ఫేస్‌బుక్ సమాచార భద్రతా ఉల్లంఘన వివాదం

ఫేస్‌బుక్ సమాచార భద్రతా ఉల్లంఘన వివాదం లేక కేంబ్రిడ్జి అనలెటికా వివాదం అన్నది అత్యంత ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని ఎన్నికల్లో వారిని రాజకీయంగా ప్రభావితం చేసే ఉద్దేశాలున్న సంస్థలకు అమ్ముకుని దుర్వినియోగం చేసిందన్న అంశంపై జరుగుతున్న వివాదం. కేంబ్రిడ్జి అనలిటికా అన్న రాజకీయ సమాచార విశ్లేషణ సంస్థకు ఫేస్‌బుక్ 5 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అమ్మింది, ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించిందన్న విషయం 2018లో బహిర్గతమైంది. ఒక ఫేస్‌బుక్ యాప్ వినియోగించినవారి సమాచారంతో పాటు, వారి స్నేహితుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా కేంబ్రిడ్జి అనలిటికా అనుమతి లేకుండా సేకరించడాన్ని ఫేస్‌బుక్ ఏపీఐల ద్వారా అవకాశం ఇవ్వడం విమర్శలకు కారణమైంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తిగతంగా ఓటర్లను లక్ష్యం చేసుకుని, వారి రాజకీయ అభిప్రాయాలను 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటుగా బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ జరిగిందని పలు మీడియా సంస్థల పరిశోధనలో వెల్లడైంది. దీని ఫలితంగా ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలెటికాలపై అమెరికా, బ్రిటన్ దేశాల్లో న్యాయ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నెటిజన్లు ఫేస్‌బుక్ ఖాతా తీసివేయడాన్ని ఉద్యమంగా చేపట్టారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ స్పందిస్తూ విశ్వాసానికి విఘాతం కలిగిందని అంగీకరిస్తూ, క్షమాపణ కోరుకున్నాడు. సమాచార భద్రత పెంపొందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నాడు.

కేంబ్రిడ్జి అనలెటికా - సమాచార సేకరణ

మార్చు

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి, ప్రచారానికి సహకరిస్తూ పనిచేసిన కేంబ్రిడ్జి అనలిటికా అన్న రాజకీయ సమాచార విశ్లేషణా వ్యాపార సంస్థకి ఫేస్‌బుక్ 5 కోట్లమందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మిందని 2018లో బయటపడింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ తయారుచేసిన ఒక యాప్ ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించారు.[1] "దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్" (అనువాదం: ఇది మీ డిజిటల్ జీవితం) అన్న ఫేస్‌బుక్ క్విజ్ ఆ యాప్ అందిస్తుంది. [2] దాదాపు 2 లక్షల 70 వేలమంది ఈ యాప్ వినియోగించారు, ఫేస్‌బుక్ ఏపీఐ ఈ యాప్ వినియోగించినవారి స్నేహితుల సమాచారాన్ని కూడా సేకరించడానికి అనుమతించింది.[3]

రాజకీయ అభిప్రాయాలపై ప్రభావం

మార్చు

ఫేస్‌బుక్ యూజర్ల నుంచి, అనుమతి లేకుండా వారి స్నేహితుల నుంచీ కూడా ఫేస్‌బుక్ ఏపీఐలను వినియోగించుకుని సమాచారాన్ని సేకరించిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఆ సమాచారం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పలు ఎన్నికలు, అభిప్రాయ సేకరణల్లో రాజకీయ వర్గాల పక్షాన పనిచేసింది.

  • 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు: 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యూహాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ సేకరించిన వ్యక్తిగత సమాచారం ఆధారంగా రూపకల్పన చేశారు. ఈ సమాచారాన్ని, ఎన్నికల ప్రచార సమాచారంతో పోల్చి చూడడం ద్వారా వ్యక్తిగతంగా ప్రతీ ఓటరును లక్ష్యం చేసుకోవడం సాధ్యపడింది. ఇది డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయానికి ఉపకరించింది.[4]
  • బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా వద్దా అన్న బ్రెగ్జిట్ (బ్రిటన్ ఈయూ నుంచి బయటకు రావడం) అంశంపై జరిగిన జనాభిప్రాయ సేకరణపైనా తమ సమాచార విశ్లేషణ - వ్యూహ రూపకల్పన ప్రభావం చూపినట్టుగా కేంబ్రిడ్జి అనలిటికా పేర్కొంది.[5]
  • భారతదేశంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని వివాదాస్పద కేంబ్రిడ్జి అనలిటికా పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికాలో అంతర్భాగంగా భారతదేశంలో పనిచేసే ఎస్‌సిఎల్ ఇండియా సంస్థ లండన్‌లోని ఎస్‌సీఎల్ గ్రూపు, ఓవ్లెనో బిజినెస్ ఇంటలిజెన్స్ (ఓబీఐ) ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అని వెబ్‌సైట్‌లోని సమాచారం పేర్కొంటోంది. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు అమ్రిష్ త్యాగి ఈ సంస్థ అధినేతగా ఉన్నాడు. 2014లో భాజపా వారి మిషన్ 272 ప్లస్‌ సహా ఢిల్లీ, హర్యాణా వంటి ఎన్నికలు నాలుగిటిలో సహకరించామని సంస్థ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్లైంట్లలో ఒకరనే చెప్తున్నారు. ఐతే ఈ ఆరోపణలు రెండు పార్టీలూ కొట్టిపారేస్తున్నాయి. [6]

ప్రతిస్పందన

మార్చు

వినియోగదారుల స్పందన

మార్చు

తమ సమాచారాన్ని అనుమతి లేకుండా రాజకీయ విశ్లేషణ, వ్యూహరచన సంస్థలకు అమ్మడం బయటపడడంతో ఆన్‌లైన్‌లో డిలీట్ ఫేస్‌బుక్ (ఫేస్‌బుక్ తొలగించండి) ఉద్యమం ప్రారంభమైంది. ఎందరో వినియోగదారులు ఫేస్‌బుక్‌లో ఖాతాలు మూసివేసి ఆ విషయాన్ని ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. [7] ఫేస్‌బుక్‌తోనే కొనసాగుతున్న వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్షన్ ట్విట్టర్‌లో ఈ ట్రెండ్‌కి మద్దతు ప్రకటిస్తూ ఇట్స్ టైం #డిలీట్‌ఫేస్‌బుక్ (ఫేస్‌బుక్ ఖాతా తీసేయడానికి ఇదే సమయం) అని వ్యాఖ్యానించాడు. ఈ హ్యాష్‌టాగ్‌కి నెటిజన్లలో భారీ స్పందన వస్తోంది.[8]

విచారణలు - మార్కెట్ పతనం

మార్చు

అమెరికన్, బ్రిటన్ న్యాయశాఖ అధికారులు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్‌ను తమ ముందు హాజరుకమ్మని ఆదేశించారు. ఫేస్‌బుక్ భద్రతాపరమైన వివాదంలో ఇరుక్కోవడంతో 2004లో స్థాపించిన సమయం నుంచి ఎప్పుడూ లేనంత కుదుపుకు ఫేస్‌బుక్ షేర్లు గురయ్యాయి. 40 బిలియన్ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది.[9]

ఫేస్‌బుక్ స్పందన

మార్చు

ఫేస్‌బుక్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా 2016 అమెరికన్ అధ్యక్ష ఎన్నికలపై రష్యా ప్రభావం చూపిందన్న సందేహాలు 2017లో వ్యక్తమైనప్పుడు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ దాన్ని పిచ్చి ఆలోచనగా కొట్టిపడేశాడు.[10] ఐతే ఈ అంశం ఛానెల్ 4 న్యూస్, ది అబ్జర్వర్, ద న్యూయార్క్ టైమ్స్ చేసిన అండర్ కవర్ రిపోర్టింగ్ తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చాకా మొదట దాని తీవ్రతను, ప్రాముఖ్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ దొంగలించిన సమాచారం కేంబ్రిడ్జి అనలిటికాకు ప్రస్తుతం అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఐతే ఈ అంశంపై పరిశోధన మరింత పెరిగాకా, ఫేస్‌బుక్ ఆందోళన వ్యక్తం చేసి, కేంబ్రిడ్జి అనలిటికా అక్కౌంటును, ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన క్రిస్ వైలీ అక్కౌంటునూ కూడా సస్పెండ్ చేసింది. అందుబాటులో ఉన్న పత్రాలు, ఫేస్‌బుక్ పూర్వ ఉద్యోగులతో ఇంటర్వ్యూలు ఇప్పటికీ కేంబ్రిడ్జి అనలిటికా వద్ద సమాచారం ఉన్నదనే సూచిస్తున్నాయి.[11]
ఈ వివాదం తీవ్రతపైనా మొదట ఫేస్‌బుక్ స్పందిస్తూ "లక్షలాది మందికి చెందిన సమాచారాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడం కిందకు రాదు" అనే సమర్థించుకునే ప్రయత్నం చేసింది.[10] పలు వైపుల నుంచి ఒత్తిడి కొనసాగి, పలు వ్యాఖ్యానాలు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా రావడం, ఫేస్‌బుక్ వినియోగదారులు ఖాతాలు తొలగించుకోవాలన్న ఆన్‌లైన్ ఉద్యమాలు సాగడం జరిగాయి. ఆపైన ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ స్పందిస్తూ "విశ్వాసానికి విఘాతం కలిగిందనీ" క్షమాపణలు కోరాడు, ఫేస్‌బుక్ వినియోగదారులను ఉద్దేశించి "మీ డేటాను కాపాడటం మా బాధ్యత. అది చేయలేనపుడు మీకు సేవలు అందించలేం" అని వ్యాఖ్యానించాడు. భారతదేశంలో రానున్న ఎన్నికల్లోనూ, బ్రెజిల్లోనూ, అమెరికాలోనూ జరిగే మధ్యంతర ఎన్నికల్లోనూ ఫేస్‌బుక్ జోక్యాన్ని ఆపేయనున్నట్టు పేర్కొన్నాడు. భద్రతా పరమైన అంశాల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని మాటిచ్చాడు.[12]

మూలాలు

మార్చు
  1. Lewis, Paul; Wong, Julia Carrie (2018-03-18). "Facebook employs psychologist whose firm sold data to Cambridge Analytica". the Guardian. Retrieved 2018-03-20.
  2. జాన్, ‌వేక్ ఫీల్డ్ (21 మార్చి 2018). "ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?". బీబీసీ తెలుగు. బీబీసీ. బీబీసీ. Retrieved 22 March 2018.
  3. Franceschi-Bicchierai, Lorenzo (2018-03-19). "Why We're Not Calling the Cambridge Analytica Story a 'Data Breach'". Motherboard. Retrieved 2018-03-20.
  4. బీబీసీ, బృందం (22 మార్చి 2018). "ఫేస్‌బుక్‌లో మీ సమాచారం ఏమవుతుంది?". బీబీసీ తెలుగు. Retrieved 22 March 2018.
  5. Ian, Sherr (21 March 2018). "Facebook, Cambridge Analytica, data mining and Trump: What you need to know". CNET (in ఇంగ్లీష్). Retrieved 22 March 2018.
  6. జుబైర్, అహ్మద్; ఆయేషా, పెరీరా (21 మార్చి 2018). "బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!". బీబీసీ తెలుగు. Retrieved 22 March 2018.
  7. టామ్, హెర్బెర్ట్. "#DeleteFacebook movement grows following 'data leak' of 50 million users". మెట్రో. No. 20 మార్చి 2018. Retrieved 22 March 2018.
  8. సాక్షి, విలేకరి. "ఇట్స్ టైం.. డిలీట్ ఫేస్‌బుక్". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 22 March 2018.
  9. https://www.sakshi.com/news/business/privacy-issues-emerge-major-business-risk-facebook-1055113 ఫేస్‌బుక్‌కు భారీ షాక్: సాక్షి
  10. 10.0 10.1 అమోల్, రాజన్ (21 మార్చి 2018). "‌ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఎక్కడ?". బీబీసీ తెలుగు. బీబీసీ. బీబీసీ. Retrieved 22 March 2018.
  11. Rosenberg, Matthew; Confessore, Nicholas; Cadwalladr, Carole (March 17, 2018). "How Trump Consultants Exploited the Facebook Data of Millions" – via NYTimes.com.
  12. బీబీసీ, ప్రతినిధి. "భారత్ ‌ఎన్నికల్లో జోక్యాన్ని ఆపేస్తాం : జుకర్‌బర్గ్". 22 మార్చి 2018. No. బీబీసీ. బీబీసీ. Retrieved 22 March 2018.