ఫ్రెడ్రిక్ ఓలర్

(ఫ్రెడ్రిక్‌ ఓలర్ నుండి దారిమార్పు చెందింది)

ఫ్రెడ్రిక్‌ ఓలర్ చిన్నప్పటి నుంచీ రసాయనాలతో ప్రయోగాలు చేసిన ఓ కుర్రాడు, పెరిగి పెద్దయ్యాక ఓ ప్రత్యేక శాస్త్రం ఆవిర్భావానికి నాంది పలికాడు. ఆయన పుట్టిన రోజు ఇవాళే! 1800 జూలై 31న - ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఆయన చలవే!

యూరియా అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అది ఒక ఎరువుగా వ్యవసాయ రంగంలోనే కాదు, నిర్మాణ, వైద్య, ప్లాస్టిక్‌, టెక్స్‌టైల్‌, కాస్మెటిక్‌ రంగాల్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కేవలం జీవుల్లో మాత్రమే ఉండే ఈ రసాయనాన్ని తొలిసారిగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తే ఫ్రెడ్రిక్‌ ఓలర్‌ (Friedrich Wohler). దీని ద్వారా ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అనే శాస్త్ర విభాగానికి పితామహుడిగా పేరొందాడు. అలాగే ఇవాళ అల్యూమినియం ఎంత వాడుకలో ఉందో తెలియనిది కాదు. దాన్ని కూడా ఆవిష్కరించింది ఈయనే. ఇవేకాక ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న సిల్వర్‌ సైనేట్‌, బెరీలియం, నైట్రియం, సిలికాన్‌, సిలికాన్‌ నైట్రైడ్‌, టైటానియం లాంటి పదార్థాలను వేరుపరచే ప్రక్రియలకు దోహదపడ్డాడు.

జర్మనీలోని ఫ్రాంక్‌పోర్టమ్‌ దగ్గరి ఓ కుగ్రామంలో 1800 జూలై 31న పుట్టిన ఓలర్‌ చిన్నతనం నుంచే ఖనిజాలు, రసాయన శాస్త్రాలపై శ్రద్ధ చూపించాడు. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి ఒక గ్రంథాలయాన్ని, చిన్నపాటి రసాయన ప్రయోగశాలను సమకూర్చాడు. పుస్తకాలు చదవడం, రసాయనాల ధర్మాలు పరిశీలించడమే ఓలర్‌ ముఖ్యవ్యాపకం. ఉన్నత పాఠశాల స్థాయిలోనే ఓల్టాయిక్‌ ఘటాలను తయారు చేయడం లాంటి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇరవై ఏళ్ల వయసులో వైద్యవిద్య కోసం మార్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చేరినా, హాస్టల్‌ గదిలో ప్రయోగాలు వద్దన్నందుకు చదువు మానేశాడు. తర్వాత స్టాక్‌హోమ్‌లోని ప్రముఖ స్వీడిష్‌ శాస్త్రవేత్త బెర్జీలియస్‌ వద్ద పరిశోధనకు చేరాడు.

ఆ రోజుల్లోనే నైట్రోజన్‌, కార్బన్‌, ఆక్సిజన్‌, సిల్వర్‌ సమ్మేళనమైన సిల్వర్‌ సైనేట్‌ (silver cynate) తయారు చేయడం అతడికి ఎంతో పేరు తెచ్చిపెట్టడమే కాకుండా, రసాయనిక శాస్త్రంలో 'ఐసోమర్‌' (Isomer) అనే కొత్త భావనకు దారి తీసింది. ఆపై పొటాషియం సైనేట్‌ను తయారు చేసిన ఓలర్‌, దాన్ని అమ్మోనియా సల్ఫేట్‌తో మేళవించడంతో ఓ అద్భుత ఆవిష్కరణ వెలువడింది. ఆ ద్రవం నుంచి తెల్లని సూదుల్లాంటి స్ఫటికాలు తయారయ్యాయి. అది అంతకు ముందెన్నడూ ప్రయోగశాలలో తయారవలేదు. మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఆ అమోనియం సైనేట్‌ స్ఫటిక పదార్థమే 'యూరియా'! దీన్ని కనుగొనేనాటికి ఓలర్‌ వయసు కేవలం 28 ఏళ్లు.

ఆర్గానిక్‌ సమ్మేళనాలు జీవజాలంలో మాత్రమే ఉత్పన్నమవుతాయనే భావనకు తొలగించి, శాస్త్రవేత్తలు వేలాదిగా వాటిని ప్రయోగశాలల్లో తయారు చేయడానికి దోహదం చేసిన వ్యక్తిగా ఓలర్‌ పేరు చిరస్మరణీయం.

మూలాలుసవరించు