బొమ్మను చేసి ప్రాణము పోసి

బొమ్మను చేసి ప్రాణము పోసి పాట దేవత (1965) చిత్రంలోనిది. దీనిని పాడినవారు ఘంటసాల, రచించినది శ్రీశ్రీ. దీనిని ఎన్.టి.రామారావు మీద చిత్రీకరించారు.

పాటలోని సాహిత్యంసవరించు

ఉపోద్ఘాతం:
బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా
కన్నీటి ధారగా.. కరిగిపోయే
తలచేది జరుగదు - జరిగేది తెలియదు

పల్లవి :
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక.. | | | బొమ్మను | | |

చరణం 1:
అందాలు సృశ్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే.. | | | బొమ్మను | | |

చరణం 2:
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే .. | | | బొమ్మను | | | --- శ్రీశ్రీ

సాహిత్య పరిమళాలుసవరించు

ఇదొక విషాదగీతం. దేవుడు మనిషిని బొమ్మగా ఇలలో సృష్టించి దానితో నాటకంలో పాత్రల వలె ఆడిస్తున్నాడని వివిధ రకాలుగా తన బాధను వ్యక్తం చేస్తూ పాట సాగుతుంది. చీకటి వెలుగులు, ఎన్నో రకాల అందాలు, ఆనందాలు, అంతులేని ఆశ, అనురాగాలు మొదలైన బంధాలతో మనిషిని కట్టిపడేసి చోద్యం చూస్తున్నావని అర్ధాన్ని కవి అందించాడు.

చిత్రీకరణసవరించు

ఈ పాటను నందమూరి తారక రామారావు మీద మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. కథా నేపథ్యంలో ఒదిగే విధంగా ఒక జడివానలో ఒంటరిగా బాధాతప్త హృదయంలో కథానాయకుడు ఈ పాటను పాడినట్లుంటుంది. దేవదాసు మాదిరిగా ఒక కుక్క, ఎండి మోడువారిన చెట్టు కూడా సన్నివేశాన్ని బలాన్ని చేకూర్చాయి.

బయటి లింకులుసవరించు