నాగావళి నది దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తరతీరాంధ్రలోని ముఖ్యనది. ఒరిస్సా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది. శ్రీకాకుళం పట్టణము ఈ నదీ తీరమునే ఉన్నది.

నాగావళి నది ఒరిస్సా రాష్ట్రము, కలహంది జిల్లాలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తున్న తూర్పు కనుమలలో ప్రారంభమవుతుంది. ఈ నది మొత్తము 256 కిలోమీటర్లు సముద్రానికి ప్రవహిస్తుంది. అందులో 161 కిలోమీటర్లు ఒరిస్సా రాష్ట్రములో, 2 కిలోమీటర్లు ఒరిస్సా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుపై మరియు దాదాపు 93 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రవహిస్తుంది.

బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ మరియు వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు. నది యొక్క మొత్తము పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ అందులో 4,462 చ.కి.మీలు ఒరిస్సా రాష్ట్రములో (1006 చ.కి.మీలు కలహంది జిల్లాలో మరియు 3,456 చ.కి.మీలు కోరాపుట్ జిల్లాలో) మరియు 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో (1,789 చ.కి.మీలు శ్రీకాకుళం, 3,096 చ.కి.మీలు విజయనగరం జిల్లా మరియు 63 చ.కి.మీలు విశాఖపట్నం జిల్లాలో) ఉన్నది.

నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలు మరియు నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగావళి&oldid=328429" నుండి వెలికితీశారు