బొండా జగన్మోహనరావు
బొండా జగన్మోహనరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. కొండకోనల్లో నివశించే గిరిజనుల శ్రేయస్సే అతడి ధ్యేయం.. లక్ష్యం..! ఆధునిక సమాజంలో నివశిస్తున్న వారందరికీ పూర్వికులు గిరిజనులేనన్న ధృక్పధంతో గిరిజనుల జీవనశైలిపై నిరంతర పరిశీలన చేసిన చిత్రకారుడు బొండా జగన్మోహనరావు.
బొండా జగన్మోహనరావు | |
---|---|
జననం | విజయవాడ, కృష్ణా జిల్లా | 1954 మార్చి 25
ప్రసిద్ధి | చిత్రకారుడు |
భార్య / భర్త | సూర్య కుమారి |
పిల్లలు | కుమారుడు ఆదిత్య, కుమార్తె ఆరాధ్య |
తండ్రి | చంద్రయ్య |
తల్లి | అప్పల నరసమ్మ |
జననం
మార్చుఇతను 1954, మార్చి 25న కృష్ణా జిల్లా విజయవాడ లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి చంద్రయ్య, తల్లి అప్పల నరసమ్మ.
చిత్రకళా ప్రస్థానం
మార్చుస్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన బొండా జగన్మోహనరావు తన చిన్నతనం నుంచీ అభ్యుదయ భావాలతో పెరిగాడు. తన కుటుంబంలో ఎవరికీ చిత్రకళలో అనుభవం లేదు. జగన్మోహనరావు తన మూడవ తరగతి నుంచే ప్రతి రోజు బొమ్మలను వేయడానికి ప్రయత్నించేవాడు. ఈయన మొదటి కార్టూన్ ఆంధ్రపత్రికలో 80వ దశకంలో ప్రచురితం అయ్యింది. వివిధ పత్రికలలో సుమారు 300 కార్టూన్లు ప్రచురించబడ్డాయి. చిన్నతనం నుంచే పెయింటింగ్స్ పై పున్న ఆసక్తితో చిత్రకారుడిగా పలు చిత్రాలు గీసిన జగన్మోహనరావుకు వడ్డాది పాపయ్య, బాపు ల స్ఫూర్తిగా నిలిచారు. వారి చిత్రాలను గమనిస్తూ, వాటిలోని అర్ధాన్ని గ్రహిస్తూ జగన్ తాను చిత్రాలు గీయడం ప్రారంభించాడు. బి.కాం. డిగ్రీ పూర్తి చేసి, విజయా బ్యాంక్ లో ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు.
పురస్కారాలు
మార్చుఇప్పటివరకు దాదాపుగా 500లకు పైగా పెయింటింగ్స్ వేసిన జగన్మోహనరావు అనేక పురస్కారాలు అందుకున్నాడు.
- బ్యాంకింగ్ పరిశ్రమలో సేవకు సిల్వర్ జూబ్లీ మైల్‌స్టోన్ అవార్డు
- కటక్ లో గల అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి జ్యోతీష్య శ్రీ అవార్డు
- గిరిజన కళా గౌరవ్ సమ్మాన్-2022
- నెల్సన్ మండేలా గ్లోబల్ బ్రిలియన్సీ అవార్డ్-2022
- కళా గౌరవ్ సమ్మాన్-2022, స్వదేష్ నవరత్న అచీవర్స్ అవార్డ్-2023
- మహాత్మగాంధీ గ్లోబల్ ఫీస్ అవార్డ్-2023
- స్వదేశ్ సంస్థాన్ ఇండియా వారి ఇంటర్నేషనల్ నోబుల్ ఆర్టిస్ట్ అవార్డ్ -2024
ఇతర విషయాలు
మార్చుచిన్నతనం నుంచే సామాజిక అంశాలపై అవగాహనతో పెరిగిన జగన్ బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సమయంలో గిరిజనుల జీవితాలను దగ్గర నుండి చూసి, స్పూర్తిని పొంది… ఒక చిత్రకారుడిగా తనకున్న ప్రతిభను ప్రాయోజిత చిత్రాలుగా మరల్చి జన జాగృతం చేశాడు. గిరిజనుల జీవితాలపై చిత్రకారులు, ఔత్సాహిక చిత్రకారులు చిత్రాలు గీయాలని, తద్వారా వారి జీవితాలను నాగరీకులకు అర్ధం అయ్యేలా చేసి గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డాడు.
ఆర్ట్ గ్యాలరీ
మార్చువిజయా బ్యాంక్ లో వివిధ హోదాల్లో పనిచేసిన జగన్ మేనేజర్ గా 2015 పదవీవిరమణ చేసిన పిదప పూర్తిగా చిత్రకళా సాధనకే పరిమితమయ్యాడు. తను చిత్రించిన వందలాది చిత్రాలను పదిమందికి చూపాలన్న అభిలాషతో తన ఇంటినే ఒక గ్యాలరీగా మార్చుకున్నాడు.