దేవదాసు (1953 సినిమా)
సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల భారతీయ సినిమా నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్ర కథ అయ్యింది.
దేవదాసు (1953 తెలుగు సినిమా) | |
దేవదాసుగా అక్కినేని దీపశిఖ రేఖాచిత్రం | |
---|---|
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
నిర్మాణం | డి.యల్.నారాయణ |
కథ | శరత్ చంద్ర |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (దేవదాసు), సావిత్రి (పార్వతి), యస్.వీ.రంగారావు (జమీందారు నారాయణ రావు), చిలకలపూడి సీతారామాంజనేయులు (జమీందారు భుజంగ రావు), లలిత (చంద్రముఖి) , దొరైస్వామి (నీలకంఠం), ఆరణి సత్యనారాయణ (ధర్మన్న), శివరాం పేకేటి (భగవాన్), ఆర్.నాగేశ్వరరావు , సీతారామ్ (బండివాడు), కంచి నరసింహారావు |
సంగీతం | సి.ఆర్.సుబ్బురామన్ విశ్వనాథన్ - రామమూర్తి |
నేపథ్య గానం | జిక్కి కృష్ణవేణి, కె.రాణి, రావు బాలసరస్వతీదేవి, ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | బి.యస్.రంగా |
కళ | వాలి, ఘోడ్‌గావంకర్ |
అలంకరణ | మంగయ్య |
కూర్పు | పి.వి.నారాయణ |
నిర్మాణ సంస్థ | వినోదా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదంతెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్కు అంకితమిచ్చారు.
కథ
మార్చుదేవదాసు (అక్కినేని నాగేశ్వరరావు ) రావులపల్లి జమీందారు నారాయణ రావు (యస్.వీ.రంగారావు) గారి ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి (సావిత్రి), దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు. పార్వతి చిన్నతనం నుండే దేవదాసు పైన్ నోరు పారేసుకోవటం, దేవాదాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా జూదవ్యసనుడౌతాడన్న భయంతో, పై చదువుల కోసం జమీందారు అతనిని పట్నం (బహుశా మద్రాసు) పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు. ఆస్తి, కులం తక్కువ అని వారిని జమీందారు అవమానపరుస్తారు. తండ్రిని ఒప్పించటంతో దేవదాసు విఫలుడౌతాడు. తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకొన్న పార్వతికి తల్లిదండ్రులని ఎదిరించి పెళ్ళి చేస్కోలేనని తెలుపుతాడు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే, ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి సమయం కోరుతాడు దేవదాసు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు.
జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని, పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు (సి.యస్.ఆర్. ఆంజనేయులు) తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ (శివరాం పేకేటి) మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్ననూ దేవదాసు తాగుడుకి బానిసౌతాడు. ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు.
చంద్రముఖి (లలిత) అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ, పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు.
మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించటంతో కథ ఖేదాంతం అవుతుంది.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- దేవదాసు - అక్కినేని నాగేశ్వరరావు
- పార్వతి - సావిత్రి
- జమీందారు నారాయణ రావు - యస్.వీ.రంగారావు
- భుజంగరావు - చిలకలపూడి సీతారామాంజనేయులు
- చంద్రముఖి - లలిత
- నీలకంఠం - దొరైస్వామి
- ధర్మన్న - ఆరణి సత్యనారాయణ
- భగవాన్ - శివరాం పేకేటి
- ఆర్.నాగేశ్వరరావు
- బండివాడు - సీతారామ్
- కంచి నరసింహారావు
- చంద్రకుమారి
- సురభి కమలాబాయి
- వెంకయ్య
- సీత
- అన్నపూర్ణాదేవి
- విజయలక్ష్మి
- బి.యస్.ఆర్.కృష్ణ
- డబ్బాచారి
- సుధాకర్
- కమల
- లక్ష్మి
- ప్రభావతి
- బేబీ అనూరాధ
పాటలు
మార్చుపాట | గీతరచన | గానం | సంగీతం | నటీనటులు |
---|---|---|---|---|
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా | సముద్రాల రాఘవాచార్య | కె.రాణి | సావిత్రి | |
అందం చూడవయా ఆనందించవయా | సముద్రాల రాఘవాచార్య | రావు బాలసరస్వతి | ||
ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా! పంతమా మువ్వ గోపాలా! నా స్వామీ! | క్షేత్రయ్య | రావు బాలసరస్వతి | ||
ఓ దేవదా చదువు ఇదేనా (పెద్దలు) | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | |
ఓ దేవదా చదువు ఇదేనా (పిల్లలు) | సముద్రాల రాఘవాచార్య | కె.రాణి | ||
కల ఇదని నిజమిదని తెలియదులే బతుకింతేనులే | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు | అక్కినేని నాగేశ్వరరావు | |
కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్ | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు | అక్కినేని నాగేశ్వరరావు | |
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతె | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.రాణి | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | |
జగమే మాయ బ్రతుకే మాయ | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు | అక్కినేని నాగేశ్వరరావు | |
పల్లెకు పోదాం పారుని చూదాం చలో చలో | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల వెంకటేశ్వరరావు | అక్కినేని నాగేశ్వరరావు |
ఇతర సినిమాలు
మార్చు1937లో హిందీలో పి.సి.బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించాడు (కె.ఎల్.సైగల్, జమున). అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు, దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది. మళ్ళీ 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రాసేన్‌లతో మరొక దేవదాసు వచ్చింది. మళ్ళీ హిందీలోలో షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లతో 2002లో ఇదే కథ సినిమాగా వచ్చింది. అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు. 1974లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50రోజులు ఆడీతే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడింది.
విశేషాలు
మార్చు- ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు. ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ళ తరువాత కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి.
- భగ్నప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు.
- 1971 లో విడుదలైన (ప్రేమనగర్), 1981 లో విడుదలైన (ప్రేమాభిషేకం) లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తు చేయటం
- యావత్ భారతదేశంలో భగ్నహృదయులైన వారిని సరదాకి దేవదాసుగా వ్యవహరిస్తుంటారు.
- నూరురోజుల పండుగను హైదరాబాదు, రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. అక్కినేని, ఎన్టీఆర్, సావిత్రి, వాణిశ్రీ వంటి తెలుగు సినీప్రపంచపు అతిరథ మహారథులందరూ ఆ వేడుకకు విచ్చేశారు.[1]
చిత్రమాలిక
మార్చు-
దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు
-
దేవదాసుగా అక్కినేని, తోడుగా కుక్క - "జగమే మాయా" పాట చిత్రీకరణ
మూలాలు
మార్చు- ↑ సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 August 2018. Retrieved 7 August 2020.
వనరులు
మార్చు- సినిగోవర్.కమ్ లోని వ్యాసం , బొమ్మ
- ఐడిల్బ్రెయిన్.కమ్ లోని వ్యాసం, బొమ్మ
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.