యే రామేశం, కళ్ళ జోడు కథలో హటాత్తుగా గుండె పోటు పాలై మరణించే అవధాని, సతీ సావిత్రి కథలో పొట్ట కూటి కోసం సావిత్రి ఎవరితోనో గడపడానికి వెళ్తే పాలకు అలమటించి గొంతెండి ప్రాణాలు వదిలే పసి పాప, ఆకలి నొప్పితో విలవిల లాడి ఒకానొక వర్షపు వేళ కన్ను మూసే పీనుగలు మోసే కనకయ్య, పాటలు పాడి పాడి గొంతు కాన్సర్ తో దీన స్థితితో పోయే పంకజ వల్లి... వీళ్లందరి మరణాలు కథలు చదువుతున్న కొద్దీ ప్రతి కథకూ గుండెను కలచి వేస్తూనే….చావుని సైతం మౌనంగా అంగీకరిచగల స్థితికి పాఠకుడిని చేరుస్తాయి.

చిన్నమ్మ నవ్విందిలో పేదరికం వల్లనే అయినా అవిటి కూతురు పట్ల చిన్నమ్మ ప్రవర్తించే తీరూ, నాలుగు రాళ్ళు సంపాదించడానికి అదే చిన్నమ్మకు దేవుడిలా వచ్చి సహాయ పడే మాష్టారూ, “ముసురు” కథలో భర్తను పోగొట్టుకుని దీన స్థితిలో ఉన్న పెరియ నాయకిని, నలుగురి ఎద్దేవా మాటలూ భరిస్తూ ఆమె తరఫు వారొచ్చే దాకా కాపాడే వ్యక్తి, తనకే మింగ మెతుకులేని స్థితిలో మరొక వ్యక్తికి ఉన్నంతలోనే మందులిప్పించి సేవలు చేసే కామేశం (పూర్ణాహుతి), తను చేసేది చిన్న పనే అయినా తల్లీ బిడ్డల్ని ఆదుకునే సహాయ రాజు, వీధి పాపగా పెరిగి, మరో వీధి పాపకు జన్మనిచ్చి నదిలో మునిగిపోయే కామాక్షి……వీళ్ళంతా మనసులో చేరి ఆ పైన మెదడుని ఆక్రమించి ఆలోచనల్ని సాగు చేస్తూ ఉండిపోతారు.

మూలాలుసవరించు

  1. "Sahitya Akademi Award for Vijayawada writer". The Hindu. 2012-12-25. Retrieved 2013-08-16.
  2. పెద్దిబొట్లకు సాహిత్య అవార్డు December 21, 2012[permanent dead link]
  3. "Sahitya Akademi Awards for 24". The Hindu. 2012-12-21. Retrieved 2013-08-16.
  4. "Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012" (PDF). Sahitya-akademi.gov.in. Archived from the original (PDF) on 2013-01-24. Retrieved 2013-08-16.
  5. ఈ కథల్లో కన్నీరు అంటే కరుణ! -సుజాత ఫిబ్రవరి 2013
  6. "Peddibhotla Subbaramaiah Kathalu - పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు". Archived from the original on 2016-06-05. Retrieved 2016-02-11.

ఇతర లింకులుసవరించు