బీరేంద్ర కుమార్ భట్టాచార్య

భారతీయ రచయిత

బీరేంద్ర కుమార్ భట్టాచార్య ప్రఖ్యాత అస్సామీ సాహిత్యవేత్త. జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడెమీ వంటి ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారాల గ్రహీతగా ఆయన భారతీయ సాహిత్యరంగంలో లబ్ధప్రతిష్ఠుడు.[1]

బీరేంద్ర కుమార్ భట్టాచార్య
BirendraKumarBhattacharyaPic.jpg
పుట్టిన తేదీ, స్థలం14 అక్టోబర్1924
Safrai T.E. అసోం
మరణం6 ఆగస్టు1997
వృత్తిరచయిత
భాషబెంగాలీ
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారత దేశము
గుర్తింపునిచ్చిన రచనలుమృత్యుంజయ
పురస్కారాలుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1960)
జ్ఞానపీఠ పురస్కారం (1979)

వ్యక్తిగత విశేషాలుసవరించు

బీరేంద్ర కుమార్ భట్టాచార్య 1925లో అస్సాంలో జన్మించారు. ఆయన పత్రికా సంపాదకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన గౌహతీ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో రీడర్ గా ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు. 1950 దశాబ్ది చివరి సంవత్సరాలలో మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రూల్ ప్రాంతంలో వెంచర్ క్రిస్టియన్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన 1997లో మరణించారు.[2]

సాహిత్యరంగంసవరించు

బీరేంద్ర కుమార్ భట్టాచార్య నవలలు, కథలు, కవితలు రచించినా నవలాకారునిగా అస్సామీ సాహిత్యరంగంలో సుప్రసిద్ధులయ్యారు. తొలి నవల రాజ్ పహ్తె రింగైను 1957లో రచించారు. ఒక్కరోజులోనే జరిగే ఘటనలతో సాగే ఈ ప్రయోగాత్మక నవలలో రాజకీయ, సామాజిక విశ్లేషణలు చేశారు. 1958లో బీరేంద్ర వ్రాసిన రెండవ నవల ఆఐ (అమ్మ) లో సాధారణమైన పల్లెటూరిలో నూతన నాగరికత, యాంత్రికతల ప్రభావాన్ని చిత్రీకరించారు. బీరేంద్రకు ప్రఖ్యాతిని సాధించిపెట్టిన యారుఇంగం (తెలుగులో జనవాహిని) నవలను 1960లో రచించారు. ఈ నవలకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. నాగాజాతి జనజీవితాన్ని, వారి ఉద్యమాలను ఆధారంగా చేసుకుని రచించిన ఈ నవల అస్సామీ భాషలోనే కాక ఇతర భారతీయ భాషల్లోకీ, ఆంగ్లంలోకి అనువదించబడి సుప్రసిద్ధమై నిలిచింది. తంఖ్రూల్ నాగా తెగలు 20వ శతాబ్ది ద్వితీయ అర్థభాగంలో జపాను-ఆజాద్ హిందు సేనల ఆక్రమణ, ద్వితీయ ప్రపంచ యుద్ధబీభత్సం, ఫిజో ఆధ్వర్యంలో వేర్పాటువాద ఉద్యమం, ఉగ్రవాదం వంటి పరిస్థితుల వల్ల ప్రాభవితమైన తీరు, ఎదుర్కొన్న కష్టనిష్టూరాలను నవల నేపథ్యంగా ఎంచుకుని రాశారు. ఈశాన్య రాష్ట్రాలపై చైనా యుద్ధ నేపథ్యంలో శతఘ్ని (1964) నవల రచించారు. 1942 కాలంలో అస్సామీలు బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాన్ని గురించి రాసిన మృత్యుంజయ్ నవలను వ్రాశారు. బహుళ ప్రచారాన్ని పొందిన ఈ నవల ద్వారా బీరేంద్ర ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందారు. అనంతరం పలు నవలలను కూడా వ్రాశారు. ఆయన రచించిన చిన్న కథలు రెండు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.[3]

రచనల జాబితాసవరించు

పురస్కారాలు, గౌరవాలుసవరించు

  • 1985లో మృత్యుంజయ్ నవలకుగాను జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. ఈ గౌరవాన్ని పొందిన తొలి అస్సామీ/బెంగాలీ రచయితగా ఆయన చరిత్రకెక్కారు.
  • 1961లో యారుఇంగం నవలకుగాను కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందారు.
  • యారుఇంగం నవల భారతీయ సాహిత్యంలో మాస్టర్ పీస్ గా గుర్తించారు.[4]

పదవులుసవరించు

  • కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షునిగా పనిచేశారు.
  • అస్సాం సాహిత్య సభ 1983-85కాలంలో అధ్యక్షునిగా వ్యవహరించారు.[5]

మూలాలుసవరించు

  1. "జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల జాబితా(అధికారిక)". జ్ఞానపీఠ్ వెబ్సైట్. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-21.
  2. జనవాహిని(యారుఇంగం తెలుగు అనువాదం)కి బీరేంద్ర కుమార్ భట్టాచార్య ముందుమాట
  3. "బీరేంద్ర కుమార్ భట్టాచార్య జీవన సంగ్రహం". Archived from the original on 2014-03-06. Retrieved 2014-02-21.
  4. జార్జ్.కె.ఎం.(1997), మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ (వాల్యూం I). నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా పేజీ.19
  5. "అస్సాం సాహిత్య సభ అధికారిక వెబ్సైట్ లో 1917 నుంచి అధ్యక్షుల జాబితా". Archived from the original on 2010-03-01. Retrieved 2014-02-21.