ప్రాచీనాంధ్ర నౌకాజీవనము

ప్రాచీనాంధ్ర నౌకాజీవనము ప్రముఖ చరిత్రకారుడు, రచయిత భావరాజు వేంకట కృష్ణారావు రచించిన చరిత్ర గ్రంథం.

ప్రాచీనాంధ్ర నౌకాజీవనము
కృతికర్త: భావరాజు వేంకట కృష్ణారావు
సంపాదకులు: పి.పి.సి.జోషి
ముద్రణల సంఖ్య: 2
ముఖచిత్ర కళాకారుడు: చంద్ర
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: ప్రాచీ పబ్లికేషన్స్
విడుదల: 1923, 2003
పేజీలు: 147
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 81-7443-012-1
ప్రాచీనాంధ్ర నౌకాజీవన చారిత్రము పేరిట 1923లో ప్రచురణ పొందిన ఈ గ్రంథం తొలిముద్రణ ముఖపత్రము

రచనా నేపథ్యం

మార్చు

ప్రాచీనాంధ్ర నౌకాజీవన చారిత్రము పేరిట 1923 మార్చిలో భావరాజు వేంకట కృష్ణారావు రచించిన ఈ గ్రంథం తొలిగా ప్రచురణ పొందింది. తొలిముద్రణకు జాతీయ సారస్వత నిలయం ప్రచురణకర్తగా వ్యవహరించింది. 2003లో ప్రాచీ పబ్లికేషన్స్ ప్రాచీనాంధ్ర నౌకాజీవనము పేరిట ప్రచురించారు. ద్వితీయముద్రణకు పి.పి.సి.జోషి సంపాదకత్వ, ప్రచురణ బాధ్యతలు వహించారు. 1923ప్రచురణలో ప్రాచీనాంధ్ర నౌకాజీవన చారిత్రము అని శీర్షికవున్నా, లోపలి పుటల్లో ప్రాచీనాంధ్ర నౌకాజీవనము, అనే వ్యవహరించారు కనుక ఈ కుదింపునే రెండవ కూర్పుకి శీర్షిక చేసినట్టుగా ద్వితీయ ముద్రణ సంపాదకుడు వివరణ ఇచ్చారు. భావరాజు వారు 1922-39 కాలంలో రాసిన సంబంధిత వ్యాసాలు మూడింటిని రెండవ కూర్పులో అనుబంధంగా చేర్చారు.[1]

విషయాలు

మార్చు

ప్రాచీనాంధ్ర నౌకాజీవనం గ్రంథంలో ప్రాచీనకాలం నాడు ఆంధ్రుల నౌకాయానంలో గురించి చారిత్రిక ఆధారాల సహితంగా రాశారు. 1920 ప్రాంతాల నాటికి లభించిన ఆధార గ్రంథాలను పరిశీలించి, విషయ సేకరణ చేసి, రచించిన ఈ గ్రంథంలో భావరాజు వేంకట కృష్ణారావు భారతీయులకు దేశవిదేశాలతో వున్న వ్యాపార సంబంధాలకు, దేశ ఆర్థిక పరిపుష్టికి, దేశీయ పారిశ్రామిక, వ్యావసాయికోత్పత్తులకు భారతీయ సంస్కృతీ విస్తరణకు, హైందవ బౌద్ధ మతముల వ్యాప్తికి, ఆంధ్రుల నౌకాయానం ఎంతగా దోహదపడిందో ఈ గ్రంథం ద్వారా నిరూపించారు.[2] ఈ గ్రంథంలోని అధ్యాయాల పేర్లు ఇలా వున్నాయి[3]:

  1. ప్రస్తావన
  2. ప్రాచీన హైందవ సారస్వతమునందాంధ్రుల సముద్ర వాణిజ్య వ్యాపార సూచనలు
  3. ప్రాచీన వస్తుసామూహము నందును, చిత్రకళలందును ఆంధ్రుల సముద్ర వ్యాపార సూచనలు
  4. హైందవ వాణిజ్య ప్రాచీనత
  5. ఆంధ్ర మహాసామ్రాజ్య కాలము
  6. పల్లవ యుగము
  7. చాళుక్యరాజుల కాలము
  8. కాకతీయ త్రైలింగసామ్రాజ్య కాలము
  9. రెడ్డి, విజయనగర సామ్రాజ్య కాలములు
  10. అంత్యదశ
  11. ఉపసంహారము

2003 కూర్పుకు జతకూడిన అనుబంధవ్యాసాలు:

  1. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము
  2. ప్రాచీనాంధ్రదేశపు వర్తకపరిస్థితులు
  3. ప్రాచీనాంధ్రులు: వారి వలసరాజ్య చిహ్నాలు

భాష, శైలి

మార్చు

కృష్ణారావు తన తొలిరచన అయిన ప్రాచీనాంధ్ర నౌకాజీవనమును సరళ గ్రాంథికంలో రాశారు. ద్వితీయముద్రణలో పాఠకులను దృష్టిలో ఉంచుకుని అరసున్నలను విడిచిపెట్టి, అవసరమనిపించిన చోట విసంధి చేసి, ఎక్కువమందికి తెలియని తెలుగు అంకెల బదులు అరబిక్ అంకెలు వాడారు. కానీ, శాసనాలు, కావ్యాల ఉల్లేఖనాల విషయంలో మాత్రం యీ మార్పులేవీ చేయలేదని సంపాదకుడు పేర్కొన్నారు.

మూలాలు

మార్చు
  1. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము గ్రంథం 2003 ప్రచురణకు సంపాదకుడు పి.పి.సి.జోషి ఈ కూర్పు గురించి శీర్షికన రాసిన నోట్
  2. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము ద్వితీయముద్రణకు వి.వి.కృష్ణశాస్త్రి రాసిన ముందుమాట
  3. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము ద్వితీయ ముద్రణ