అసోం
అసోం (ఇదివరకటి పేరు అస్సాం) (অসম) ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.
అసోం | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
దిస్పుర్ - 26°09′N 91°46′E / 26.15°N 91.77°E |
పెద్ద నగరం | గౌహతి |
జనాభా (2001) - జనసాంద్రత |
26,638,407 (14th) - 340/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
78,438 చ.కి.మీ (16th) - 23 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[అసోం |గవర్నరు - [[అసోం |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1947-08-15† - జగదీష్ ముఖి - సర్బానంద సోనోవాల్ - ఒకేసభ (126) |
అధికార బాష (లు) | అస్సామీస్, బోడో, కర్బీ |
పొడిపదం (ISO) | {{{abbreviation}}} |
వెబ్సైటు: assamgovt.nic.in | |
† 1937నుండి అస్సాంకు శాసనసభ ఉన్నది. |
పేరు పుట్టుపూర్వోత్తరాలుసవరించు
కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.
అసమ లేదా అస్సమ అన్న పదాలు "కామరూప"ను భాస్కర వర్మ పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ యొక్క యాత్రా రచనల వల్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి వింత మనిషి/పాపితో పాటు ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి అనే అర్ధం కూడా ఉంది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని అసమ లేదా అసం లేదా అసోం అని వ్యవహరించనే లేదు.
బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగింది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ఆంథెరా అస్సమ అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉంది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.
భౌగోళికంసవరించు
ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి, చాచర్ కొండలు, దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.
అస్సాంలో జీవ సంపద, అడవులు, వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేధించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు, జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
అతివృష్టి, చెట్ల నరికివేత,, ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో (రిక్టర్ స్కేలు పై 8.1 గా నమోదైనది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
చరిత్రసవరించు
- ప్రాచీన అస్సాం
అస్సాం,, పరిసర ప్రాంతాలు పురాణకాలంలో ప్రాగ్జ్యోతిషం అనబడేవని మహాభారతంలో చెప్పబడింది. అక్కడి ప్రజలు కిరాతులనీ, చీనులనీ అనబడ్డారు. కామరూప రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురం రాజధాని.
- మధ్యయుగ అస్సాం
మధ్యయుగంలో దీనిపేరు కామరూప, లేదా కమట. అక్కడ రాజ్యమేలిన వంశాలలో వర్మ వంశం ప్రధానమైనది. కనోజ్‌ను పాలించిన హర్షవర్ధనుని సమకాలీనుడైన భాస్కరవర్మ కాలంలో జువన్‌జాంగ్ అనే చైనా యాత్రికుడు కామరూప ప్రాంతాన్ని సందర్శించాడు. ఇంకా కచారి, చూటియా వంశాలు కూడా రాజ్యమేలాయి. వీరు ఇండో-టిబెటన్ జాతికి చెందిన రాజులు.
తరువాత టాయ్ జాతికి చెందిన అహోమ్ రాజులు 600 సంవత్సరాలు పాలించారు. కోచ్ వంశపు రాజులు అస్సాం పశ్చిమభాగాన్నీ, ఉత్తర బెంగాల్‌నూ పాలించారు. ఈ రాజ్యం అప్పుడు రెండు భాగాలయ్యింది. పశ్చిమ భాగం మొగల్‌చక్రవర్తుల సామంతరాజ్యమైంది. తూర్పు భాగం అహోం రాజుల పాలన క్రిందికి వచ్చింది. మొత్తానికి బ్రిటిష్ వారి కాలం వరకూ ఎవరూ అస్సాంను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొనలేక పోయారు.
- బ్రిటీషు పాలన
అహోం రాజులలోని అంతర్గత కలహాల కారణంగా అది 1821 నాటికి బర్మా పాలకుల సామంతరాజ్యంగా మారింది. దానితో బర్మావారికి, బ్రిటిష్ వారికి వైరం మొదలయ్యింది. మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధము తరువాత 1826లో యాండబూ ఒడంబడిక ప్రకారం అస్సాం బ్రిటిషు అధీనంలోకి, బెంగాలు ప్రెసిడెన్సీలో భాగంగా, తీసుకోబడింది. 1905-1912 మధ్య అస్సాం ఒక వేరు పరగణా అయ్యింది.
భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్, నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అస్సాం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా షిల్లాంగ్ నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్‌లో చేరారు. మణిపూర్, త్రిపుర సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి.
స్వాతంత్ర్యానంతర అస్సాంసవరించు
స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని దిస్పూర్కు మార్చబడింది. పెరుగుతున్న గౌహతి నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. అస్సామీస్ను అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర బెంగాలీ భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.
1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం.
1980-90 లలో బోడో తెగల వారు, మరికొన్ని తెగలవారు ప్రత్యేక ప్రతిపత్తి కోసము ఘర్షణలు ప్రారంభించారు. ఇవి క్రమంగా సాయుధ, హింసాత్మక పోరాటాలయ్యాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ United Liberation Front of Asom (ULFA) and నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ National Democratic Front of Bodoland (NDFB) వంటి తీవ్రవాద వర్గాలకూ, భారత సైన్యానికీ మధ్య పోరులు పెచ్చరిల్లాయి. సైన్యం మానవహక్కులను మంటకలుపుతున్నదనీ, విచక్షణా రహితంగా హింసను అమలు చేస్తున్నదనీ ఆరోపణలు బలంగా ఉన్నాయి. వర్గాల మధ్య పోరాటాలలో ఎన్నో మూక హత్యలు జరిగాయి
జిల్లాలుసవరించు
వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | BK | బక్స జిల్లా | ముషాల్‌పూర్ | 953,773 | 2,400 | 398 |
2 | BA | బాజాలి జిల్లా | పట్శాల | |||
3 | BP | బార్పేట జిల్లా | బార్పేట | 1642420 | 3245 | 506 |
4 | BS | విశ్వనాథ్ జిల్లా | విశ్వనాథ్ చారియాలి | 5,80,000 | 1,100 | 530 |
5 | BO | బొంగైగావ్ జిల్లా | బొంగైగావ్ | 906315 | 2510 | 361 |
6 | CA | కచార్ జిల్లా | సిల్చార్ | 1442141 | 3786 | 381 |
7 | CD | చరైడియో జిల్లా | సోనారీ | 471,418 | 1,064 | 440 |
8 | CH | చిరంగ్ జిల్లా | కాజల్‌గావ్ | 481,818 | 1,468 | 328 |
9 | DR | దర్రాంగ్ జిల్లా | మంగల్‌దాయి | 1503943 | 3481 | 432 |
10 | DM | ధెమాజి జిల్లా | ధెమాజి | 569468 | 3237 | 176 |
11 | DU | ధుబ్రి జిల్లా | ధుబ్రి | 1634589 | 2838 | 576 |
12 | DI | డిబ్రూగర్ జిల్లా | డిబ్రూగర్ | 1172056 | 3381 | 347 |
13 | DH | దిమా హసాయో జిల్లా (ఉత్తర కచార్ హిల్స్ జిల్లా) | హాఫ్లాంగ్ | 186189 | 4888 | 38 |
14 | GP | గోల్‌పారా జిల్లా | గోల్‌పారా | 822306 | 1824 | 451 |
15 | GG | గోలాఘాట్ జిల్లా | గోలాఘాట్ | 945781 | 3502 | 270 |
16 | HA | హైలకండి జిల్లా | హైలకండి | 542978 | 1327 | 409 |
17 | JO | హోజాయ్ జిల్లా | హోజాయ్ | 931,218 | ||
18 | JO | జోర్హాట్ జిల్లా | జోర్హాట్ | 1009197 | 2851 | 354 |
19 | KM | కామరూప్ మెట్రో జిల్లా | గౌహతి | 1,260,419 | 1,528 | 820 |
20 | KU | కామరూప్ జిల్లా | అమింగావ్ | 1,517,202 | 1,527.84 | 520 |
21 | KG | కర్బి ఆంగ్లాంగ్ జిల్లా | దిఫు | 812320 | 10434 | 78 |
22 | KR | కరీంగంజ్ జిల్లా | కరీంగంజ్ | 1003678 | 1809 | 555 |
23 | KJ | కోక్రఝార్ జిల్లా | కోక్రఝార్ | 930404 | 3129 | 297 |
24 | LA | లఖింపూర్ జిల్లా | ఉత్తర లఖింపూర్ | 889325 | 2277 | 391 |
25 | MJ | మజులి జిల్లా | గారమూర్ | 167,304 | 880 | 300 |
26 | MA | మారిగావ్ జిల్లా | మారిగావ్ | 775874 | 1704 | 455 |
27 | NN | నాగావ్ జిల్లా | నాగావ్ | 2315387 | 3831 | 604 |
28 | NB | నల్బరి జిల్లా | నల్బరి | 1138184 | 2257 | 504 |
29 | SV | శివ్‌సాగర్ జిల్లా | శిబ్‌సాగర్ | 1052802 | 2668 | 395 |
30 | ST | సోనిత్‌పూర్ జిల్లా | తేజ్‌పూర్ | 1677874 | 5324 | 315 |
31 | SM | దక్షిణ సల్మారా జిల్లా | హాట్సింగరి | 555,114 | 568 | 980 |
32 | TI | తిన్‌సుకియా జిల్లా | తిన్‌సుకియా | 1150146 | 3790 | 303 |
33 | UD | ఉదల్గురి జిల్లా | ఉదల్గురి | 832,769 | 1,676 | 497 |
34 | WK | పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా | హమ్రెన్ | 3,00,320 | 3,035 | 99 |
భాషలుసవరించు
అస్సామీ, బోడో భాష రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు "మాగధి ప్రాకృతం" నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర టిబెటో-బర్మన్, మోన్-ఖమెర్ భాషల యొక్క ప్రభావము కూడా అధికాముగానే ఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష.
బ్రిటీషు వారి రాకతో, బెంగాల్ విభజనతో బరక్ లోయలో బెంగాళీ (సిల్హెటి) యొక్క ప్రాబల్యము హెచ్చింది. నేపాళీ, హిందీ రాష్ట్రములో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు
రాష్ట్ర గణాంకాలుసవరించు
- అవతరణము.1950 జనవరి 26
- వైశాల్యము. 78, 438 చ.కి.
- జనసంఖ్య. 31, 169, 272 స్త్రీలు. 15, 214, 345 పురుషులు. 15, 954, 927, నిష్పత్తి . 954/1000
- అక్షరాస్యత. స్త్రీలు. 73.18% పురుషులు. 78.81%
- ప్రధాన మతాలు. హిందు, ముస్లిం, బౌద్ధ మతం.
- ప్రధాన భాషలు. అస్సామీ, బెంగాలి, బోడో.
- జిల్లాల సంఖ్య.27
- గ్రామాలు. 25, 124 పట్టణాలు.125
- పార్లమెంటు సభ్యుల సంఖ్య, 14 శాసన సభ్యుల సంఖ్య. 126
- మూలము. మనోరమ యీయర్ బుక్
సంస్కృతిసవరించు
ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతిగా అభివృద్ధి చెందింది.
- గమోసా
అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసా కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనికి వళ్ళు తుడుచుకొనేది అనే సామాన్య అర్ధం చెప్పవచ్చును. నిజంగానే వళ్ళు తుడుచుకోవడానికి వాడినా, గమోసాను మరెన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్థనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. గామ్+చాదర్ (అనగా పూజా గదిలో పురాణ గ్రంథాన్ని కప్పి ఉంచే గుడ్డ) - అనే కామరూప పదం గమోసాకు మూలం. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు
- బిహు
బిహు పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. మాఘ్ (జనవరి), బోహాగ్ (ఏప్రిల్), కతి (అక్టోబరు)
- దుర్గా పూజ
దుర్గాపూజ కూడా అస్సాంలో బాగా పెద్దయెత్తున జరుపుకొనే పండుగ. అస్సాంలో స్థిరపడిన లక్షలాది బెంగాలీయుల ప్రభావం కూడా ఈ పండుగ ప్రాచుర్యానికి కొంత కారణం కావచ్చును.
- సంగీత
భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.
ఆర్ధిక వ్యవస్థసవరించు
- అస్సాం టీ
తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా Camellia assamica అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది కామెల్లియా సినెసిస్Camellia sinensis అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉంది.
అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో బీహారు, ఒడిషా ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.
- అస్సాంచమురు;
ముడి చమురు, సహజవాయువు కూడా అస్సాం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అస్సాం. ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది.
అస్సాంలో సమస్యలుసవరించు
బ్రిటిషు అధికారం నుంచి అస్సాం ప్రాంతంలోని వేరువేరు పరగణాలు ప్రశాంతంగా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడ్డాయి. కాని తరువాత ఈ ప్రాంతంలోని అభివృద్ధి బాగా కుంటుపడింది. ఫలితంగా తీవ్రవాద వర్గాలు, వేర్పాటు వాద వర్గాలు ప్రాభవం సంపాదించగలిగాయి. గ్రామీణ ప్రాంతంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్య వీరికి అనుకూలమైన పరిస్థితులను కూరుస్తున్నాయి.
దీనికి తోడు వివిధ తెగల మధ్య వైరాలు, పొరుగు దేశాలనుంచి కొన సాగుతున్న వలసలు, వెనుకబాటుతనం - ఇవన్నీ అస్సాంను వెంటాడుతున్న సమస్యలు. కొన్ని తెగల మధ్య ఘర్షణలు చాలా తీవ్రంగ ఉంటున్నాయి.