ప్రభాకర్ జైని
ప్రభాకర్ జైని ప్రముఖ సాహితీకారుడు, సినీ దర్శకుడు.
ప్రభాకర్ జైని | |
---|---|
జననం | సెప్టెంబర్ 1,1955 వరంగల్ |
ప్రసిద్ధి | సాహితీకారుడు, సినీ దర్శకుడు |
మతం | హిందూ |
భాగస్వాములు | విజయలక్ష్మి |
పిల్లలు | స్రవంతి, చైతన్య, ఆకాశ్ |
తండ్రి | లక్ష్మీనారాయణ |
తల్లి | శకుంతల |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుప్రభాకర్ జైని లక్ష్మీనారాయణ, శకుంతల దంపతులకు 1955,సెప్టెంబర్ 1న వరంగల్ లో జన్మించారు.ఆయన బ్యాలం ఎక్కువగా జనగామలో గడిచింది. చిన్నతనంలో సెలవులు వస్తే రెక్కలు కట్టుకుని జనగామలో వాలిపోయే వారు. ప్రభాకర్ జైని తండ్రిది మొదటగా నల్గొండ జిల్లా. రజాకార్ల దాడుల వల్ల సర్వం కోల్పోయిన ఆయన పొట్ట చేతపట్టుకుని వరంగల్‌కు వలస వచ్చారు. చిన్నతనంలోనే నాన్నను పోగొట్టుకోవడంతో తల్లి, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలి బాధ్యతలను ప్రభాకర్ స్వీకరించాడు.
వివాహం, ఉద్యోగం
మార్చు1977, మార్చి 30న విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు (స్రవంతి, చైతన్య, ఆకాశ్) ఉన్నారు. ప్రభాకర్ జైని తన తండ్రి మరణించిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా వరంగల్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా చేరారు. అనంతరం యూకో బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత వాణిజ్య పన్నుల శాఖలో సీటీవోగా పనిచేస్తూ 2014లో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
రచనా వ్యాసంగం
మార్చుచిన్నతనంలో ప్రభాకర్ జైని చూసిన సంఘటనలు, చవిచూసిన అనుభవాలే ఆయనను రచయిత, దర్శకుడి మారడానికి ఉపకరించాయి. మొదటి నుంచి రచనారంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ, 1981లో ఆయన మొదటి కథ ‘ఎదను ధర్మం’ ప్రచురితమైంది. 1989లో దాదాపుగా ఆయన ఆత్మకథను పోలి ఉండే ‘కాలవాహిని అలల వాలున’ అనే నవలను రాశారు. ఐఏఎస్‌కు ఎంపికైన ఓ పేద విద్యార్థి నేపథ్యాన్ని ఇందులో చిత్రీకరించారు. అప్పట్లో అది ఓ వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. 1992లో రజాకార్ల ఉద్యమ నేపథ్యంతో ‘గమ్యం’, షేర్ మార్కెట్ నేపథ్యంతో 1994లో ‘చోర్ బజార్’, 2007లో దుబాయ్, పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి నకిలీ కరెన్సీ సరఫరా అవుతున్న విధానాన్ని ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ అనే నవలగా రాశారు. ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ నవల కన్నడంలోకి సైతం అనువాదమైంది. 2014లో సినిమాకు సంబంధించి 24 కళలను దర్శకుని కోణం నుంచి తెలిపేలా ‘నా సినిమా సెన్సారైపోయింది’ అనే నవల రాశారు. ఇదే నవల ఆంగ్లంలో ‘ఐ గాట్ యూ’ పేరుతో ప్రచురితమైంది. 2015లో జీవితం - ఓటమి=గెలుపేనా?, సినీ పరిశ్రమలో ఉండే ఇబ్బందులు, బాధలను నేపథ్యంగా ఈ ఏడాది ‘సినీవాలి’ నవల రాశారు. ఈ నవలలన్నీ విశేష పాఠకాదరణ పొందాయి. ప్రస్తుతం ‘లాకర్ నంబర్ 369’ అనే నవలను రాస్తున్నారు. తన బాల్యంలో జనగామలో కోటీశ్వరుడిగా బతికిన తనకు మామయ్య వరసయ్యే వ్యక్తి జీవిత చరమాంకంలో దీనస్థితిని నేపథ్యంగా చేసుకుని 2016లో ‘మీల్స్ టికెట్’ కథను రాశారు. 2002లో రజని-కుందుర్తి పురస్కారాన్ని సైతం పొందారు.సుమారుగా 50 వరకు కథలు ఆంధ్ర ప్రభ, జ్యోతి, నవ్య, ఇండియా టుడే వంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
సినీ ప్రస్థానం
మార్చుసాహిత్యంలో తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనంతరం సినిమా రంగంపై దృష్టి సారించారు. తెలుగు చిత్రపరిశ్రమకు జాతీయ స్థాయి అవార్డు సాధించిపెట్టడమే ధ్యేయంగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రభాకర్ ‘అమ్మా నీకు వందనం’ చిత్రాన్ని, ‘హూ కిల్డ్ మి’ అనే లఘు చిత్రాన్ని తీశారు. విలువల వలువలు విప్పేస్తూ స్త్రీల అంగాంగ ప్రదర్శనలతో వికట్టహాసం చేస్తున్న సినిమాలు కాకుండా, మనిషి కేంద్రంగా మానవతా విలువలే లక్ష్యంగా.. సమాజానికి సందేశాన్ని ఇచ్చే లఘు చిత్రాలు, సినిమాలను తీస్తున్నారు. ప్రముఖ రచయిత నవీన్ ‘అంపశయ్య’ నవల ఆధారంగా 2016లో ‘క్యాంపస్ అంపశయ్య’ అనే చిత్రాన్ని నిర్మించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన అంపశయ్యను సినిమాగా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ, లాభాలు తెచ్చిపెట్టదనే కారణంతో ఆ సాహసానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభాకర్ మాత్రం అంపశయ్య చిత్రాన్ని తీసి తీరాలని నిర్ణయించుకుని విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయనను భరతముని ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ ప్రయోగాత్మక దర్శకుడి అవార్డుతో సన్మానించింది.[1]
నటుడిగా
మార్చుసామాజిక సేవ
మార్చుజీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, పేద, మధ్యతరగతి సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో తనవంతుగా సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. 2006లో తన తండ్రి పేరిట లక్ష్మినారాయణ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పాత వరంగల్ జిల్లాలో ఓ పాఠశాలను దత్తత తీసుకుని ఆ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు కావాల్సినవి సమకూర్చుతున్నారు. 2007 నుంచి తల్లిదండ్రుల పేరు మీద కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకం అందజేస్తున్నారు.
ప్రచురించిన గ్రంథాలు
మార్చు
1."లక్ష్యం" (నవల) 1989
2."చోర్ బజార్" (నవల) 1992
3."గమ్యం" (నవల) 1994
4."రూపాయలొస్తున్నాయ్ జాగ్రత్త!" (నవల) 2007
5."నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్!"(నవల) 2014
6."I GOT 'U' "(నవల) 2014
7."సినీవాలి" (నవల) 2017
నిర్వహిస్తున్న పదవులు
మార్చు- లక్ష్మినారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు
అందుకున్నపురస్కారాలు/ పొందిన సన్మానాలు
మార్చు- 2002లో రజని-కుందుర్తి పురస్కారం
- 2014లో భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి నుండి 'ఉత్తమ ప్రయోగాత్మక దర్శకుడు' అవార్డు
మూలాలు
మార్చు- ↑ [ http://www.sakshi.com/news/features/young-at-heart-209187 సాక్షి దినపత్రికలో వ్యాసం]