బండి వెంకట్రామిరెడ్డి
బహుముఖ ప్రజ్ఞావంతుడు, కవి పండితుడు, అష్టావధాని, సంస్కృత ఆంధ్ర భాషలలో పండితులైన బండి వెంకట్రామి రెడ్డి ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో 1914 సంవత్సరంలో జన్మించారు. హరికథలు కూడా చెప్పటం వల్ల వీరిని ‘హరిదాసు’ అనే పేరుతో వ్యవహరించేవారు. మైలవరం దగ్గరున్న చిరివాడ గ్రామంలో శతావధాని వేలూరి శివరామశాస్త్రి దగ్గర సంస్కృతం, వ్యాకరణం నేర్చుకున్నారు.
మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ‘ఆయుర్వేద శిరోమణి’ అనే పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్.ఎం.పి.) గా వేంసూరు మండల పరిసర ప్రాంతాల్లో చాలా కాలం ప్రాక్టీసు చేశారు .
ఖమ్మం జిల్లాలోని కందుకూరు, అమ్మపాలెం; కృష్ణాజిల్లాలోని మైలవరం, నూజివీడు, చాట్రాయి, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, ప్రగడవరం మొదలైన ప్రాంతాల్లో వీరు అష్టావధానాలు చేశారు.
‘కైకేయి కామ్యసిద్ది’ (పౌరాణికం) , ‘సుందరీ తిలకం’ (సాంఘికం) అనే నాటకాలు రచించారు. ఈ రెండు నాటకాలనూ నూజివీడులోని గౌరీ ముద్రాక్షర శాలలో ముద్రించారు. ‘దాస్యవిముక్తి అనే నాటకం వీరి అముద్రిత రచన.
సూర్యరాయాంధ్ర నిఘంటువుపై వచ్చిన సమీక్షలను దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘సాహిత్యసమీక్ష’ అనే పుస్తకంగా ప్రచురించారు. దీనిలో బండి వెంకట్రామిరెడ్డి రాసిన ఆరు వ్యాసాలను ప్రచురించారు..