బలి చక్రవర్తి

హిందూ గ్రంథాలలో రాజు

బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు.

  • బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు. ఇతడు మహాశూరుడు. ముల్లోకములను గెలిచి దేవేంద్రుఁడు మున్నగువారి ఐశ్వర్యములను అపహరించి చక్రవర్తి అయ్యెను. అప్పుడు విష్ణువు వామనావతారము ఎత్తి ఒక చిన్నబాఁపఁడు అయి ఇతనిని మూఁడు అడుగుల భూమి యాచింప ఇతఁడు యాచకుఁడు విష్ణువు అని యెఱిఁగియు శుక్రాచార్యులు మొదలయిన వారిచే అడ్డగింపఁబడియు తన దాతృత్వము లోకప్రసిద్ధము అగునటుల దానము ఇచ్చెను. ఆవామనరూపుఁడు అయిన విష్ణువు అపుడు త్రివిక్రముఁడు అయి ఒక్క అడుగున స్వర్గమును, ఇంకొక అడుగున భూమిని ఆక్రమించి మూఁడవది అయిన మఱియొక అడుగునకు చోటుచూపుము అనఁగా ఇతఁడు తన తలను చూపెను. అంతట త్రివిక్రముఁడు ఇతనిని బంధించి ఇతని భార్య అగు వింధ్యావళి పతిభిక్ష వేడగా అనుగ్రహించి పాతాళ లోకమునందు సకుటుంబముగ వాసము చేయునట్లు ఇతనికి నియమనము చేసి తాను ఇతనివాకిట గదాధరుఁడు అయి కావలికాచుచు ఉండువాఁడు అయ్యెను. ఈదానము ఇచ్చునపుడు శుక్రుడు జలకలశమునందు చేరి దాని ద్వారమునకు అడ్డము తన కన్ను నిలిపి ఉండఁగా అది ఎఱిఁగి వామనుఁడు దర్భకఱ్ఱతో ఆకన్నుపొడిచి ద్వారముచేసి నీళ్లు భయలికి వచ్చునట్లు చేసెను. అది మొదలుకొని శుక్రుఁడు ఒంటికంటివాడు అయ్యెను. మఱియు ఈబలి చక్రవర్తి చిరంజీవి. ఇతనికి నూఱుగురు పుత్రులు కలరు. అందు బాణాసురుఁడు జ్యేష్ఠుఁడు. ఇతని సత్యసంధతకు మెచ్చి విష్ణువు ఇతనికి ఈమన్వంతరమున దైత్యేంద్రత్వమును పైమన్వంతరమున దేవేంద్రత్వమును అనుగ్రహించెను
వామనునికి మూడడుగులు దానమిస్తున్న బలి చక్రవర్తి
త్రివిక్రముడైన వామనుడు- ఒక కాలు భూమిని, ఒక కాలు ఖగోళాన్ని ఆక్రమించగా మూడవ కాలు బలి నెత్తి మీద ఉంచుతున్నట్లు చూపబడింది. నేపాల్ దేశంలోని చిత్రం.