రాణి సాయపనేని గోవిందమాంబా దేవి

(పెమ్మసాని గోవిందమ్మ నుండి దారిమార్పు చెందింది)

పెమ్మసాని గోవిందమ్మ గండికోటను పాలించిన చివరి పాలకుడు చిన తిమ్మానాయుని సోదరి. గండికోట సంరక్షణకై గోలకొండ సర్దారు మీర్ జుంలా సైన్యముతో తలపడి వీరవిహారము చేసి అబ్దుల్ నబీ అను సేనాధిపతిని వధించి అసువులు బాసిన వీర వనిత. దూపాటిసీమని పాలిస్తున్న సాయపనేని నరసింహనాయుని భార్య. సాయపనేని నర్సింహా నాయుడికి ఒక యుద్ధంలో సంభవించిన అంగ వైకల్యం వల్ల గొవిందమ్మ కొంత కాలం రాజ్యపాలన చేసింది.గోవిందమ్మ పెమ్మసాని వంశంలో జన్మించింది. గొవిందమ్మ పాలన అమోగం. ఈమె తన పేరిట గొవిందమ్మపేట అనే పట్టణం నిర్మించారు.

గండికోట

మార్చు

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంటుంది.

చిన తిమ్మానాయుడు

మార్చు

గండికోట రాజుల పరంపరలో చివరి వాడు చిన తిమ్మానాయుడు. మహా యోధుడు. ఈతని చెల్లెలు గోవిందమ్మ. విజయనగర రాజులకు సామంతులుగా నున్న శాయపనేని నాయకులు వంశమునకు చెందిన నరసింహ నాయుడు గోవిందమ్మ భర్త.

యుద్ధము

మార్చు

మీర్ జుంలా అను పారశీకుడు గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో సా.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. పలు దినములుగా భీకర యుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు.

పోరాటము

మార్చు

చిన తిమ్మానాయుని చెల్లెలు గోవిందమ్మ సతీసహగమనము చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరిస్తుంది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేస్తారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషము ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తించింది[1].

గండికోట సంరక్షణకై కత్తిబట్టి వీరోచితముగా పోరాడి అసువులు బాసిన వీర వనిత గోవిందమ్మ. తెలుగు చరిత్ర పుటల కెక్కని అభాగ్యురాలు కూడా.

మూలాలు

మార్చు
  1. గండికోట యుద్ధం, కొసరాజు రాఘవయ్య, 1977, కమ్మజన సేవాసమితి, గుంటూరు